ర్యాంప్ వాక్ రోల్ మోడల్స్


సక్సెస్‌ను మించిన ఫ్యాషన్ ఏముంది? సక్సెస్‌ఫుల్ పర్సన్‌ను మించిన మోడల్స్ ఎవరుంటారు?  అందాలను ఒలకబోస్తూ, వయ్యారాలు పోయే ప్రొఫెషనల్ మోడల్స్.. విజయాలకు ప్రతీకలైన నారీమణుల ముందు దిగదుడుపే కదా. దీనినే నిరూపిస్తున్నాయి ఇటీవల నగరంలో నిర్వహిస్తున్న కొన్ని ఫ్యాషన్ షోలు. ర్యాంప్ ‘షో’ అంటే మోడల్స్‌కు మాత్రమే పరిమితమనే సూత్రాన్ని తిరగరాస్తూ.. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారికి ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న ఈ తరహా షోలు సూపర్‌హిట్ అవుతున్నాయి.

 

హుందాగా మెరిసిపోయే పొడవాటి  వేదిక.. దాని మీద వయ్యారంగా సాగే నడక. పేరు ర్యాంప్‌వాక్. పొలిటీషియన్స్ నుంచి వెండితెర ప్రముఖుల దాకా అతిరథ మహారథుల వంటి అతిధులు, నిర్విరామంగా వెలిగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు, వీటన్నింటి మధ్యలో తడబడకుండా నడవడమే కష్టం. ఇక వయ్యారాలు ఒలకబోయాలంటే.. ప్రొఫెషనల్ మోడల్స్‌కు మాత్రమే సాధ్యం అనుకునేవారు ఒకప్పుడు.. అయితే సిటీలో సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ర్యాంప్‌వాక్‌కు పెరుగుతున్న క్రేజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు పెళ్లయి, తల్లులయినా ఫిట్‌నెస్‌ను మెయిన్‌టైన్ చేస్తూ దానికి తమ సక్సెస్ అనే బ్యూటీని అదనంగా జత చేస్తూ  ఆహూతుల మనుసులు గెల్చుకుంటున్నారు.  వారిలో కొందరు మహిళలతో సిటీప్లస్ సంభాషించింది.

 

 ఫస్ట్ అండ్ బెస్ట్...

 ఫ్యాషన్ రంగంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడూ ర్యాంప్‌వాక్‌కి ఓకె చెప్పలేదు. అయితే మొన్న జరిగిన ఒక చారిటీ ఈవెంట్లో మాత్రం పార్టిసిపేట్ చేశాను. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి నేపథ్యం ఉన్న షోలో పాల్గొన్నాననే కాకుండా ఆత్మవిశ్వాసం ఉట్టిపడే నడకతో అందరి హర్షధ్వానాలు అందుకోవడం ఆనందాన్నిచ్చింది.

 -అయేషా లఖోటియా, ఫ్యాషన్ డిజైనర్

 

 ఫిట్ ఫర్ షో..

 రోజూ ఇంటికి ఫిట్‌నెస్ ట్రైనర్ వస్తారు. రోజుకి రెండు గంటలు అన్ని రకాల వ్యాయామాలు చేస్తాను. మనం ఫిట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉన్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే పెళ్లయినా, తల్లయినా ర్యాంప్‌వాక్‌కు జంకాల్సిన పనిలేదు. నాలుగైదు సార్లు ర్యాంప్ వాక్ చేశాను. అందరి ముందు మోడల్ తరహాలో నడవడం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆ ఆత్మవిశ్వాసం నాకు అవసరమైనదే.

 - బీనా మెహతా, బిజినెస్ ఉమెన్

 

 మంచి  వేదిక

 ర్యాంప్‌వాక్ అంటే మోడల్స్‌కే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన ప్రతినిధులుగా వాటిని రిప్రజెంట్ చేస్తూ మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఇది  చక్కని వేదిక. ఇదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.

 - పూర్ణిమ మండవ, సెలబ్రిటీ వెల్‌నెస్ కోచ్

 

 ఇది ఇంటర్నేషనల్ స్టైల్...

 విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వాళ్లతో ర్యాంప్‌వాక్ చేయించడం మన దగ్గర ఇప్పుడిప్పుడే పెరుగుతోంది  ఇది విదేశాల్లో సర్వసాధారణం. సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌తో రూపొందిన కేలండర్స్ కూడా విడుదల చేస్తారు.

 -కరుణా గోపాల్, ఫ్యూచర్ సిటీస్

 

 ఆనందంగా ఉంది..

 విభిన్న రంగాల్లో విజయవంతమైన మహిళల్ని ర్యాంప్‌పై చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మహిళలు ర్యాంప్ వాక్ చేస్తుంటే హాజరైన మహిళలు సైతం మరింత బాగా స్పందిస్తారు. ఎందుకంటే వారితో తమని ఐడెంటిఫై  చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా మోడలింగ్, గ్లామర్ రంగాలకు సంబంధం లేని మహిళలతో ఒక షోని నిర్వహిస్తే చూడాలని ఉంది.

 - రేణు సుఖేజా, కొరియోగ్రాఫర్

 - ఎస్.సత్యబాబు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top