తీన్మార్ రచ్చ

తీన్మార్ రచ్చ - Sakshi


మీ.. రాములమ్మ (రమ్యకృష్ణ)

రాములమ్మ.. తీరైన బొట్టు, వాలుజడ, చేతినిండా గాజులతో ‘తీన్మార్ న్యూస్’లో యాంకర్‌గా పరిచయమైన హైదరాబాదీ. తెలంగాణ యాసతో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఫిజియో థెరపీ చదువుతూనే ‘రాకింగ్ రాములమ్మ’గా అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఏదో ట్రైచేద్దామనుకుంటే నా స్టార్ తిరిగిందంటున్న ఈ సిటీగాళ్ ముచ్చట్లు ‘మీ’కోసం...

 

నా అసలు పేరు రమ్యకృష్ణ. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. చదువు కూడా ఇక్కడే. ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చేస్తున్న. స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే ఒక్క చదువు విషయంలో తప్ప దేనికీ ప్లానింగ్ చేయను. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తా. అందుకే ఫిజియోథెరపీలో ఉండగానే చానల్‌లో ఒక స్పెషల్ ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ నడుస్తున్నయని చెబితే... చలో పబ్లిక్‌తో మాట్లాడనీకి ఒక ఆప్షన్ దొరుకుతుంది గదా, నా జాతకం ఎట్లుందో ట్రైజేద్దాం అని పొయిన. లక్కీగా సెలక్ట్ అయిన. నా స్టార్ తిరిగింది. తీన్మార్ ప్రోగ్రామ్‌ల రాములమ్మలా అవతరామెత్తిన. ఒక ఏడాదంతా ప్రోగ్రాం చేసిన. దాంతో ఆ ఏడంతా నాకు ఇష్టమైన చదువుకు దూరమైన.

 

మళ్లీ స్టడీస్...

ఇట్ల కాదులే అని మళ్లీ కాలేజీలో జాయిన్ అయిన. ఇప్పుడు రోజూ కాలేజీకి వెళ్తూ వీకెండ్స్‌లో 6టీవీలో ‘రాకింగ్ రాములమ్మ’ ప్రోగ్రామ్‌తో మళ్లీ జనానికి దగ్గరైన. సెలబ్రిటీస్‌తో ముచ్చట్లు, కామన్‌మ్యాన్‌తో చిట్‌చాట్, వీక్‌డేస్‌లో స్పెషల్‌క్లాసులు, హోమ్‌వర్క్‌లు మస్తు బిజీ. మస్తు ఖుషీ! అయితే అప్పుడప్పుడు నేనేంది ఛానల్స్‌లో పనిజేసుడేంది అని ఆలోచిస్తుంటి. అప్పుడు మా అమ్మ చెప్పింది.. నేను చిన్నప్పుడు పగిలిపోయిన ఎర్రటి రబ్బర్‌బాల్‌కి కట్టె గుచ్చి మైక్‌లాగ చేతిలో పట్టుకుని టీవీ చూస్తూ న్యూస్‌రీడర్‌లాగ చేసేదాన్నట. బహుశా నాకు ఊహ తెల్వనప్పటినుంచే ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అనుకుంటా.

 

గోల్‌గప్పాలంటే ఇష్టం...

నీళ్లల్లో ఉన్న చేప బయటికొస్తే ఎంత విలవిల్లాడుతుందో... హైదరాబాద్ ఇడిసి బయటకు పోవాల్సి వస్తే నాదీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ఊపిరి ఆడనట్టు ఫీలవుతా. సిటీ విషయానికొస్తే... బేగం బజార్‌లో గాజులు, కోఠిలో బట్టలు, అబిడ్స్‌లో చెప్పులు... ఇలా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు తిరగని ప్లేసంటూ లేదు.



నాకు బాగా నచ్చే ఫుడ్ ‘గోల్‌గప్పాలు’.. అంటే పానీపూరి. అవి ఉంటే చాలు నాకు అన్నం కూడా అవసరం లేదు.నిజం చెప్పాలంటే నాకు పల్లెలు, అక్కడి పచ్చటి పొలాలు అన్నా ఇష్టమే. ‘చంటి’ సినిమాలో మీనాలా ఆటలాడుకోవాలనిపిస్తది. కానీ నాకు చుట్టాలుపక్కాలు, అక్కలు, చెల్లెళ్లు అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నరు. పల్లెటూరికి పోదామంటే తెల్సినోళ్లెవ్వరు లేరు. ఈ విషయంలో మాత్రం అన్‌లక్కీ!

 - శిరీష చల్లపల్లి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top