కాయస్థుల కీర్తి పతాక

కాయస్థుల కీర్తి పతాక


దిల్లీ నుంచి వచ్చిన దక్కన్ పాలకులతో కొన్ని తరాల కిందట వలస వచ్చారు కాయస్థులు. నిజాంలకు కుడి భుజంగా వ్యవహరిస్తూ జనహితంగా విధి నిర్వహణ చేయడం వారి ప్రత్యేకత. భవానీ ప్రసాద్, కిషన్ ప్రసాద్‌లు అందుకు ఉదాహరణ. ప్రజలపట్ల సమభావన చూపే పాలకుల వారసుడు ప్రజాహితానికి దూరమైతే ఒక ఆదర్శ కాయస్థుడు ఎలా ఉంటాడు? ఏడో నిజాం హయాంలో 1918లో నగరంలో జన్మించిన రాజ్ బహదూర్ గౌర్‌లా ఉంటాడు !

 

 ‘రాజ్’ ప్రతిభావంతుడైన విద్యార్థి. స్కాలర్‌షిప్‌లతో 1934లో రీడింగ్ రూమ్, గ్రంథాలయం ఏర్పరచిన జిజ్ఞాసి. 1939లో హైదరాబాద్‌లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. మరుసటి సంవత్సరం కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యుడు. 1941లో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. కాలేజీ మ్యాగజైన్ సంపాదకుడు. సమాజం రోగగ్రస్తమైనపుడు దేహ చికిత్స కంటే దేశ చికిత్సే ప్రధానమైందని భావించిన కోవలోని వాడు డాక్టర్ రాజ్ ! లక్ష్యసాధనకు ట్రేడ్ యూనియన్ వాహికగా భావించాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏహెచ్‌టీయూసీ)కు ఉర్దూ కవి మగ్దూం మొహియుద్దీన్ అధ్యక్షుడు, రాజ్‌బహదూర్ గౌర్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. 1946 అక్టోబర్ 17న ఏహెచ్‌టీయూసీ నిర్బంధ వ్యతిరేక దినం పాటించింది. రజాకార్ల చేతిలో కీలుబొమ్మలా ఉన్న నిజాం ప్రభుత్వం ఉద్యమకారులపై విరుచుకుపడింది. తెలంగాణ అంతటా కమ్యూనిస్టులను, ఆర్య సమాజీకులను ముమ్మరంగా అరెస్ట్ చేసింది. నవంబర్ 15న సహచరులతో రాజ్ అరెస్టయ్యాడు.

 

 నిజాం ‘పంటి’నుంచి జారాడు


 ‘విశ్వసనీయ కుటుంబం నుంచి వచ్చిన విద్రోహి’ అంటూ గౌర్‌పై నిజాం సర్కార్ కుట్రకేసు మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బయట ముఖ్యమైన పనులెన్నో ! తాను లోపల ఉండటమేంటి ? ఇది రాజ్ ఆలోచన ! తనకూ, సహచరుడు జవాద్ రజ్వీకి తరచూ జ్వరం వస్తోందని జైలర్‌కు చెప్పాడు. ఇరువురి ఆరోగ్యంలో లోపం కన్పించలేదన్నాడు డాక్టర్ బంకట్ చందర్. అయినా, డెంటిస్ట్‌కు చూపించమన్నాడు. ఏడో నిజాం పేరుతో ఏర్పడిన ఉస్మానియా ఆస్పత్రిలో డెంటల్ విభాగం అధిపతి డా.మోరిస్ ఎక్విప్‌మెంట్‌ను జైలుకు తరలించడం వీలు కాదు కాబట్టి రోగులను ఆస్పత్రికి తీసుకు రమ్మన్నాడు. 1947 మే 7వ తేదీ, ఉస్మానియా వెనుక గేట్ నుంచి ఎస్కార్ట్ పోలీసులు ‘పేషెంట్స్’ను దవాఖానాలోకి తీసుకెళ్లారు. ఆ రోజు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఎక్కువ మంది పోలీసులు సెక్యూరిటీలో ఉన్నారు. చాలా మంది కామ్రేడ్స్ పథకం ప్రకారం డెంటిస్ట్ దగ్గర క్యూ కట్టారు. డాక్టర్ దగ్గరకు పోలీసులు వెళ్లకూడదని అభ్యంతరాలు పెట్టారు. లోపలకు వెళ్లిన రాజ్ ద్వయం డాక్టర్ పరంజపే సహకారంతో క్లినిక్ వెనుక గేటు నుంచి బేగంబజార్‌కు ఉడాయించారు. స్టార్ట్ చేసి ఉన్న కారులో ఆసిఫ్‌నగర్‌కు, అక్కడ కారు మార్చి, అజ్ఞాతవాసానికీ వెళ్లిపోయారు! నాలుగేళ్ల తర్వాత 1951 ఏప్రిల్ 24న రాచకొండ అడవుల్లో ఒక చెరువులో నీరు తాగుతుండగా అరెస్టయిన రాజ్ బహదూర్ 13 నెలలు జైలులో గడిపారు. చిత్రహింసలను పంటి బిగువున భరించిన రాజ్, తన మూల గదిలో సహచర ఖైదీలతో సాహితీ చర్చలు జరిపేవాడు. ఆ గది పేరు ‘షాస్ కార్నర్’!

 

 ‘పోరాటం’పై పశ్చాత్తాపం లేదు!

 పోలీస్ చర్య తర్వాత తెలంగాణ సాయుధపోరాటాన్ని ఆపాలని విశ్వసించిన వ్యక్తుల్లో రాజ్ ముఖ్యుడు. అప్పటి పరిస్థితుల్లో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను గౌరవించడమే సబబు అని భావించారు. తర్వాత కాలంలో స్టాలిన్ సాయుధపోరాటాన్ని విరమించాల్సిందిగా సూచించడం కాకతాళీయమే కావచ్చు! వ్యక్తిగతంగా తాను విబేధించినా, సాయుధపోరాట  మార్గాన్ని ఎంచుకున్న పార్టీ నిర్ణయాన్ని రాజ్ నిబద్ధతతో అనుసరించేవాడు! మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే ఎలా ఉంది అని 2011లో తాను చనిపోవడానికి రెండేళ్ల క్రితం అడిగాను. ‘చాలా సందర్భాల్లో మేం వింతగా ప్రవర్తించాం. మూర్ఖంగానూ! దానర్థం పశ్చాత్తాపపడాల్సిన రీతిలో వ్యవహరించాం అని కాదు. తెలంగాణ  సాయుధపోరాటం మూడు ప్రవాహాల సంగమం! ఆర్థిక స్థితిగతులు-రాజకీయాల-సాంస్కృతిక అంశాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఆ పరిస్థితుల్లో యువత ఆ పోరాటంలో చేరడం అనివార్యం! తమ కష్టాలు తొలగనంతకాలం రూపం ఏదైనా ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటుంది’ అన్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ఆయనలో తడబాటు లేదు!

 

 చిక్కడపల్లిలో ‘చమేలీ కా మండ్వా’!

 కమ్యూనిస్ట్ పార్టీ పోరాట విరమణను ప్రకటించింది. పోరాట కాలంలో పరిచయమైన బ్రిజ్‌రాణిని రాజ్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడుండాలి ? ఒక సమస్య దారి చూపింది! చిక్కడపల్లి నాలా దగ్గర ఒక మురికివాడ ఉంది. అధికారులు అక్కడి పేదవారి నివాసాలను ఖాళీ చేయిద్దామనుకున్నారు. బ్రిజ్‌రాణి అడ్డుకుంది. తమతో కలసి ఉండాల్సిందిగా మురికివాడ ప్రజలు కోరారు. అలా రాజు-రాణి ఒక ఇంటివారయ్యారు! రష్యాలో వైద్యం చదివిన వీరి కుమార్తె తమారా 1982లో అదే స్థలంలో చిన్న పక్కా ఇల్లు నిర్మించారు. రాజ్ ఆ ఇంటిని ‘చమేలీ కా మండ్వా’ అనేవాడు. తన స్నేహితుడు మగ్దూం మొహియుద్దీన్ కవిత పేరది! ‘చా చా చా’ సినిమాలోని ఆపాటను యూట్యూబ్‌లో (www.youtube.com/ watch?v=_A-BAt4k2gU) ఆలకించండి!

 

 తమారా కన్నీరు ! పన్నీరు !!

తండ్రి గురించి కుమార్తె చెప్పిన ఒక సంఘటన ఆసక్తికరం. ఎనిమిదేళ్ల తమారా తండ్రిని ఎందుకో కొంత పైకం అడిగింది. ‘లేదు వెళ్లు’ అని రాజ్ అంటుండగా.. అదే సమయంలో అక్కడికి ఒక సందర్శకుడొచ్చాడు. తమారాకు ‘రూపాయి’ ఇచ్చాడు. ‘జీవితంలో నాన్న చేత చెంపదెబ్బ తిన్నది ఆ ఒక్కసారే..’ అంది తమారా చెమర్చిన కళ్లతో ! అప్పుడు నాన్న పార్లమెంట్ సభ్యుడు. ఏదో ‘పని’ని ఆశించి అతడు వచ్చాడని కొన్నేళ్ల తర్వాత నాన్న వివరిస్తే కానీ నాకు అర్థం కాకపోవడం సహజమే కదా ! ‘కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ‘మగ్దూం మామూ’ ఆదుకునేవాడు. బేటీ నీకేం కావాలని అడిగి మరీ ఇప్పించేవాడు. మామూను కోరిన ఖరీదైన వస్తువులు నోట్ బుక్ లేదా ఐస్‌క్రీమ్ అన్నప్పుడు తమారా కన్నుల్లో ఎంత మెరుపో..!

 

 స్నేహం పూచిన పువ్వులు

 ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో రాజ్ ‘బహదుర్‌షా జాఫర్’ అవార్డు పొందారు. పురస్కారంతో పాటు పాతికవేల రూపాయలు అందుకున్నారు. ఇంత పెద్దమొత్తాన్ని ఏం చేద్దాం అని కుమార్తెను రహస్యంగా అడిగారు రాజ్! తీర్చాల్సిన అప్పులను గుర్తు చేసింది తమారా ! అప్పులు పోగా మిగిలిన పదివేల రూపాయలను మగ్దూం ట్రస్ట్‌కు అందజేశారు రాజ్ ! మగ్దూం కంటే రాజ్ పదేళ్లు పెద్ద. ‘మగ్దూం నా గురువు, స్నేహితుడు, వల్లభుడు’ అనేవారు రాజ్. ఇరువురూ కలసి పాడుకున్నారు. మధుపానం చేశారు. ఉద్వేగం చెందారు. మగ్దూంను తలచుకోని రోజు రాజ్ జీవితంలో లేదు. రాజ్-మగ్దూంలు హైదరాబాద్‌లో పూచిన ఒకే కొమ్మ పువ్వులు. మగ్దూం పరిమళాలు మరోసారి...

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top