రెడీ మెయిడ్.. ఆన్‌లైన్‌లో మన మనిషి

రెడీ మెయిడ్.. ఆన్‌లైన్‌లో మన మనిషి


‘ఇవ్వాళ పనమ్మాయి వస్తుందో రాదో.. ఒకవేళ వచ్చినా, మళ్లీ ఏదో ఒక వంకతో ఊరికి వెళతా అంటుందేమో.. పోనీ తను వెళుతుంటే కనీసం వేరే పనమ్మాయినైనా పెడుతుందో లేదో..’ పొద్దున్న బెడ్ మీద నుంచి లేచీలేవకముందే సిటీలోని గృహిణుల బుర్రలో నిద్రలేచే భయాలివన్నీ. ఇది ఒక్క పనిమనిషి విషయంలో మాత్రమే కాదు.. స్థాయి, అవసరాన్ని బట్టి కారుడ్రైవర్ నుంచి ఓల్డేజ్ పర్సన్స్ కేర్‌టేకర్స్ వరకూ ఇంటింటా కనిపించే తంటానే ఇది. వీరి అవసరాలనే తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి కొన్ని సంస్థలు. డొమెస్టిక్ హెల్ప్ సర్వీస్ పేరుతో లభిస్తున్న సేవలిపుడు సిటీజనులను ఆకర్షిస్తున్నాయి.

 

 నేటి బిజీ లైఫ్‌లో ఇంట్లో పనులన్నీ ఒక్కరే చేసుకోవడం కష్టమైపోతోంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వారి కష్టాలు చెప్పనక్కర లేదు. అందుకే పనిమనుషులు తప్పనిసరి అయ్యారు. అయితే సరైన పనివారు దొరకకపోతే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ముక్కూ మొహం తెలియనివారిని పనిలో నియమించుకుంటే.. వారు అరాచకాలకు పాల్పడుతున్న సంఘటనలూవెలుగులోకి వస్తుండటం తెలిసిందే. అందుకే నమ్మకమైన, నైపుణ్యమున్నవారిని చూసి.. సర్టిఫికెట్ ఇచ్చి మరీ పనిమనుషులను అందిస్తున్నాయి కొన్ని సంస్థలు.

 

 సెర్చ్ చేస్తే సరి

 సర్వెంట్స్ కావాలనుకున్నవారు గూగుల్‌లో డొమెస్టిక్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే.. వివిధ సంస్థల లిస్ట్ వస్తుంది. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లలోకి లాగిన్ అయితే వివరాలన్నీ వారి ముందు ప్రత్యక్షమవుతాయి. ఎలాంటి సర్వెంట్ కావాలి, వారి వయస్సు ఎంత ఉండాలి, చదువు ఉండాలా.. లేదా, ఎంత టైమ్ పని చేయాలి.. లాంటి వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత సదరు సంస్థవారు మీతో కాంటాక్ట్‌లోకి వస్తారు. వీరందించే సేవల్లో కుక్స్, ఆయాలు, డ్రైవర్లు, పెట్స్ బాగోగులు పర్యవేక్షించేవారు, ఇంట్లో పెద్ద వయసు వారికి సేవలు చేసేవారు.. ఆయా సంస్థల సేవల్లో ప్రధానం.  వీరి నియామకం విషయంలో ఈ సంస్థలు చాలా కసరత్తు చేస్తాయి.

 

  పనివారిని నియమించుకోవడానికి స్లమ్ ఏరియాలలో తమ సంస్థ గురించి ప్రచారం చేస్తారు. ప్రయోజనాలు తెలుసుకుని, పనిచేసేందుకు ఇష్టపడినవారిని నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. అన్ని విధాలా బాగున్నారని రూఢీ చేసుకున్నాకే సంస్థలో నియమించుకుంటారు. వారికి ఇంటిని శుభ్రపర్చడం, వంట చేయడం, సర్వ్ చేయడం.. తదితర అంశాలపై పది రోజుల శిక్షణ ఇస్తారు. నియామకానికి ముందే వారికి సంబంధించిన గత చరిత్ర మొత్తం సేకరిస్తారు. వారి ప్రవర్తన, తీరుతెన్నులు పరిశీలిస్తారు. భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన పనివారికి ముందుజాగ్రత్తగా స్థానిక పరిస్థితులపై అవగాహన కూడా కలిగిస్తారు. వివిధ సంస్థల నుంచి పనికి వెళ్లేవారు ఎక్కవగా మహిళలే. అందుకే ఈ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికయితే సర్వెంట్ అవసరమో వారి విషయాలన్నింటినీ ముందుగా సేకరిస్తారు.

 

 ఇరుపక్షాలూ ఓకే అన్నాకే కాంట్రాక్ట్

 కుదుర్చుకుంటారు. పనిగంటలను బట్టి నెలకు రూ.7వేల నుంచి రూ.15వేల వరకు వర్కర్స్‌కు జీతాలుంటాయి.కేవలం ఇళ్లకు మాత్రమే కాదు గెస్ట్‌హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లను చూసుకోవడానికి అవసరమైన కేర్‌టేకర్స్‌ను నియమిస్తారు. ఒకవేళ మనకు వాళ్లు పంపిన వ్యక్తి పనితీరు నచ్చకున్నా, అవసరానికి సరిపడా లేకున్నా తిప్పి పంపిస్తే మరొకర్ని పంపుతారు. అలాగే పని మనుషుల బాగోగులు కూడా ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు.

 

 వారికి యజమానుల నుంచి ఇబ్బందులు రాకుండా చూస్తుంటారు. ‘బంజారాహిల్స్‌లో ఒక డాక్టర్ ఇంట్లో వంట పని, ఇంటి పని ఆరు నెలలుగా చేస్తున్నా. నెల జీతం, పనివేళల గురించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి బాగోగులు అడుగుతుంటారు. ఈ విధానం వల్ల చాలా హాయిగా ఉంది..’ అంటూ శ్రావణి సంతోషం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొన్నా. ఈ సంస్థ ద్వారా ఒక ఉద్యోగిని ఇంట్లో పనికి కుదిరాను. వంటపని, ఇంటి పని చేస్తున్నా. మా మేడమ్ బాగా చూసుకుంటారు. నా క్షేమసమాచారాల గురించి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి అడుగుతుంటారు’ అంటోంది సౌమ్య. మొత్తమ్మీద కస్టమర్స్, కేర్‌టేకర్స్‌ల మధ్య సంధానకర్తలుగానే కాకుండా సమన్వయం బాధ్యత కూడా ఆయా సంస్థల బాధ్యులు తీసుకోవడం వల్ల అందరి పని సులువవుతోంది.

 

 మాది గోల్డ్ బిజినెస్. వ్యాపార నిమిత్తం ఎక్కువగా బయట తిరగాల్సి ఉంటుంది. ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వారిని చూసుకోవడానికి గతంలో ఒకరిని బయటి నుంచి నియమించుకుంటే ఇంట్లో దొంగతనం జరిగింది. పిల్లలు ఎలా ఉన్నారోనని చాలా టెన్షన్ పడేదాన్ని. ఏడాదిన్నరగా పిల్లలను చూసుకోవడానికి ఒకరు, ఇంటి పనికి ఒకరిని ఆన్‌లైన్ ద్వారా ఓ సంస్థ నుంచి నియమించుకున్నా. ఇప్పుడెలాంటి భయాలూ లేవు.

- ప్రీతి దుగ్గిరాల, హబ్సిగూడ

 

 మా సంస్థ ద్వారా కేర్‌టేకర్స్, సర్వెంట్స్‌ని నియమించుకున్న వారు చాలా కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. ఈ విధానంలో ఉన్న నిబంధనలు పాటించడం వల్ల అటు పనివారికి, ఇటు వారిని నియమించుకున్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.

 - ఉపేందర్, మేనేజర్, గెట్ డొమెస్టిక్‌హెల్ప్ డాట్ కామ్

 -  విజయారెడ్డి

 ఫొటోలు : ఠాకూర్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top