రాహుల్ నవ్వాలి

గొల్లపూడి మారుతీరావు


 జీవన కాలమ్

 పాపులారిటీ పెరగాలంటే రాహుల్ గాంధీ ఏం చెయ్యాలి? సంజయ్ నిరుపమ్‌గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు.



 ఈ మధ్య రాహుల్‌గాంధీ బొత్తిగా నవ్వకుండా బుంగ మూతి పెట్టుకు కనిపిస్తు న్నారు. ఎక్కడ మాట్లాడినా నుదురు ముడతలు పడు తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన పాపులారిటీ తగ్గడానికి కారణాలని ఆయన సన్నిహి తులూ, కాంగ్రెస్ నాయకులూ కొందరు గ్రహించారు. వారిలో  పవన్‌కుమార్ బన్సల్, చిరంజీవి, సంజయ్ నిరుపమ్ వంటి ముఖ్యులు ఉన్నారు. వీరు ఈ మధ్య రాహుల్‌గాంధీ గారితో ఏకాంతంగా సమావేశమ య్యారని వార్త.



 పాపులారిటీ పెరగాలంటే రాహుల్‌గాంధీ ఏం చెయ్యాలి? మరికాస్త విశాలంగా, హాయిగా నవ్వుతూ కనిపించాలి. సంజయ్ నిరుపమ్‌గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు.



 చిరంజీవి అనే మెగాస్టార్, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్టులు. వారికి గొప్ప రహస్యాన్ని ఉద్బోధించారు. ‘‘బాబూ! రాజకీయాలు కూడా ఒక విధంగా నటిం చడమే!’’ అనే బ్రహ్మసూత్రాన్ని ప్రబోధించారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ‘నటిస్తున్న’ కారణంగానే వారి రేటింగ్ పెరుగుతున్నదని చిరంజీవిగారు స్వానుభవంతో గ్రహించి ఉండవచ్చు.



 అందరి ఉమ్మడి అభిప్రాయం ఏమిటంటే- రాహుల్ గాంధీగారు ఇప్పటికన్నా పాత్రికేయులతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలి. అంటే? ఒక కాంగ్రెస్ నాయ కులు అన్నారు: ‘అప్పుడప్పుడు వాళ్ల భుజాల మీద చేతులు వెయ్యాలి’ అని.



 మోదీగారి సభల్లో వేదిక మీద ఎప్పుడూ 40 మంది ఉంటారు. వాళ్ల మధ్య ఆయన చుక్కల్లో చంద్రుడిలాగ వెలిగిపోతూంటారు. కాని రాహుల్ గారి సభల్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని దిక్కులు చూస్తున్న, బొత్తిగా చిరు నవ్వు మరచిపోయిన కమాండోలు ఉంటారు. ఇవి ఆత్మీయులయిన, అనుభవం గల సన్నిహితులు చెప్పే గొప్ప సూచనలని నేను నమ్ముతాను. కాకపోతే నావి మరికొన్ని సూచనలున్నాయి.



 రాహుల్ గాంధీగారు పత్రికా సమావేశాల్లో జొరబడి ఆర్డినెన్స్ కాగితాలు చించెయ్యడం, పార్లమెంటులో నిద్ర పోవడం వంటి కుర్ర చేష్టలు తరుచూ చేస్తుంటారు కనుక- చూడగానే పెద్దమనిషిలాగ మర్యాదగా కనిపించడానికి చిరంజీవిగారి సహాయంతో జుత్తుకి తెల్లరంగు వేయ డమో, కాస్త తెల్లబడిన జుత్తున్న విగ్గు పెట్టడమో చేయాలి. నుదురు కాస్త ముడుతలు పడినట్టు కనిపించడానికి రకరకాల మేకప్ పరికరాలున్నాయి.



 ముఖ్యంగా ఆయన ప్రతిరోజూ గెడ్డం గీసుకోవాలి. ఎప్పుడూ దిక్కుమాలిన కుర్తా కాక తరుచుగా అత్తా కోడలంచు పంచె, పొందూరు ఖద్దరు కండువా వేసు కోవాలి. ‘‘రాజకీయాలు నటన వంటివే’’ అన్న సత్యాన్ని రాహుల్‌గాంధీ గారు గీతావాక్యం లాగ గోడకు తగిలిం చుకుని ఓ మూల చిరంజీవి బొమ్మని ఉంచుకోవాలి.



 ఇక- పాత్రికేయులతో భుజం మీద చెయ్యి వేయడం చాలదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ వీపు మీద తట్టడం, మధ్య మధ్య చిలిపిగా కడుపులో పొడవడం వంటి సరదా పనులు చెయ్యాలి.



 అప్పుడప్పుడు సభల్లో దేశవాళీ అలవాట్లను మెచ్చుకుంటూ - దారి పక్కన నిలబడ్డ కుర్రాడి చేతిలో మొక్కజొన్న కండె, దూరంగా నిలబడిన అమ్మాయి చేతిలో పకోడీ పొట్లం లాక్కొని చటుక్కున నోట్లో వేసుకోవాలి. సగం సగం బట్టలున్న పేదపిల్లని హఠాత్తుగా ఎత్తుకుని కెమెరాకి కనిపించేటట్టు బుగ్గలు నిమరాలి. ఇవన్నీ తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ని ప్రజల్లో పెంచుతాయి. సందేహం లేదు.



 అయితే ముఖ్యమయిన పని మరొకటుంది. రాహుల్‌గాంధీ గారు కేవలం నవ్వడమే కాక అప్పు డప్పుడు కాస్త ఏడవడం కూడా అలవాటు చేసు కోవాలి. వాళ్ల అమ్మ హయాంలో జరిగిన దిక్కు మాలిన అవినీతులు- బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, తెల్గీ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, ప్రజా శ్రేయస్సుని కాక పార్టీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకూ ఉపకారం జరగని రీతిలో పార్లమెంటులో దీపాలార్పి రాష్ట్రాన్ని చీల్చిన కుంభకోణం- వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, అసహ్యించుకుని తమ అసహ్యాన్ని ఓట్ల ద్వారా నిర్దాక్షిణ్యంగా, కుండబద్దలు కొట్టినట్టు తెలియ చేశారనీ గుర్తుంచుకుంటే - చేసిన తప్పిదాలను - ఎలా గూ ముఖం చెల్లనిస్థితి వచ్చింది కనుక- కనీసం ఒప్పు కోవడం, పశ్చాత్తాపాన్ని ప్రకటించడం- రాజకీయ నాయకులలో అరుదయిన ‘నిజాయితీ’కి అద్దం పడ తాయి. ఏమయినా రాహుల్ గారు ముందు ముందు ఇంకా విశాలంగా, ఇంకా నిండుగా, ఇంకా మెండుగా నవ్వుతారు. అది మన అదృష్టం.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top