మదర్ ఎర్త్

మదర్ ఎర్త్


బీటలువారిన భూమి.. ‘మొక్క’వోని సంకల్పంతో ఆ పగుళ్లకు బ్యాండేజీ వేసి, చికిత్స చేస్తే.. పుట్టింది ఓ లత. భూమి నిండా పచ్చదనం అలా తీగలా అల్లుకోవాలని సందేశాన్నిస్తున్న ఈ చిత్రం.. ఇంకా మనం ఈ భూమిపై సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కడుతుంది. ధరిత్రి పట్ల మనమెంత బాధ్యతాయుతంగా ఉండాలో చెబుతుంది. నిలువెల్లా గాయాలతో విలయం అంచున ఉన్న భూమిని ఇప్పటికైనా కాపాడుకొని ఆకుపచ్చని వాతావరణాన్ని సృష్టిద్దామంటున్న ఇటువంటి చిత్రాలెన్నో...

- కళ


 

ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు.. వనాలు కరుమరుగై ఎటుచూసినా జనాలు, భవనాలు.. విషతుల్యంగా మారిపోతున్న జలాలు.. బీడుపడి గోడు వెళ్లబోసుకుంటున్న నేల.. ఈ పరిస్థితికి కారణం మనిషేనంటున్నాయి ఈ చిత్రాలు. ఎర్త్ డే సందర్భంగా బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ‘పర్‌స్పెక్టివెన్: మదర్‌ఎర్త్’ పేరుతో వరుసగారెండోసారి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 45 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు.



ఇవన్నీ ధరిత్రి సౌందర్యాన్ని.. ఈ నేలపై మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియచెప్పేవే. ‘దక్కన్ పీఠభూమి దర్పాన్ని చాటే ‘రాక్స్’.. ఇప్పుడు ఠీవిని కోల్పోతున్నాయి. మనిషి దెబ్బకు ఛిద్రమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే దక్కన్ రాతి కొండల్ని ఫొటోల్లో మాత్రమే చూడగలం’ అని చెబుతుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ అశోక్ తీసిన చిత్రం.

 

భూమే ఆధారం...

మన ఉనికికి భూమే ఆధారం. భూమి మీద ఆధారపడిన అనేకానేక జీవుల్లో మనమూ ఒకరం. కానీ నేల, నీరు, వాతావరణాన్ని మన చేష్టలతో ఎంత పాడుచేస్తున్నామో ఇక్కడ కొలువుదీరిన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. ‘పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నామో నిత్యం చేసే పనుల ద్వారా మనకు తెలుస్తూనే ఉంటుంది. మోడు వారిన చెట్లు.. గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు.. నగర జీవనంలో ఈ దృశ్యాలు కనిపించని రోజు ఉండదు. బిజీ లైఫ్‌లో పడి మన పనులు, ఆలోచనల్లో మునిగిపోతాం. ఆ దృష్టిని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫొటోలు చెబుతాయి’ అంటారు ఈ ఎగ్జిబిషన్ క్యూరేటర్ ప్రశాంత్ మంచికంటి.

 

తల్లి కంటే మిన్నగా...

‘మన మనుగడకు ఏకైక ఆధారం భూమి. అమ్మ కన్నా మిన్నగా మదర్ ఎర్త్‌ను కాపాడుకోగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. పచ్చని నేల, స్వచ్ఛమైన నీరు,  గాలిని భద్రంగా భావి తరాలకు అందించే బాధ్యత మన మీదే ఉంది’ అని చాటుతున్నాయి ఈ పర్యావరణ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు. ‘మదర్ ఎర్త్: బ్యూటీ, హర్ జాయ్స్, సారోస్ అండ్ పెయిన్.. ఈ మూడు అంశాలను ఈ చిత్రాల ద్వారా చెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటారు ప్రశాంత్ మంచికంటి.



ఉప్పొంగే సముద్రం,  కొండలు, నదులు ఈ సౌందర్యం మాటునే విధ్వంసమూ చోటుచేసుకుంటోంది. భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులు ఏమిటో ఇవి తెలియ చెబుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ తీసిన హియాలయాల చిత్రం. నింగిని తాకే వెండికొండ అందాలు.. ఆ పక్కనే గొడ్డలివేటుకు బలైన మహా వటవృక్షాల తాలూకు మోడులు.. ఈ చిత్రం భూమిపై జరుగుతున్న డిఫారెస్టేషన్‌కు నిదర్శనం.

 

ఎన్విరాన్‌మెంటల్ ఏప్రిల్


ఎర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ‘మనం బతికేందుకు అన్నీ ఇస్తున్న నేల తల్లిని ఎంతగా వేధిస్తున్నామో గ్రహించి, దానిని సరిదిద్దుకోవాలని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశం. ఏటా ఏప్రిల్ మాసాన్ని ఎన్విరాన్‌మెంటల్ ఏప్రిల్‌గా పరిగణిస్తూ మదర్ ఎర్త్ పేరుతో ఫొటో ప్రదర్శనలు, ఫిల్మ్ స్క్రీనింగ్స్, చర్చలు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు గోథెజంత్రమ్ డెరైక్టర్ అమితాదేశాయ్.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top