రంగీన్.. రంజాన్

రంగీన్.. రంజాన్


హైదరాబాద్ రంజాన్ కళతో కళకళలాడుతోంది. ప్రత్యేకమైన వంటకాల తయారీతో హోటళ్ల నుంచి వ్యాపించే ఘుమఘుమలు... దుకాణాల బయట రంగు రంగుల విద్యుద్దీపాల ధగధగలు... గుట్టల కొద్దీ పండ్లతో నిండుగా కనిపిస్తున్న బజారులు... కొత్త కొత్త వెరైటీ వస్త్రాలు, ఆభరణాలతో ఆకట్టుకుంటున్న షోరూమ్‌లు... ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మసీదులు... నగరంలో రోజూ సాయంత్రం ఇలాంటి సందడితో మొదలవుతోంది. రాత్రులన్నీ పట్టపగటి వేళలాగే వెలిగిపోతున్నాయి. పాతబస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంజాన్ మాసంలో పాతబస్తీ అంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. దాదాపు నెల్లాళ్లు ముందుగానే ఇక్కడి మార్కెట్లు, మసీదులు రంజాన్‌కు సిద్ధమవుతాయి. వీధుల్లో నోరూరించే కబాబ్‌లు, పత్థర్ కా గోష్, దహీబడే, హలీం వంటి వంటకాలు చవులూరిస్తాయి.

 

 రకరకాల దుకాణాలు పాతబస్తీకి కొత్త శోభను తెస్తాయి. కులమతాలకు అతీతంగా నగర వాసులందరికీ పాతబస్తీనే షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది. తినుబండారాలతో పాటు దుస్తులు, పాదరక్షలు, టోపీలు, మహిళల అలంకరణ సామగ్రి విక్రయించే దుకాణాలు, ఒకే ధరకు రకరకాల వస్తువులు విక్రయించే ‘హర్ ఏక్ మాల్’ దుకాణాలు ఎక్కువగా సాయంత్రం వేళల్లోనే తెరుచుకుంటాయి. ఏటా కొత్త కొత్త ఉత్పత్తులతో రంజాన్ నెలలో ఏర్పడే సీజనల్ దుకాణాలు... ఉపవాస దీక్షలు ముగిసే నాటికి సరుకును దాదాపు పూర్తిగా విక్రయించేస్తాయి. ప్రారంభంలో ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గుముఖం పడతాయి. ఈద్-ఉల్-ఫితర్ ఇక రెండు రోజులుందనగా, ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కొనుగోలుదారులు అడిగినంత ధరకు దుకాణదారులు ఇచ్చేస్తుంటారు. దీంతో రంజాన్ నెల చివరి రోజుల్లో బజారులన్నీ జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి.

-  ముహ్మద్ మంజూర్

 ఫొటోలు: వెంకట్, రాజేష్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top