ఊరంటే అది!

ఊరంటే అది!


భూగర్భ జలాల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? భూమిలోపల నీటి మట్టం పెరగాలంటే ఏ ఏ చర్యలు తీసుకోవాలి? అంత లోతుగా ఆలోచించకుండానే, భూగర్భ జలాల నిపుణుల సూచనలు సలహాలు లేకుండానే ఓ గ్రామ రైతులు సాధారణ పరిజ్ఞానంతో నడుచుకుంటున్నారు. గత పాతిక సంవత్సరాలుగా ఎలాంటి సాగునీటి కొరత లేకుండా హాయిగా పంటలు పండించుకుంటున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.



ఆదిలాబాద్‌ జిల్లా మామడ మండలం పోతారం గ్రామ రైతులు అనుసరిస్తున్న విధానం చూస్తే ఇంతకంటే చక్కటి ముందు చూపు మరొకటి ఉండదని తప్పకుండా అనిపిస్తుంది. ఈ ఊరి రైతులు వర్తమానం గురించే కాదు, భవిష్యత్‌ అవసరాలకు గురించి కూడా పక్కాగా ఆలోచించి పాతిక సంవత్సరాల క్రితం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పక్కనే ఉన్న నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ గ్రామంలో పక్క పక్కనే బోర్లు వేయడంతో భూగర్భ జలాలు పూర్తీగా అడుగంటాయి.  బోర్లలో నీరు రాక రైతులు తగాదాలు పడే దుస్థితి ఏర్పడింది.



డబ్బున్న ఆసామితోపాటు డబ్బులేని బక్క రైతు కూడా అప్పో సప్పో చేసి బోరు లోతు పెంచుకుంటూ పోతున్నారు.  ఈ విధంగా ఎవరికి వారు తమ ఇష్టానుసారం తవ్వుకుంటూ పోవడంవల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.  దాంతో బోర్ల సాయంతో చేసే వ్యవసాయం నానాటికీ కష్టాలపాలవుతోంది. ఈ విషయాలన్నిటినీ గమనించి ఆ సమస్య తమకు రాకూడదని  మామడ మండలం పోతారం గ్రామ రైతులు భావించారు.   బోర్లు వేయకుండా నూతులపైనే ఆధారపడాలని అందరూ కలసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు కలసికట్టుగా ఒకే మాటపై నిలబడ్డారు. ఈ విధానం  ప్రతిరైతుకు లబ్ధి చేకూరుస్తోంది.



ఊరికి రెండు పెద్ద చెరువులున్నాయి. అవి ఎప్పుడూ నిండుగా ఉండేలాగా వీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. చెరువులవల్ల భూగర్భ జలాలు ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ అవుతున్నాయి. వేసవికాలంలో నూతుల్లో, చెరువుల్లో నీరు తగ్గిపోవడం సాధారణ విషయమే. అయితే ఈ సమయంలో ఈ ఊరివాళ్లు పూడిక తీత పనులు చేపడుతున్నారు. ఇలా సాగునీటి సంరక్షణ చేసుకుంటూ పొదుపుగా నిరంతరం పంటలు పండించుకుంటూ లబ్ది పొందుతున్న పోతారం గ్రామం కళకళలాడుతోంది. ఇక్కడ రైతుల వద్ద ఇతర గ్రామాల రైతులు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. . ఇతరులు కూడా వారి బాటలో నడచి సాగునీటి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top