స్టాప్ వేర్.. అంతా హార్డ్‌వర్కే..

స్టాప్ వేర్.. అంతా హార్డ్‌వర్కే.. - Sakshi


కత్తిలాంటి ఉద్యోగం.. ఖతర్నాక్ జీతం.. వాళ్ల గురించి వినిపించే టాక్ ఇదే. హైక్‌లు.. అబ్రాడ్ ట్రిప్‌లు.. వీకెండ్ ఈవెంట్లు.. ఇవన్నీ వారి జీవితానికి ఓ వైపు మాత్రమే. రెండోవైపు చూస్తే.. కరెన్సీ కట్టల వెనుక కష్టం తెలుస్తుంది. జాలీ లైఫ్ మాటున జాలి లేని జీవితం దిగాలు పడుతుంటుంది. అకౌంట్లోకి ఐదంకెలు వచ్చి పడినా.. నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్‌గా కన్పిస్తుంది. కాస్ట్‌లీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియని టెన్స్ ట్రాన్స్‌లో బతికేస్తున్నారు. క్రెడిట్ కార్డులు గోలపెడుతున్నా, లోన్ ఈఎంఐలు వెంటపడుతున్నా..  గుట్టు రట్టు కాకుండా నెట్టుకువస్తున్నారు. కాలంతో పరుగులు తీస్తున్న టెకీలను సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా మారిన హీరో నిఖిల్ పలకరించాడు.

 - రిపోర్టర్ నిఖిల్

 

 నిఖిల్: లాస్ట్ టూ, త్రీ ఇయర్స్‌లో ముగ్గురో.. నలుగురో అమ్మాయిలు ఐటీ కంపెనీల్లో సూసైడ్ చేసుకున్నారు.

 కార్తీకేయ: ఆత్మహత్యలకు జాబ్ టెన్షన్ ఒక్కటే కారణం కాదు. ప్రొఫెషనల్ ప్రెషర్‌తో పాటు.. పర్సనల్ సమస్యలు ఉంటాయి కదా ! దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.

 

 నిఖిల్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెప్పగానే ఎక్కడికో వెళ్లిపోతాం.. సినిమాలో మేం స్టార్లయితే.. ఉద్యోగాల్లో మీరు సూపర్ స్టార్లు..

 ఏమంటారు..?

సురేంద్రరెడ్డి: అంత సీన్ లేదండి. సెంట్రల్ ఏసీ.. కంప్యూటర్ కీబోర్డు నొక్కితే.. లక్షల్లో జీతాలు వచ్చి పడుతున్నాయని చాలా మంది అనుకుంటారు. జాబ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగే రియల్ స్టార్.

 లోకేష్: లక్షల్లో జీతాలున్నా.. మా టెకీలు (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్) గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రూప్స్ ఉద్యోగాల వేటలో ఇంజనీర్లు చాలామందే ఉన్నారు.

 కార్తీకేయ: ఇబ్బందుల్లేని ఉద్యోగాలు ఉండవనుకోండి. బట్ టెకీ ఈజ్ డిఫరెంట్.

 నిఖిల్:  సాఫ్ట్‌వేర్ అంటే ప్రెషర్ ఎక్కువని అంటారు. మీ పరిస్థితి ఏంటి?

 లోకేష్: 24 బై 7 సపోర్ట్‌లో ఉంటే మాత్రం ప్రెషర్ తప్పదు. వారంలో ఏడు రోజులు.. రోజులో 24 గంటలూ కంపెనీకి అందుబాటులో ఉండాలి. సినిమా హాల్లో ఉన్నా కాల్ వచ్చిందంటే  ల్యాప్‌టాప్ తెరిచి లాగిన్ కావాల్సిందే.

 సురేష్:  ఎక్కడికెళ్లినా ల్యాప్‌టాప్ చేతిలో ఉండాల్సిందే. పెళ్లిలో ఉన్నా.. పబ్‌లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే ఫీలవ్వాలి.

 నిఖిల్: మరి ఎందుకు 24 బై 7 సపోర్ట్‌లో చేరడం?

 లోకేష్: డబ్బుల కోసం, జీతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది.

 నిఖిల్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే.. మొదట్లో జీతాలు ఎలా ఉంటాయి ?

 సురేష్: ఏడాదికి 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్ అయితే కాస్త బెటర్. చాలామంది మొదట్లోనే లక్షలు

 వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ అంతలేదు.

 కార్తీకేయ: ఈ ఫీల్డ్‌లో టాలెంటును బట్టి ప్రమోషన్ ్స,  హైక్‌లూ ఉంటాయి.

 నిఖిల్:  నా రాబోయే సినిమా పేరు కార్తీకేయ. మీరు చెప్పండి టెకీల లైఫ్ స్టయిల్ గురించి.

 కార్తీకేయ: వారంలో రెండు వీక్లీ ఆఫ్‌లు. ఒక రోజు కంటి నిండా నిద్రపోతాం. రెండో రోజు సినిమాలకని, షికార్లకని తిరుగుతాం.

 నిఖిల్: సో...ఫుల్ ఎంజాయ్ అంటావ్.

 లోకేష్: బ్యాచిలర్స్ పని బాగుంటుంది సార్. మా పరిస్థితే తేడా..

 సురేంద్రరెడ్డి: కొత్తగా పెళ్లయింది.

 లోకేష్: ఇంటికెళ్లి భోజనానికని కూర్చుంటామా.. ఫోన్ రింగవుతుంది. రిసీవ్ చేసుకున్నామా..?  రుసరుసలు.

 నిఖిల్: నిజంగా ఇబ్బందే.

 సురేష్: సార్.. ఒక్కో ప్రొఫెషన్‌లో ఒక్కో రకం ఇబ్బంది ఉంటుంది.

 సురేంద్రరెడ్డి: ఇందులో జీతం తప్ప.. మిగితావన్నీ ఇబ్బందులే. పదిహేను రోజులు డే టైమ్‌లో.. పదిహేను రోజులు నైట్ వర్క్ చేయాలి. కొత్త కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి.

 రవీంద్రనాథ్ రెడ్డి: నిజమే.. రాత్రిళ్లు పనిచేయడం అలవాటయ్యేలోపు డే షిఫ్ట్ వేస్తారు. వర్క్ ప్రెషర్‌తో చాలామంది హెడెక్, డిప్రెషన్, వెయిట్ ప్రాబ్లమ్స్ వంటి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు.

 నిఖిల్: అమ్మాయిలకు నైట్ షిఫ్ట్ జాబ్‌లు కరెక్ట్ అంటారా ?

 జ్యోత్స్న: విదేశీ కంపెనీలే చాలా వరకు ఉండటంతో రాత్రుళ్లు కూడా జాబ్ చేయాల్సి వస్తోంది.

 నిఖిల్: రాత్రి పూట క్యాబ్స్‌లో వెళ్తారు కదా.. ఏమైనా

 ఇబ్బందులుంటాయా ?

 జ్యోత్స్న: కంప్లయింట్స్ తక్కువే కానీ.. ఉండే ఇబ్బందులు ఉంటాయి. సెక్యూరిటీ విషయంలో డౌట్ లేకున్నా రిస్కే.

 నిఖిల్: మీరు చాలా సెన్సిటివ్ అంటారు...

 సురేంద్రరెడ్డి:  ఉద్యోగం, ఇల్లు, షాపింగ్ ఇవే మా ప్రపంచం. మిగతా ప్రపంచంతో అనుబంధం దూరమైంది. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా.. దాన్ని ఎదుర్కొనే శక్తి చాలామందిలో ఉండదు.

 నిఖిల్: జాబ్ సెక్యూరిటీ మాటేమిటి. దానికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది ?

 సురేష్:  ఏ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. ఎప్పుడు లాభాలు వస్తాయో, ఎప్పుడు నష్టాలు వస్తాయో అస్సలు తెలియదు.

 నిఖిల్:  మా ఫ్రెండ్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. వాడు జాబ్ చేసే కంపెనీలో లాభాల్లేవని.. కొందరిని తీసేశారు. వారిలో వీడూ ఉన్నాడు.  డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

 లోకేష్: జాబ్ ఉన్నంత వరకు హ్యాపీ. ఈ లోగా.. మేం ఎక్కడ దుబారా చేస్తామో అని ఇంట్లో వాళ్లు.. ఇళ్లు, కారు అంటూ కొనిపిచ్చేస్తారు. ప్రతినెలా ఈఎంఐలు పీకకు చుట్టుకుంటాయి.

 నిఖిల్: సరే.. ఇవన్నీ పక్కన పెడితే, సినిమాలు చూస్తుంటారు కదా.

 సురేష్: సినిమాలు, సోషల్ నెట్‌వర్కింగ్ లేకపోతే ఎలా..? నిజం చెప్పాలంటే మాకు కాస్తో కూస్తో రిలీఫ్ ఇస్తున్నవి సినిమాలే . టాక్ బాగుందంటే వీకెండ్‌లో సినిమా పక్కా. మా వాళ్లు రివ్యూలు బాగా రాస్తారు.

 నిఖిల్: యూఎస్‌లో ఉన్నవాళ్లు రాసే రివ్యూలు చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా రాస్తారు. సో.. మొత్తానికి ఎన్ని టెన్షన్లున్నా.. ఎన్ని టార్గెట్‌లున్నా.. సినిమాలు తప్పకుండా చూస్తారు కాబట్టి ఐయామ్ హ్యాపీ (నవ్వుతూ) బై.. నైస్ టు మీట్ యూ!

 - ప్రెజెంటేషన్: భువనేశ్వరి

 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top