నిబ్బు కోసం డబ్బింగ్

నిబ్బు కోసం డబ్బింగ్


బాపుగారు కలవమన్నారని శ్రీరమణగారి కబురు. ధైర్యం కోసం ఇద్దరు మిత్రులు పాండు, శ్రీరాంతో కలసి వెళ్లా. ప్రేమగా పలకరించారు. పెద్ద పుస్తకాల కట్ట చేతిలో పెట్టారు. ‘ఉదయం లేవగానే ఇందులోని బొమ్మల్ని కళ్లకద్దుకుని ఇలాగే, ఇదే సైజులో కాపీ చేయండి. వీరు మహా చిత్రకారులు. చాలా గొప్ప స్కూల్ ఇది’ అన్నారు. అంతేనా... ‘పుస్తకం ఇచ్చాడు కదా అని పని అయిపోయిందనుకున్నారేమో! ఇప్పుడు హైదరాబాద్‌లో డబ్బింగ్ పని మీద ఉన్నా. చాలాకాలం ఇక్కడే ఉంటా. ప్రతివారం మీరు ప్రాక్టీస్ చేసిన బొమ్మలు నాకు వచ్చి చూపించాలి’ అని పదమూడో ఎక్కం అప్పచెప్పమన్న మేస్టారుగారిలా బెదిరించారు. అది బాపుగారితో దాదాపు నా తొలి పరిచయం.

 

 నా సీనియర్ కార్టూనిస్టులు బెదిరించినట్లుగా ఆయన కోపంగా, చిరాగ్గా, నిరాసక్తంగా, మౌనిగా ఏం లేరు. తరువాత్తరువాతి మా అనుబంధంలో ఆయన దగ్గర ప్రేమ, కరుణ, వాత్సల్యం తప్ప మరేం చూడలేదు. అలా బొమ్మల పుస్తకం దగ్గర్నుంచి మా కబుర్లు మంచి పేపరు, పెన్సిల్, బ్రష్, ఇంకుల పైనుంచి డిప్పింగ్ నిబ్స్‌పైకి మళ్లాయి. ‘మద్రాసులో ఆ పెరుమాళ్ చెట్టి దగ్గర దొరికేవండీ మంచి నిబ్బులు... ఇప్పుడు అక్కడా లేవు. ఉన్న పాతవే తాయిలంలా చూసి చూసి వాడుకోవాల్సి వస్తోంద’ని నిట్టూర్చినంత పని చేశారు. నేను చూడ్డానికి అలా కనబడతాను కానీ, ఒక్క హైదరాబాద్‌లోనే కాదు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా చివరకు పూణేలో కూడా ఏయే నిబ్బులు ఏయే సందుల్లో దొరుకుతాయో ఇట్టే చెప్పే మనిషిని నేను. నేను నోరు విప్పక ముందే నా వెంట నా జ్ఞానాన్నంతా నా దగ్గర కొట్టేసిన పాండు ముందుకు ఉరికి ‘ఏం లేదు సార్.. ముందు అఫ్జల్‌గంజ్‌లో బస్ దిగి నయాపూల్ పైనుంచి చార్మినార్ వెళ్లే దారిలో ఛత్తాబజార్ దాటిన తర్వాత రెండు ట్రాఫిక్ సిగ్నళ్లు దాటాక మచిలీ కమాన్ వస్తుంది. కమాన్‌కు ఆనుకుని ఒక ముసలావిడ తమలపాకులు అమ్ముతుంటుంది. ఆ కమాన్ పక్కనే ఉన్న హోటల్ షాదాన్. దాన్నుంచి మూడో కొట్టు ఒకటి చాలా చిన్నది, మురికిది.

 

 అందులో మెల్లకన్ను అబ్బాయి ఒకడు.. వాడి దగ్గర ఉన్నాయి చూడండి సార్ అబ్బబ్బబ్బా..! ఏం నిబ్బులు.. ఎన్ని నిబ్బులు..!’ పాండు చెప్పేదేమిటంటే అంతటి బాపుగారు అఫ్జల్‌గంజ్‌కు ఏ బస్సు వెళుతుందో కనుక్కుని, అది ఎక్కి సీట్ దొరక్కపోతే వీలైతే ఫుట్‌బోర్డింగ్ లాంటిది చేసి, ఆపై నడక అదీ నడిచి.. గూట్లో మాంత్రికుడి ప్రాణాలు సాధించినట్లు ఆ నిబ్బులు సాధించుకోవాలని.. ఆయన మాత్రం అదంతా చేసేద్దామన్నంత ఇదిగా వింటున్నారు. ఖర్మ! నేను కలగజేసుకుని, ఫర్వాలేదు సార్.. మీకు కావాల్సిన నిబ్బులు నేను తెచ్చిపెడతానని హామీ ఇచ్చా. బాపుగారు.. ‘అలా కాదులెండి. నేనూ వస్తాను. ఇద్దరం కలిసే వెళదాం. మీరు చిన్న హెల్ప్ చేయండి చాలు. నాకు ఉర్దూ రాదు. లిప్ మూమెంట్ ఇస్తా. మీరు డబ్బింగ్ చెబితే చాలు’ అన్నారు. ఇక నవ్వులే నవ్వులు... బాపుగారిని వెంటబెట్టుకుని చార్మినార్ వెళ్లింది లేదు. ఇక ఆ అవకాశమూ లేదు.

 -  అన్వర్ (ఆర్టిస్ట్)

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top