మీటింగ్ డిజైన్

మీటింగ్ డిజైన్


ఏదైనా సక్సెస్ కావాలంటే దానికి ముందు ఓ కచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రణాళిక ఎలా వస్తుంది! ఎవరికి వారుగా కాకుండా... అంతా కలసి ఓ చోట కూర్చుని చర్చించుకుంటే చేయబోయే పనిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. తద్వారా ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ సులువవుతుంది. అయితే అసలీ మీటింగ్‌లనే ఓ పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఫలితాలు వంద శాతం వస్తాయంటున్నారు ఇటలీకి చెందిన మైక్ వాన్‌డియర్, నెదర్లాండ్ దేశస్తుడు ఎరిక్ ది గ్రూట్. ఇటీవల గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఈ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఈ ‘మీటింగ్ డిజైనింగ్ ఎక్స్‌పర్ట్స్’ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది. ఈ సందర్భంగా వారు ‘మీటింగ్ డిజైనింగ్’పై ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

 

 ‘చిన్నప్పటి నుంచే స్కూల్, కాలేజీ డేస్‌లో జరిగే కల్చరల్ ఈవెంట్లు, వార్షికోత్సవాల రూపకల్పన సమావేశాలకు టీమ్ లీడర్‌గా వెళ్లేవాడిని. అలా నాకు ఆర్గనైజ్డ్ మీటింగ్‌పై మంచి పట్టు ఏర్పడింది. ప్రస్తుతం మా ఇటలీలోనే కాదు... విదేశాల్లోనూ పక్కా ప్రణాళికతో సమావేశాలు ఎలా నిర్వహించాలనే చర్చాగోష్టిలు నిర్వహించే స్థాయికి ఎదిగాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాల నిర్వహణకూ సలహాలు, సూచనలిస్తున్నా... అన్నారు మైక్ వాన్‌డియర్. టీమ్ లీడర్‌గా సమావేశాలు నిర్వహించడమే కాదు... బృందంలోని ఇతర సభ్యులతో కూడా సాధ్యమైనంత ఎక్కువ మాట్లాడించగలగాలంటారు ఆయన.

 

 తద్వారా తాము ఏం చేయాలనుకుంటున్నామనే దానిపై అందరిలో స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వెల్లడిస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించుకుని ఏవి అమలు చేస్తే బాగుంటుందో వాటిపై దృష్టి పెడితే సరైన ఫలితం వస్తుందనేది ఆయన చెప్పే పద్ధతి. ‘మీటింగ్ డిజైన్ పర్‌ఫెక్ట్ ఈవెంట్ క్రియేట్ చేయడమే. లెర్నింగ్, నెట్‌వర్కింగ్, మోటివేషన్, డెసిషన్ మేకింగ్... ఇలా మీటింగ్‌లో ప్రతిదీ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇలా ఈ రోజుల్లో మీటింగ్ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకుంది. జర్మనీలో ఆ తరువాత అమెరికా, చైనా, భారత్‌లలో అత్యధిక సమావేశాలు జరుగుతాయి’ అని చెబుతారు వాన్‌డియర్.  

 

 బెటర్ ఇండియా...

‘నాది నెదర్లాండ్స్. మధ్యతరగతి కుటుబం. కష్టించే తత్వం. ఏ ఈవెంట్ సక్సెస్ కావాలన్నా ఆర్గనైజ్డ్ మీటింగ్ వల్లే సాధ్యమవుతుంది. భారత్‌లో జరిగే సమావేశాల్లో 75 శాతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఇటలీకి వెళ్లినప్పుడు ఓ మీటింగ్‌లో వాన్‌డియర్‌తో పరిచయమైంది. ఇద్దరి భావాలు ఒకేలా ఉండటంతో అతనితో కలసి మీటింగ్ డిజైన్ ఏజెన్సీ  ‘మైక్’ను 15 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అప్పటి నుంచి అనేక దేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం.



వాన్‌డియర్‌తో కలిసి నేను రాసిన ‘ఇన్ టూ ద హార్ట్ ఆఫ్ మీటింగ్స్’ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1914లో జరిగిన ఓ చిన్న సమావేశం ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. 1850లో జరిగిన ఓ మీటింగ్ కొన్ని దేశాల శాంతికి బాటలు వేసింది. పారిశ్రామిక, కార్పొరేట్... ఇలా ఏ రంగం తీసుకున్నా వాటి ఆర్థిక వృద్ధిలో కార్యాలయాల్లో జరిగే మీటింగ్‌లదే కీలకపాత్ర’ అంటారు ఎరిక్ ది గ్రూట్. మీటింగ్‌లకు హైదరాబాద్ సరైన వేదికని వీరు అభిప్రాయపడ్డారు. ఇందుకు కావల్సిన మౌలిక వసతులన్నీ ఇక్కడ ఉన్నాయన్నారు. గోల్కొండ, చార్మినార్ అందాలు... చికెన్ బిర్యానీ, స్పైసీ వంటకాలు... రాహ్‌గిరి కార్యక్రమ డిజైన్ అదుర్స్ అంటున్నారీ ‘మీటింగ్’ పార్ట్‌నర్స్.

 - వీఎస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top