దీన బంధువులు

దీన బంధువులు - Sakshi


ఎండలు మండుతూ ఉంటే..

ఇంట్లో ఉన్నా గొంతు తడారిపోతుంది. ఇక బయట తిరిగేవాళ్లైతే బాటిళ్ల కొద్దీ నీళ్లు తాగేస్తారు. కనిపించిన జ్యూస్ సెంటర్‌లోకి దూరిపోతారు. మనుషులం కాబట్టి అన్నీ సాధ్యమే! మరి మూగ జీవులైతే..? ఈ కాంక్రీట్ జంగిల్‌లో చుక్కనీరు దొరకదు! ఆ వెతలను అర్థం చేసుకున్న యానిమల్ రెస్క్యూ టీమ్ ఆఫ్ ఇండియా సభ్యులు ఈ ఎండాకాలం వాటి దాహార్తిని తీర్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. యానిమల్స్ కోసం 24 గంటల అంబులెన్స్ సర్వీస్‌నూ అందుబాటులోకి తేనున్నారు!.

 ..:: వాంకె శ్రీనివాస్

 

ఎండాకాలం వస్తే.. పక్షులు, మూగజీవాల పరిస్థితి దయనీయం. పెంపుడు జంతువులకు యజమానులున్నారు. వీధుల్లో తిరిగే

వాటి మాటేమిటి?.. యానిమల్ రెస్క్యూ టీమ్ ఆఫ్ ఇండియా.. వీధుల్లోని పక్షులు, కుక్కల దాహార్తిని తీర్చేందుకు రెడీ అవుతోంది. సిటీలో ‘సిమెంట్ వాటర్ బౌల్స్’ ఏర్పాటు చేస్తోంది. చలివేంద్రాల్లోనూ వీటి ఏర్పాటుకు యత్నిస్తోంది. ఇప్పటికే రెండువేలకుపైగా సిమెంట్ నీటితొట్లకు ఆర్డరిచ్చింది. పూర్తికాగానే ఆయా ప్రాంతాల్లోవీటిని అమర్చుతామని అంటున్నారు ఈ టీమ్ అధ్యక్షుడు అనంత్ రాబర్ట్.

 

స్టూడెంట్స్.. రిటైర్డ్ ఎంప్లాయీస్..

మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థలో మూడు వేల మంది వలంటీర్లు ఉన్నారు. వీళ్లంతా అడాప్షన్ పెట్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటారు. గాయపడిన కుక్కలకు ట్రీట్‌మెంట్ ఇప్పించి, పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ టీమ్‌లో ఎక్కువగా స్టూడెంట్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. రెండు నెలలకొకసారి సమావేశమయ్యే ఈ టీమ్ మెంబర్స్.. జంతువుల సంరక్షణకు ఇంకా ఏం చేయాలనే దానిపై చర్చిస్తారు.



వీళ్లు వీధి కుక్కలు, పిల్లులను దత్తతకు కూడా ఇస్తారు. ఇచ్చే ముందు తీసుకునే వారి అంగీకారం తెలుసుకుంటారు. అంతా ఓకే అంటేనే దత్తతకిస్తారు. ఆపై రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తారు. అడాప్ట్ చేసుకున్న వాళ్లు ఆయా జంతువులను పట్టించుకోవడం లేదని తెలిస్తే వెంటనే తీసుకొచ్చి ఇతరులకు ఇచ్చేస్తారు! ఎవరూ తీసుకోకపోతే తామే వాటి ఆలనాపాలన చూస్తారు. వలంటీర్లు ఉన్న ప్రాంతాల్లో ఉండే వీధి కుక్కలు, పిల్లులకు.. వాళ్లే కేర్‌టేకర్స్ అని చెబుతున్నారు అనంత్‌రాబర్ట్!

 

జంతువుల కోసం జాబ్‌నే వదిలేశా..


ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టి పెరిగిన రాబర్ట్.. స్కూల్‌డేస్‌లో జంతువులపై ఏర్పడిన మమకారమే ఈ సేవకు నాంది అంటున్నాడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టి వదిలేసి వెళ్లిపోయింది. మా మమ్మీ వాటిని చూసుకోవడం నేర్పించింది నాకు. పాలు, తిండి పెట్టడం నేనే చేసేవాడిని. అలా పిల్లులతో అనుబంధం ఏర్పడింది. పెద్దయ్యాక ఆ పిల్లులు ఇల్లు వదిలి వెళ్లడం బాధించింది. నా మనసును అర్ధం చేసుకున్న మా నాన్న హర్బట్.. వీధి కుక్కపిల్లను తెచ్చిపెట్టారు. అలా నాకు జంతువులు, పక్షులపై ప్రేమ పెరిగింది. ఇంజనీరింగ్ కోసం 2005లో హైదరాబాద్ వచ్చా.



గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ చేశా. యానిమల్ రెస్క్యూ టీం ఆఫ్ ఇండియా సంస్థ గురించి ఫేస్‌బుక్ ద్వారా తెలిసింది. మెంబర్‌షిప్ తీసుకుని యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశా. వీధికుక్కలు, పిల్లుల దత్తత, రెస్క్యూ డాగ్స్ ట్రీట్‌మెంట్, ఆ తర్వాత కుక్కలని పునరావాస కేంద్రాలకి తరలించడం వంటివి చేస్తుండేవాన్ని. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశా. అయితే జంతువులకు పూర్తిగా సేవలందించలేకపోతున్నాననే ఫీలింగ్‌తో జాబ్‌కు గుడ్ బై చెప్పా. నా వర్క్ మెచ్చిన మా టీమ్ మెంబర్స్ అధ్యక్షుడిగా అవకాశమిచ్చారు. జంతువుల సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నా’ అని చెబుతున్నాడు రాబర్ట్.

 

హోమ్స్‌కు తరలిస్తుంటాం...

సిటీ వీధుల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా కుక్కలను కాపాడారు యానిమల్ రెస్క్యూ టీం సభ్యులు. చిన్న గాయాలైతే వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళతారు. పెద్దవైతే ట్రీట్‌మెంట్ ఇప్పించి బ్లూ క్రాస్, పీపుల్ ఫర్ యానిమల్స్ పునరావాస కేంద్రాలకు అప్పగిస్తుంటారు. ప్రధాన రహదారికి దగ్గరగా, అంటే డేంజర్ ప్రాంతాల్లో ఉండే కుక్కలను అహ్లువాలియా యానిమల్ శాంక్చ్యురీ (ఎన్‌ఎస్‌ఏఏఎస్), బండ్లగూడ దగ్గర డాలర్ హోమ్స్‌కు తరలిస్తుంటారు.

 

అంబులెన్స్, హెల్ప్‌లైన్..

ప్రస్తుతం సిటీలో బ్లూక్రాస్ వారి అంబులెన్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అందుబాటులో ఉంటోంది. 24 గంటల సర్వీసును అందించాలనే లక్ష్యంతో అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉందీ బృందం. త్వరలో జంతువుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌నూ ప్రారంభించనుంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top