ప్రేమతో..

ప్రేమతో..


www.youtube.com/watch?v=4EzmS5pcZuQ

 ప్రేమ.. మనసుల్లో చిగురించి మనుషుల్లో రాగబంధాలు పూయిస్తుంది. ప్రేమ అతి సున్నితం... అపురూపం. అందుకే ప్రేమించడం కన్నా ప్రేమను గౌరవించడం ఎంతో ముఖ్యమంటాడు యువ దర్శకుడు రాజు వరికుప్పల. తన షార్ట్ ఫిలిం ‘లవ్ మెయిల్’ ద్వారా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంబీఏ చదివి హెచ్‌ఆర్‌గా పనిచేస్తూనే తనకిష్టమైన గ్లామర్ ఫీల్డ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. తపన ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించిన రాజు రూపొందించిన ఈ చిత్రం హీరో కావాలనుకొనే యువకుడు గౌతమ్ స్టోరీ.

 

స్నేహితుడితో కలిసి బస్టాప్‌లో ఉన్న గౌతమ్... అక్కడ రోజాతో ఓ లెటర్ పట్టుకు నిలుచున్న అమ్మాయి అందానికి ఫిదా అయిపోతాడు. కొంత కాలం తరువాత ఆ విషయాన్ని ఆ బ్యూటీకి చెప్పాలనుకుంటాడు. రోజూ తనకు రోజాతో లెటర్స్ అక్కడ పెడుతుంది గౌతమేనని ఆమె అనుకుంటుంది. తను కూడా ప్రేమను ఓ లెటర్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటుంది. బస్టాప్‌కు వస్తుంది. షాక్..! గౌతమ్ కనిపించడు. కానీ... ఉత్తరాలు మాత్రం అందుతుంటాయి. ఇవి ఇక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని ఓ రోజు ముందే వస్తుంది.



గౌతమ్ అక్కడ లెటర్ పెట్టడం చూసిన అమ్మాయి... అతడిని నిలదీస్తుంది. అవి తాను రాసినవి కాదంటాడు అతడు. పెద్ద ట్విస్ట్! అసలా లెటర్స్ రాస్తున్న అజ్ఞాత వ్యక్తి కార్తీక్. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పేలోపు యాక్సిడెంట్ అయి అతడు కోమాలోకి వెళతాడు. విషయం తెలిసిన గౌతమ్... వారి ప్రేమను బతికించడానికి ఆ లెటర్స్ పెడుతుంటాడు. ఆమెకు విషయం అర్థమవుతుంది. ప్రేమిస్తున్న అమ్మాయితో అవి తనవి కావని ఎందుకు చెప్పావని అతడి ఫ్రెండ్ గౌతమ్‌ను అడుగుతాడు. మోసం చేసి పెళ్లి చేసుకోవచ్చని... కానీ ఆ తరువాత నిజం తెలిసి ఆమె కళ్లతో ప్రశ్నిస్తే అది చూసి తాను తట్టుకోలేనంటాడు గౌతమ్. ‘ప్రేమలో ఓడిపోయినా... ఓ అమ్మాయి మనసు, ఆమె ఇష్టాన్ని గౌరవించిన నువ్వు హీరో’వంటూ అభినందించడంతో కథ ముగుస్తుంది.

- ఓ మధు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top