ఏక్ దూజే కే లియే


నువ్వు-నేను

రమాకాంత్‌రెడ్డి, ఆనంద

 

love is a partnership of two unique people who bring out the very best in each other and who know that even though they are wonderful as individuals they are even better together..

 

బార్బరా కేజ్ ఈ మాటలను  ప్రముఖ చిత్రకారుడు తుమ్రుగోటి రమాకాంత్‌రెడ్డి, జర్నలిస్ట్ యూవీఎల్ ఆనందల దాంపత్యాన్ని చూసే అన్నదేమో! ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా ప్రత్యేకతలున్నవాళ్లే. పందొమ్మిదేళ్లుగా ఆ ప్రేమను తాజాగా ఉంచుతున్న పెళ్లి వీళ్లను అద్భుతమైన జంటగా మలచింది. ఆ చెలిమి కథే ఈ యూ అండ్ ఐ...

రమాకాంత్.. ఎంత మంచి చిత్రకారుడో అంతే మంచి బిజినెస్‌మన్ (ఆర్‌బీసీ వరల్డ్ వైడ్ వ్యవస్థాపకుడు, రమాకాంత్ అడ్వర్టయిజింగ్ కంపెనీకి డెరైక్టర్) కూడా! ఆనంద.. జర్నలిస్టే కాదు అంతకన్నా గొప్ప నాట్యకళాకారిణి, గాయని! ఆనంద వృత్తి నైపుణ్యం రమాకాంత్‌ను ఆకట్టుకుంటే ఆయన నిజాయితీ ఆమెను కదిలించింది. ఆ పాత మాధుర్యాన్ని గుర్తుచేసుకుంటూ రమాకాంత్.. ‘1993లో.. అలియెన్స్ ఫ్రాంచైజ్‌లో ఇండోర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనిక్ జైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉండింది.



దానికి సంబంధించిన ఓ చిన్న రైటప్ మర్నాడు ‘సిటిజన్స్’ అనే ఈవినింగ్ ఎడిషన్‌లో పబ్లిష్ అయింది. చదివాను. చాలా ఫ్రెష్‌గా అనిపించింది. బైలైన్ చూశాను.. యూవీఎల్ ఆనంద అని ఉంది. ఎవరో బెంగాలీ అయి ఉంటాడని అనుకున్నా. ఆ వ్యక్తిని ఎలాగైనా కలవాలనుకున్నా. ఓ నెల తర్వాత సంఘీనగర్‌లో సంఘీ వాళ్లు ఓ వర్క్‌షాప్ ఆర్గరైజ్ చేశారు. ఆర్టిస్టులు, ఆర్ట్ క్రిటిక్స్, జర్నలిస్టులు అందరూ వచ్చారు. ఆనందా వచ్చే ఉంటాడు.. వీళ్లలో ఎవరో అని నా కళ్లు ఆ వ్యక్తి కోసమే వెదుకుతున్నాయి.



చివరకు ఒకరిని అడిగాను ఆనంద ఎవరు? అని. కారిడార్‌లో ఆ మూల నిలబడ్డ ఓ వ్యక్తిని చూపించాడు అతను. సన్నగా, పొడుగ్గా అచ్చం బెంగాలీలా ఉన్నాడతను. వెళ్లి అడిగాను ‘ఆర్ యూ ఆనంద?’ అని ఆయన నవ్వి ‘నో షి ఈజ్ ఆనంద’ అని పక్కనే షార్ట్‌గా ఉన్న ఓ అమ్మాయిని చూపించాడు. ఆ పరిచయం వెంటనే స్నేహంగా మారిపోయింది. ఆ వర్క్‌షాప్ నుంచి రిటర్న్‌లో తన కార్లోనే వెళ్లాను. ఆ జర్నీ అంతా మా అభిరుచులు.. ప్లాన్స్, యాంబిషన్స్ గురించే చర్చ’ కొనసాగించింది ఆనంద. ‘ఆ మాటల్లోనే తేలింది ఆర్ట్ అండ్ రీడింగ్ అంటే  ఇద్దరికీ ఇంట్రెస్ట్ అని’ చెప్పాడు ఆయన.

 

బ్యాంక్ స్టేట్‌మెంట్.. మూడుముళ్లు



‘పరిచయమైన వారానికే పెళ్లికి ప్రపోజ్ చే శాడు’ ఆనంద. ‘ఆమెలో క్వాలిటీస్ నన్నంతగా అట్రాక్ట్ చేశాయి మరి. ఓ ఆర్టిస్ట్.. ఆర్టిస్ట్‌కే అర్థమవుతాడు. తను నా భార్య అయితే అలాంటి అండర్‌స్టాండింగ్ మా మధ్య ఉంటుంది అనిపించింది’ వివరించాడు రమాకాంత్. వెంటనే ఒప్పేసుకున్నారా అంటే ‘నో అని చెప్పడానికి నాకు కారణాలు కనిపించలేదు. మ్యూజిక్, డాన్స్ అంటే తనకూ ఇష్టం. అన్నిటికన్నా తన బిహేవియర్ నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. పెళ్లికి ముందు తనకున్న రిలేషన్స్ గురించీ చెప్పాడు.



ముందు కొంచెం భయపడ్డాను కానీ ఆ నిజాయితీ నచ్చింది. అందుకే ఎస్ అన్నాను. ‘కానీ పెళ్లికి వాళ్ల నాన్నే  ఫైనాన్షియల్‌గా నేనెంత స్ట్రాంగో తెలుసుకోవడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ అడిగాడు’ నవ్వుతూ రమాకాంత్. ‘ఆర్టిస్ట్ కదా.. ఆర్థికంగా నిలబడ్డాడా లేదా..అని ముందుచూపుతో అడిగాడు’ సమర్థించింది ఆనంద. ‘నా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసిన తర్వాతే మా పెళ్లికి ఓకే అన్నారు’ రమాకాంత్. మరి మీ మామగారు? అని ఆనందను అడిగితే ‘ఓ పాటపాడమన్నారు అంతే’అని చెప్పింది వినమ్రంగా.

 

పందొమ్మిదేళ్ల ప్రయాణంలో..



‘అసలు గొడవల్లేవ్. ఒక్కమాటలో చెప్పాలంటే బాడీస్ వేరు సోల్ ఒక్కటే’ రమాకాంత్. ‘పెద్దపెద్ద విషయాల్లో అభిప్రాయభేదాల్లేవ్. ఒకరి నిర్ణయాలను ఒకరం గౌరవించుకుంటాం’ ఆనంద.  ‘మా మధ్య సీక్రెట్స్ ఉండవు. రోజుకి పదిహేనుసార్లు ఫోన్ చేసుకుంటాం. మెసేజ్‌లైతే నిరంతరం’ రమాకాంత్. ‘ఎవరి పనుల్లో ఎవరం జోక్యం చేసుకోం’ ఆనంద. ‘తను జర్నలిస్ట్... నాది అడ్వర్టయిజ్‌మెంట్ ఫీల్డ్. రెండు కాంట్రాస్ట్ కాబట్టి ప్రొఫెషనల్‌గా ఎవరి పనుల్లో ఎవరి ఇంటర్‌ఫియరెన్స్ ఉండదు.



మా మధ్య గొడవలొచ్చేది చిన్నచిన్న విషయాలకే. నాకు కాస్త కోపం ఎక్కువే’ అని రమాకాంత్  వివరణ ఇచ్చాడు. ‘కానీ తొందరగా తగ్గిపోతుంది. తను వెరీ పంక్చువల్. కంప్లీట్ అపోజిట్ నేను’ అని ఆనంద అంటుంటే ‘సారీ కూడా నేనే చెప్తా. ఆ విషయంలో ఆమె కిరీటం జారిపోతుందేమో అన్నట్టు ఫీలవుతుంది’ అని హాస్యమాడాడు. ‘ఆమెకు పూజలు పునస్కారాలు ఎక్కువ. రోజుకి నలభై అయిదు నిమిషాలు పూజచేస్తుంది. నేను వాటికి దూరం’అని ఆయన.. ‘తన సర్కిల్ వేరు.. ఆర్టిస్ట్‌లు, రైటర్స్‌లాంటి వాళ్లతో ఉంటారెక్కువ. వాళ్లతో పార్టీలు బాగా ఎంజాయ్ చేస్తారు. నాకంతగా నచ్చకపోయినా ఆయన కోసం వెళ్తాను.



తనూ అంతే దేవుడిని నమ్మకపోయినా నాకోసం గుడికొస్తారు. మా మధ్య ఉన్న సారూప్యతే మా బంధాన్ని గట్టిగా ఉంచింది.. ఉంచుతోంది’ అంటుంది ఆనంద. ‘నాలో లేని క్వాలిటీస్‌ని ఆనంద భర్తీ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మాలో ఉన్న డిపెండెంట్ ఫ్యాక్టర్ వల్ల కలిసుంటున్నాం.



ఇండిపెండెంట్ నైజం వల్ల లవింగ్‌గా ఉంటున్నాం’ అంటూ రమాకాంత్ తమ అనుబంధాన్ని నిర్వచిస్తే ‘ఫ్రీడం.. స్పేస్.. రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్’ అని మూడుముక్కల్లో అభివర్ణిస్తుంది ఆనంద. అవి ఉన్నాయి కాబట్టే ఆనంద తనకిష్టమైన నాట్యాన్ని ప్రదర్శిస్తోంది ఇప్పటికీ. అంతే గొప్పగా భార్య కళను ఆస్వాదిస్తాడు రమాకాంత్. భర్త చిత్రకళపట్లా ఆనందకు అదే ఆరాధన. పందొమ్మిదేళ్ల నాటి వీళ్ల పెళ్లి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని రుజువు చేస్తోంది ఈ సహచర్యం!

 

 ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top