ఏంజెల్స్‌లావిత్ ఫ్లవర్స్

ఏంజెల్స్‌ విత్ ఫ్లవర్స్


పువ్వులను చూస్తే నవ్వులు చిందించే చిన్నారులు గుర్తుకొస్తారు. పువ్వులు పెట్టుకున్న చిన్నారులను చూస్తే తోటలో తిరుగాడే చిట్టి సీతాకోక చిలుకల్లా కనిపిస్తారు. ఈ ఐడియాతోనే ఇపుడు బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా మారుస్తున్నారు సిటీజనులు. తమ చిన్నారులను లిటిల్ ఏంజెల్స్‌లా ముస్తాబు చేసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు.

 

 -పుట్టిన రోజున తమ చిన్నారిని రాకుమారిలా అలంకరించాలని, దేవదూతను తలపించేలా ఆమె ఆహార్యం ఉండాలని.. అమ్మానాన్నలు ముచ్చటపడతుంటారు. పార్టీకో ప్రత్యేకత, ఇంటికి గొప్ప కళ రావాలంటే సింపుల్ అనిపించే ఈ వెరైటీ ట్రెండ్‌ను ఫాలో అయితే చాలు. ఇప్పటి వరకు అట్ట, లోహపు కిరీటాలు.. పుట్టినరోజు పాపాయి నెత్తిన ధీమాగా మెరిసిపోయేవి. ఇప్పుడా స్థానాన్ని సుతిమెత్తని రంగురంగుల పువ్వులు ఆక్రమించేశాయి.

 

     ‘పూల కిరీటం పెట్టుకున్న మా చిట్టితల్లిని చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవడం లేదు’ అంటూ మురిసిపోతున్నారు ఎల్బీనగర్‌కి చెందిన ప్రవీణ. ‘మా చిన్నారి బర్త్‌డే పార్టీకి వచ్చిన అమ్మాయిలందరికీ పూల కిరీటాలు పెట్టాం. వారంతా వేడుకలో తిరుగాడుతుంటే కథల పుస్తకాలలోని రాకుమార్తెలు ఇలా విచ్చేశారా అనిపించింది’ అంటూ సంబరంగా చెప్పారామె. పూల కిరీటాలలో లిల్లీ, మల్లె, చామంతి, గులాబీ వంటి స్వదేశీ పువ్వులే కాదు టులిప్స్, ఆర్కిడ్స్ వంటి విదేశీ పువ్వులూ అందాలొలకబోస్తున్నాయి. ‘అలంకరణలో పువ్వులది ప్రత్యేకమైన స్థానం. ఆ పరిమళాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ధరిస్తారు’ అని చెబుతున్నారు ఫ్లవర్ క్రౌన్స్ తయారీ నిపుణురాలు కల్పన.

 

 కూకట్‌పల్లికి చెందిన ఈమె పూలకిరీటాల తయారీలో మెలకువలూ తెలుపుతున్నారు. ‘ఎక్కువ సేపు తాజాగా ఉండే పువ్వులనే కిరీటాల తయారీకి ఉపయోగించుకుంటాం. అంతేకాదు వీటిని తయారుచేసే ముందు పార్టీలో పిల్లలు ధరించే దుస్తుల రంగులను తెలుసుకొని, వాటికి మ్యాచ్ అయ్యే రంగు పూలను ఎంచుకుంటాం. అలా ఎంచుకున్న పూలను క్రౌన్ వైర్ సాయంతో అల్లి, ఈ కిరీటాలను తయారుచేస్తాం. పిల్లల తలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగించని విధంగా ఈ కిరీటాల అల్లిక ఉంటుంది. వీటిని ధరించిన పిల్లల ఫొటోలు కూడా చాలా వెరైటీగా, మరింత అందంగా తీయవచ్చు’ అని తెలిపారు ఈమె. సింపుల్ అండ్ గ్రేస్ అనిపించే ఈ ఐడియాను మీ చిన్నారుల బర్త్ డే పార్టీకి మీరూ ఫాలో అయిపోవచ్చు.

 - విజయారెడ్డి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top