సర్‌ప్రైజ్ చేద్దామా!

సర్‌ప్రైజ్ చేద్దామా!


ఇది పెళ్లిళ్ల సీజన్. ఎలాంటి బట్టలు కొనాలి? ఏ నగలు వేసుకోవాలని వధూవరులెంత తర్జనభర్జన పడతారో.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా? అని పెళ్లికి వెళ్లేవారూ అంతే ఆలోచిస్తారు. మరీ అంత కంగారు పడాల్సిన పనిలేదు. పెళ్లి మీ స్నేహితులదనుకోండి. గిఫ్ట్ ఎంపిక ఈజీ. ఎందుకంటే వాళ్ల ఇష్టాయిష్టాలేంటో మీకు తెలిసే ఉంటాయి. ఇక దగ్గరి బంధువులదైతే వాళ్ల అభిరుచులూ మీకు కొంతైనా అర్థమవుతాయి. దూరపు చుట్టాలదైతే! అక్కడే అసలు సమస్య షురూ.. ఇష్టాయిష్టాలు తెలియవు. గిఫ్ట్ దొరికే టైమ్ ఉండదు. సో ఈ కింది రూల్స్ ఫాలో అయిపోండి.     

 

 

వస్తువులు కానుకగా చాలామంది తెస్తారు. ఒక్కోసారి ఒకరు తెచ్చిందే మరొకరూ తేవొచ్చు. ఈ అవకాశం ఇవ్వకుండా మీరు దూరపు బంధువులైతే వెంటనే రూ.501 కానుకగా ఇచ్చేందుకు రెడీ అయిపోయిండి. పెళ్లి మీ ఫ్రెండ్ లేదా దగ్గరి బంధువులైతే రూ.2,001, రూ.5001 ఇవ్వండి. ఒక్క రూపాయి ఎందుకు రౌండ్‌ఫిగర్ అయితే సరిపోతుంది కదా అనుకోవద్దు. చివర ఒక రూపాయి అనేది బేసి సంఖ్యేకాదు... ఫ్యూచర్ సక్సెస్‌కి చిరునామా కూడా.



ఇలా డబ్బు రూపంలో ఇస్తే పెళ్లి తరువాత వారికి ఏదైనా ఖర్చుకో, హానీమూన్ ట్రిప్‌కో ఉపయోగపడుతుంది. డబ్బు కవర్‌లో పెట్టి ఇవ్వాలన్నది అందరికీ తెలిసిందే... కవర్ ఎంపికే మీ ప్రత్యేకతను చెబుతుంది. కాబట్టి బ్రైట్ కలర్స్‌లో పైన ఎంబ్రాయిడరీతో ఉన్న కవర్స్‌ను ఎంపిక చేసుకోండి. తెలుపు, నలుపు రంగులొద్దు సుమా!.

 

నో టూ వోచర్స్...

ఈమధ్య షాపింగ్‌మాల్స్, ఆన్‌లైన్ స్టోర్స్ వోచర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అవి రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే గిఫ్ట్‌గా డబ్బు కాకుండా ఇలా ఫ్యాన్సీగా ఓచర్ రూపంలోనూ ఇవ్వొచ్చు. సమస్యల్లా దీనికి కాల, వస్తు పరిమితి ఉంటుంది. ఒకవేళ మీ గిఫ్ట్ తీసుకునేవారు ఆ టైమ్‌లోపు స్టోర్‌కు వెళ్లకుండా ఉంటే... ఆ టైమ్ లిమిట్ దాటిపోతుంది. సో సే నో టూ ఓచర్స్.

 

బొకేస్, లాఫింగ్ బుద్ధాస్..

చేతిలో బొకేతో పెళ్లికి వెళ్లి స్టైల్‌గా వధూవరులకిచ్చి ఫొటోకి ఫోజివ్వడం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా వచ్చే ఈ బొకేలు వాళ్లకు నిష్ర్పయోజనం. ఇవే కాదు.. అప్పుడప్పుడు లాఫింగ్ బుద్ధాస్, వినాయకుడి బొమ్మలు గిఫ్ట్‌గా ఇవ్వడం బాగుంటుంది. కానీ, ఇవే ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలో తెలియక కొత్తజంట తికమక పడుతుంది. ఆ విగ్రహాలు పసిడివో, వెండివో అయితే కరిగించొచ్చు. కానీ పెళ్లికి జ్ఞాపకంగా వచ్చిన వాటిని కరిగించడానికి ఇష్టపడరు. ఇక అవి ఇంట్లో పెట్టడానికి వాస్తు సమస్య కూడా అడ్డు రావచ్చు. కాబట్టి విగ్రహాలను ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి.

 

అడిగితే తప్పులేదు..

పెళ్లంటేనే సందడి. ఇక రిసెప్షన్ వేళ హంగామానే వేరు. అలాంటి టైమ్‌లో మీరిచ్చిన కవరో, గిఫ్టో మిస్సయ్యే చాన్స్ లేకపోలేదు. కాబట్టి ప్రస్తుతానికి గిఫ్ట్ తీసుకోకుండా వెళ్లండి. పెళ్లి తరువాత వాళ్లు ఓ ఇంటివాళ్లయ్యాక వెళ్లి మీ కానుకనందించండి. అయితే ఈ సూత్రం దగ్గరి వారికి, స్నేహితులకే వర్తిస్తుంది. ఇక పెళ్లికొడుకో, పెళ్లికూతురో మీకు బాగా దగ్గరైతే ఎలాంటి గిఫ్ట్‌కావాలో వారినే అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు ఛాయిస్ ఈజ్ యువర్స్!

 ..:: కట్టా కవిత

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top