ఏలే డిజైనర్!

ఏలే డిజైనర్! - Sakshi


లక్ష్మణ్ ఏలే. కుంచె గురించి కొంచెమైనా తెలిసినవారికి పరిచయం అక్కరలేని చిత్రకారుడు. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. డిజైనింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అంతా ఇంతా కాదు, చరిత్రలో నిలిచిపోయేలా. ఆ కుంచె చేసే విన్యాసం తెలియందెవరికి! ముంబైలోని ప్రతిష్టాత్మకమైన జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఆయన బొమ్మల కొలువు పెట్టింది. ఈ మధ్య ఆయన బొమ్మలతో కన్నా లోగోలతో బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి రూపు ఇచ్చారు. తాజాగా రాష్ట్ర పోలీస్ కోసం లోగో డిజైన్ చేసి తన ప్రతిభను మరోసారి చాటి చెప్పారు.

 

 ఆర్టిస్టులు ఎట్లా చేస్తారు లోగోలు? అది డిజైనర్స్ పనికదా... ఆయనకేం అర్హతుంది.. అనే విమర్శలే చాలా వినిపించాయి. దానికి ఏలే లక్ష్మణ్ చెప్పే సమాధానం ఒకటే! ‘ఆర్టిస్టు అనే పదం చాలా విస్తృతమైంది. అందులో పెయింటర్, డిజైనర్ అనే పదాలూ కలుస్తాయి.’ ఇంకా ‘నేను బేసిక్‌గా జర్నలిస్ట్‌ని, టెక్స్‌టైల్ డిజైనర్‌ని. ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశాను. లోగోలు చేశాను. కాబట్టి ఆ విమర్శలకు నా ట్రాక్ రికార్డే జవాబు’ అని అంటున్నాడు.  తెలంగాణ ఆర్ట్ చరిత్రను రికార్డ్ చేయడం కోసం ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆ పని మీదే తరచూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు పాపారావును   కలుస్తుండేవాడు. ఒకరోజు. ‘ స్టేట్ లోగోల గురించి చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా.. మీరూ నాలుగైదు డిజైన్లు చేయండి’ అన్నారు ఫోన్‌లో పాపారావు. అట్లా రాష్ట్ర లోగో చేసే అవకాశం అనుకోకుండా రావడం, ఆయన చేసిన లోగోను సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదించడమూ జరిగిపోయింది.

 

 పోలీస్ లోగో.. ఎలాగంటే!

 ఒకరోజు సాయంత్రం కుటుంబంతో కలసి ఏదో ఫంక్షన్‌కి వెళ్లడానికి లక్ష్మణ్ రెడీ అవుతుండగా డీజీపీ ఆఫీస్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెళ్లి అనురాగ్‌శర్మను కలవగా ‘పోలీస్‌లోగో కూడా మీరే చేయాలి. మీతోనే చేయించమని సీఎం చెప్పారు కాబట్టి ఆ పనిలో ఉండండి’ అని చెప్పారు. ఈ లోగో రూపకల్పనలో ఆస్కీవాళ్లూ ఇన్‌వాల్వ్ అయ్యారు. హానర్, డ్యూటీ, కంపాషన్ లాంటివి ఆరు పాయింట్లను సూచించారు. ఆయన, పోలీస్ డిపార్ట్‌మెంట్, ఆస్కీవారు డిస్కస్ చేసి వాటిని మూడింటికి కుదించారు. వాటిని లక్ష్మణ్ సింబలైజ్ చేస్తూ ఓ డిజైన్నిచ్చాడు. డే అండ్ నైట్, రౌండ్ ది క్లాక్ పోలీసులు పనిచేస్తారనే అర్థమొచ్చేటట్టు షీల్డ్‌ని, ఇతరాలకూ ఆయన ఓ రూపమిచ్చాడు.

 

 బ్లూ, రెడ్, గోల్డ్ కలర్‌లనూ ఇచ్చి ప్రతి కలర్‌కూ ఓ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అంతేకాదు లోగోకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి వర్ణన, వివరణ ఇస్తూ లాజిక్ ఆఫ్ లోగో అనే కాన్సెప్ట్‌నూ తయారు చేశాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్ సలహాలు, సూచనలను సమన్వయపరుస్తూ ఓ రెండు లోగోలు తయారు చేశాడు లక్ష్మణ్.  మిగిలిన వాళ్లూ పంపించిన దాంట్లోంచి కొన్నింటిని తీసి మొత్తం పది లోగోలను ఎంపిక చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అందులోంచి మళ్లీ మూడింటిని ఫైనల్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపించారు. ఆ మూడింట్లో రెండు లక్ష్మణ్‌వే. వాటిల్లోంచి లక్ష్మణ్ ఏలే చేసిన ప్రస్తుత లోగోనే పోలీస్ అధికారిక లోగోగా ఎంపికైంది. ఇదీ పోలీస్ లోగో కథ! కొసమెరుపు ఏంటంటే.. కేసీఆర్ సెలెక్ట్ చేసే వరకు ఆయనకు తెలియదు ఆ లోగో లక్ష్మణ్ ఏలే చేసినట్టు!

 

 ‘ఓ పొయెట్ పోయెమ్‌కి బొమ్మ వేసినట్టుగానే ఆ రెండు లోగోలను డిజైన్ చేశాను. వీటికి ఇంత రెస్పాన్స్ ఉంటదని, వాటితో నాకింత హానర్ వస్తుందని తెలియదు.   కేసీఆర్‌కు మంచి విజువల్ సెన్స్ ఉండడం.. ఆయన చేసిన సూచనలు ఆ లోగో పర్‌ఫెక్ట్‌గా రావడానికి హెల్ప్ చేసింది. నేను ఈ లోగోలతో మొత్తం తెలంగాణ ప్రజలకూ తెలిశాను. ఇది నాకు డిఫరెంట్ ఎక్స్‌పోజర్. చాలా సంతోషంగా ఉంది.’ అని చెబుతున్నాడు లక్ష్మణ్ ఏలే!  

 - శరాది

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top