కూచిపూడి నృత్యంపై ఇష్టమే నన్ను ...

కూచిపూడి నృత్యంపై ఇష్టమే నన్ను ...


కూచిపూడి నాట్యానికి మెరుగులద్దిన వెంపటి చిన సత్యం అడుగుజాడల్లో నడుస్తున్నారు వెంపటి శ్రీమయి. వంగసీమలో పుట్టిన ఆమె.. వెంపటి వారి కోడలిగా మెట్టినింటి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నారు. తెలుగువారి కూచిపూడి నృత్యాన్ని వారసత్వంగా అందుకుని చెన్నైలోని కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నాట్యగురువుగా పనిచేస్తున్నారు. తారామతి బారాదరిలో జరుగుతున్న పండిట్ భీమ్‌సేన్ జోషి ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన వెంపటి శ్రీమయి ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

 

కూచిపూడి నృత్యంపై ఇష్టమే నన్ను వెంపటి వారి ఇంటి కోడలిని చేసింది. మాది పశ్చిమ బెంగాల్. డిగ్రీ అయిపోయిన తర్వాత.. కూచిపూడి నేర్చుకోవాలనే ఆసక్తితో చెన్నై చేరుకున్నాను. అక్కడి కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరాను. వెంపటి చిన సత్యం గారి దగ్గర నాట్యం నేర్చుకున్నాను. ఈ శిక్షణ సమయంలోనే సత్యంగారి కుమారుడు వెంకట్‌తో ఏర్పడిన పరిచయం.. వివాహం దాకా వెళ్లింది. పెళ్లయ్యాక ఎన్నో ప్రదర్శనలిచ్చాను. ఈ క్రమంలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. నా నాట్య ప్రయాణంలో మా మామగారు ఓ తండ్రిలా అండగా నిలిచారు. భర్త వెంకట్ కూడా నాకు ఫుల్ సపోర్ట్. వారి ప్రోత్సాహంతోనే ఈ రోజు నేను కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నృత్య పాఠాలు నేర్పగలుగుతున్నా. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతున్నాను.

 

విలువలు ముఖ్యం..




కూచిపూడి ఆర్ట్ అకాడమీలో విద్యార్థులకు ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు శిక్షణనిస్తున్నాం. నాటి సంప్రదాయాలు పాటిస్తూనే.. కొత్త తరహా ప్రయోగాలు కూడా చేస్తున్నాం. మేం నాట్యం నేర్చుకునే రోజుల్లో గురువులను అసలు ప్రశ్నించేవారమే కాదు. ఇప్పటివారు ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. విద్యార్థుల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో మా అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పదివేల మంది విద్యార్థులకు పైగా కూచిపూడిలో శిక్షణపొందారు. వీరిలో ఎందరో దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. గురువు నేర్పిన విద్యతో పాటు.. అందులోని విలువలు నేర్చుకున్ననాడే ఏ రంగంలో అయినా రాణించగలం. ఇది నేర్పిన మా మామగారి అడుగుజాడల్లో ఇప్పుడు మేం నడుస్తున్నాం.

 

గర్వంగా ఉంటుంది..



హైదరాబాద్‌కు చాలాసార్లు వచ్చాను. తెలుగుగడ్డపై ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఒకింత గర్వంగా ఫీలవుతుంటాను. ఎంతైనా మా అత్తగారిల్లుకదా.. (నవ్వుతూ)! నాట్య ప్రదర్శనకు సిటీవాసుల నుంచి వచ్చిన స్పందన కూడా ఎప్పటికీ మరిచిపోలేను. హైదరాబాద్‌లో కూచిపూడికి మంచి ఆదరణ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ప్రదర్శనలు ఇస్తాను.

 ..:: వాంకె శ్రీనివాస్

 

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top