స్వచ్ఛం శరణం గచ్ఛామి

స్వచ్ఛం శరణం గచ్ఛామి - Sakshi


అది ఎయిర్ ఇండియా విమానం. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణం. ఈ గాలి మనది, ఈ నేల మనది, ఈ సీటు మనది.. ఎయిర్ ఇండియా అంతా భారతీయమే. ప్రయాణం పూర్తయింది. భారతీయులంతా బిలబిలమంటూ విమానం దిగిపోతున్నారు. చివరగా బయటకు వస్తున్న నన్ను దాదాపు సగం సీట్లలో చెత్తాచెదారం పలకరించింది.

 

 కవర్లు, బాటిళ్లు, టిష్యూ పేపర్స్, పాప్‌కార్న్ ఒకటేమిటి విమానం చెత్తకుండీలా కనిపించింది. చెత్తబుట్ట వరకూ వెళ్లలేని మన అసహాయతను గుర్తించి కేబిన్ క్రూ స్వయంగా మన దగ్గరకొచ్చి చెత్త ఇమ్మని సంచి పట్టి అడిగినా అందులో వేయడానికి చేతులు రానితనాన్ని ఏమనాలి, అలసత్వమా..? అసమర్థతా..? న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టగానే చేతిలోని చిన్న చిత్తు కాగితం పారేయడం కోసం చెత్తకుండీ కోసం మైలు దూరమైనా నడిచి వెళ్తారు. అదే స్వచ్ఛత, అదే శుభ్రత, అదే బాధ్యత మన నేల మీద ఏమైపోతుందో అనేది నాకు అంతు చిక్కని ప్రశ్న..!



 హోల్డింగ్ ది బ్రూమ్..

 స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ఏకమై రోడ్లపైకి చీపుర్లతో వచ్చిన భారతదేశాన్ని చూస్తే ఆశ మిగిలే ఉందనిపిస్తోంది. అక్కడ అంబానీ నుంచి ఇక్కడ నాగార్జున వర కూ చీపురు, చేటచేతపట్టిన సెలిబ్రిటీ ల లిస్ట్ పెద్దదే. వారిని అనుసరిస్తూ వారి అభిమానులూ పెద్దసంఖ్యలో ఈ ఉద్యమాన్ని నడిపించాలనే తపనతో ఉన్నారు. ఇక ఎలాంటి సెలిబ్రిటీ హోదా లేకపోయినా పెద్ద ఎత్తున కాలనీలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అందుకే నేను కూడా ఈ ఉద్యమంలో నా వంతు సహకారం అందించేందుకు బూజుకర్ర పట్టుకున్నాను. ఈ బూజు కర్ర వీధుల కోసం కాదు, బూజు కొట్టుకుపోయిన బుర్రల కోసం. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో నేనూ వారానికి రెండు గంటలు ‘శుభ్రత మన బాధ్యత’ అంటూ దుమ్ము దులిపే పనిలోపడ్డాను. అయితే ‘స్వచ్ఛ భారత్ ’ నా బుర్రలో కొన్ని ‘చెత్త’ ప్రశ్నలను తేనెతుట్టెలా కదిపింది. ఆ సమాధానాలను వెతికే క్రమంలో నేను బూజుకర్రతో స్కూళ్లూ, కాలనీలు తిరుగుతున్నాను.



 ఫీల్ ది కంపాషన్..

 మహానగరంలో 20 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. మరి మన వీధులు ఇంకా ఎందుకు చెత్తగా ఉన్నాయి. అంటే వీరు సరిగా పని చేయనట్టా..? రోజూ వెయ్యి ట్రిప్పుల లారీలు మన మహానగరం చెత్తను తరలించే బృహత్తర కార్యక్రమంలో బిజీగా ఉంటాయి. మరి మన నగరం ఎందుకు ఇంత చెత్త కంపు కొడుతుంది ? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు.. ఆ ట్రక్కు డ్రైవర్లు, కార్మికుల జీవితాన్ని ఊహించుకోండి. కుళ్లిన చెత్తలో చిత్తునేరుకునే చిరు ప్రాణులను తలచుకోండి. రీసైక్లింగ్ గురించి మాట్లాడే మనం మన చెత్తలో కేవలం 12 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నాం. అది కూడా మన చిత్తుకాగితాల, చెత్త మిత్రుల పుణ్యమే.



 డివైడ్ అండ్ క్లీన్..

 మనంతట మనంగా మన ఇంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్త అని విడివిడిగా పంపిస్తే మన కుళ్లు కంపు సగం తగ్గిపోతుంది. ఒక చెత్త బుట్ట నింపి పంపడమే కష్టం.. ఇక చెత్తను ఏం విభజిస్తామనుకుంటే ఈ కుళ్లు కంపు గురించి ప్రశ్నించే అర్హత  కోల్పోయినట్టే. ఎలాగూ చెత్త బుట్ట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, చెత్త పొదుపు గురించి కూడా తెలుసుకుందాం. ఇంటింటికీ వచ్చే చెత్త బండికి నెలకు పదో ఇరవయ్యో ఇవ్వాలి కాబట్టి మన చెత్త మనమే పడేద్దాం అనుకునే పొదుపు శిఖామణులూ ఉంటారు.

 

 మన రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాలూ ఇవన్నీ కూడా వారికి చెత్త బుట్టల్లా కనిపిస్తాయి కాబోలు. వీరికి పొదుపు.. జీహెచ్‌ఎంసీ జేబుకు చిల్లు. అందుకే చదువుకున్న, సంపాదనాపరులైన, వివేకవంతులైన, స్పందించగల, మార్పు తేగలిగిన వర్గాన్ని నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. వారానికి రెండు గంటలు వీధులు శుభ్రం చేసే ఉద్యమంలో చేరండి కానీ అంతకంటే ముందు కనీసం పది నిమిషాలు మీకు తెలియకుండానే అంతరాంతరాల్లో పేరుకుపోయిన చెత్త విలువలను శుభ్రం చేయండి. చెత్తను కేవలం చెత్తబుట్టలోనే వేస్తాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు చెత్త పారేసేటప్పుడు తడి చెత్తని (కిచెన్ వేస్ట్), పొడి చెత్తగా వేరు చేయండి. రీసైక్లింగ్‌కు అవకాశం పెరుగుతుంది.

 

 లాస్ట్ అప్పీల్..

 ఇక చివరి పిలుపు.. ప్రక ృతి పిలుపు. ఎంత మిమ్మల్ని ప్రకృతి పిలిచినా దయచేసి ఆరుబయట, గోడలు, రోడ్లు పాడుచేయకండి. దృష్టి పెడితే సులభ్ కాంప్లెక్స్‌లు కనిపిస్తాయి. స్వచ్ఛ భారత్ మీ స్వచ్ఛమైన మనసు నుంచే ప్రారంభమవుతుంది. ఒక చోటు నుంచీ మరోచోటికి వెళ్లేటప్పుడు మన తాలూకు చెత్త అవశేషాలు మన వెనుక మిగలకుండా చూసుకుందాం. రెండు చెత్తబుట్టల ఉద్యమంలో మీరూ కలవండి. మన చిత్తం మారితే మన చెత్త తీరు మారుతుంది. మన నగరం మరింత అందంగా మారుతుంది. వచ్చేవారం చెత్త తగ్గించే చిట్కాల కోసం ఇక్కడ చూడండి..

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top