మన్ మే దర్ద్ రికీతో ఖాళీ

మన్ మే దర్ద్ రికీతో ఖాళీ


జంతర్ మంతర్ జూమంతర్ ఖాళీ.. అందర్ దర్ద్ దెబ్బకు ఖాళీ.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అసహనంలో, నిరాశలో కూరుకుపోయిన మనిషికి..  ఒక ఆత్మీయ ఆలింగనం ఆ బాధలన్నింటినీ మరచిపోయేలా చేస్తుంది. స్పర్శకు అంతటి మహత్తర గుణం ఉంది. తలపోటుతో బాధపడుతున్న భార్యామణి నుదుటిపై మునివేళ్లతో ముచ్చటగా జండూ బామ్ రాసి చూడండి.. వెంటనే ఇట్స్ గాన్ అనేస్తుంది. దంపతుల మధ్య స్పర్థలను తొలిగించే శక్తి కూడా స్పర్శకే ఉంది. అలాంటి స్పర్శను బేస్ చేసుకున్న వైద్య విధానం రికీ. జపాన్‌కు చెందిన ఈ ట్రీట్‌మెంట్‌పై అమెరికాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు పౌలా హోరన్ ఉరఫ్ లక్ష్మి ‘కర్మ కంప్లీషన్’ పేరుతో నగరంలో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది.                   

 ..:: ఎస్.శ్రావణ్‌జయ

 

కాలుష్యం, కల్తీ ఆహారం, మానసిక సమస్యలతో రోజురోజుకూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని నయం చేయడానికి వైద్యుల పరిశోధనలూ కొనసాగుతున్నాయి. అన్ని రకాల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు రికీతో చెక్ పెట్టేయొచ్చు అంటున్నారు పౌలీ హారన్. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ డాక్టరమ్మ.. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త కూడా. పేరు కూడా లక్ష్మిగా మార్చుకున్నారు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ బంజారాహిల్స్‌లో రికీ మాడ్యూల్స్‌పై ‘కర్మ కంప్లీషన్’ పేరిట వర్క్‌షాప్ నిర్వహించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఎందరికో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

 

శాశ్వత పరిష్కారం కోసం..



హోరన్.. లక్ష్మిగా మారి ఆధ్యాత్మిక బాట పట్టడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే..? ‘ఒక సైకాలజిస్ట్‌గా మానసిక రుగ్మత లతో బాధపడే చాలామందికి చికిత్స చేశాను. కానీ సమస్యల వలయం నుంచి శాశ్వతంగా బయటకు రావడానికి ఆ రోగులు తపిస్తున్నారని నాకు అనిపించేది. అదే సమయంలో నేను ఇండియాకు వచ్చాను. రమణ మహర్షి ప్రధాన శిష్యులలో ఒకరైన ెహ చ్‌డ బ్ల్యూఎల్ పుంజా గారి దగ్గర శిష్యరికం చేశాను. అప్పుడే నా పేరు లక్ష్మిగా మార్చుకున్నాను. ఆయన దగ్గరే కొత్త వైద్య విధానాలు తెలుసుకున్నాను. 20 ఏళ్లుగా రికీ వైద్య విధానంతో ఎందరికో సాంత్వన కలిగించగలిగాను.

 

స్పర్శతో స్పాట్..



జపాన్‌కు చెందిన రికీ వైద్య విధానంలో కేవలం చేతి స్పర్శల ద్వారా మానసిక ప్రశాంతత కలిగించవచ్చని చెబుతారామె. ‘ఈ చికిత్సలో మొత్తం 8 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్‌లో కూడా చేతి స్పర్శలే కీలకం. రోగి మానసిక స్థితిని బట్టి చికిత్సా విధానం మారుతుంది. నాకు గతంలో క్యాన్సర్ వచ్చింది. రికీతోనే నేను అందులో నుంచి బయటపడ్డాను.



ప్రస్తుతం మూడు రోజులు జరిగిన వర్క్‌షాప్‌లో 8 మ్యాడ్యుల్స్ ఉన్న ఈ ట్రీట్‌మెంట్‌లో మొదటి మాడ్యూల్‌కి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించాను. రికీ ట్రీట్‌మెంట్‌తో మానసిక సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు. భార్యాభర్తల మధ్య ఇగో సమస్యలు, వ్యాపారంలో ఒత్తిళ్లు, నిద్రలేమి వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ టచ్ ట్రీట్‌మెంట్ చక్కని పరిష్కారం’ అని ముగించారు లక్ష్మి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top