అదరాలయ్యా ఐడియా

అదరాలయ్యా ఐడియా


ఎంత టాలెంట్ ఉన్నా.. చేయూత అందించే వారేలేకపోతే ప్రగతి సున్నా. చేస్తున్న పని నచ్చకో... నచ్చిన పనిని చేయలేకో కుంగిపోయే వారెందరో. అటువంటి వారికి మేమున్నాం అంటోంది ‘ఇండియన్ స్టార్టప్స్.కామ్’! మీ దగ్గర ఐడియా ఉందా?

మీ కలను సాకారం చేసుకోలేకపోతున్నారా? ఐతే మీరు చేయాల్సిందల్లా మా సమూహంలో చేరడమే అంటున్నారు ఆర్గనైజేషన్ ఫౌండర్స్‌లో ఒకరు అనిల్ కుమార్. ‘బిజినెస్ ప్లాన్ ఫర్ స్టార్టప్స్’ పేరుతో లామకాన్‌లో జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది.

 

నేను ఐఐటీ చేశాక దశాబ్ద కాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాను. నాలో చాలా ఆలోచనలు ఉన్నాయి. అవి కార్యరూపం దాల్చాలంటే అందుకు ఇన్వెస్టర్స్ కావాలి. అందుకోసం చాలా కష్టపడ్డాను. ఒకానొక దశలో ఎంత ప్రయత్నించినా అసాధ్యమనిపించింది. అప్పుడే నాకు తెలిసొచ్చింది. నాలాంటి వారెందరో చేయూతనిచ్చే దిక్కులేక, నచ్చని ఉద్యోగం చేయలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని. ఇలాంటి వాళ్లందరం సమూహమయ్యాం. ఫలితం ఈ ఇండియన్ స్టార్టప్స్. ఐడియా మీదే అది సాకారం చేసుకోవడానికి మా సంస్థ సహకరిస్తుంది. అంటే మీ దగ్గర ఓ మంచి గేమింగ్ ఐడియా ఉందనుకోండి. దాన్ని రూపొందించడానికి డబ్బు, గేమింగ్ ఆర్కిటెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్స్, ఇంకా ఎన్నో అవసరమవుతాయి. వీటన్నింటినీ ఇండియన్‌స్టార్టప్స్.కామ్ అందిస్తుంది. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థ!

 

ఐడియానే ఆస్తి...

తమ కలల్ని నిజం చేసుకోవడానికి ఎంతో మంది మా టీమ్‌లో చేరారు. బిజినెస్ ప్లాన్‌తో ఒకరు, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోసం మరొకరు ఇలా ఒకటి... అని చెప్పలేం! సివిల్, మెకానికల్, మెడికల్, టెక్నికల్, ఐటీ, రంగాలకు చెందిన ఎంతో మంది మా బృందంలో ఉన్నారు. వాళ్లు కూడా తమకు సరిపోయే బిజినెస్ పార్ట్‌నర్, ప్రోగ్రామ్ డెవలపర్, కో వర్కర్ లాంటి వారికోసం వచ్చిన వాళ్లే. అలాంటి వారితో మీ ఐడియాతో సరిపోయే వారిని డెరైక్ట్‌గా లేక ఏదో ఇక మాధ్యమంతో  ( మెయిల్, ఫోన్, ఫేస్‌బుక్)  మీ ముందు ఉంచుతాం. వారితో మీ ఐడియాలను షేర్ చేసుకోవచ్చు. నచ్చితే కలసి పనిచేయొచ్చు. ఇందుకు మీదగ్గర ఉండాల్సిందల్లా ఓ అద్భుతమైన ఐడియానే!

 

సేఫ్టీ గ్యారెంటీ...

ఐడియాను షేర్ చేసుకుంటే దాన్ని ఎవరైనా హైజాక్ చేస్తారేమోనన్న భయం అవసరమే లేదు. ఎందుకంటే... ఇక్కడ కాపీయింగ్ ఉండదు. మీకు కావలసినవి ఇవ్వడమే మా పని. కాబట్టి నీడ్ నాట్ టు ఫియర్ ఎబౌట్ యువర్ ఐడియాస్. ఆలోచన మంచిదయితే స్పాన్సర్లకు కొదవ లేదు. గూగుల్, ఆపిల్ కొత్త ఐడియాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాయి.


గూగుల్ ఇందులో అందరికంటే ముందే ఉందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగాన్ని శాసిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. ఇందులో ఉన్నన్ని గేమ్స్ మరే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ ఉండవు. ఇది కొన్ని వేల మంది ఆప్ డెవలపర్లు, గేమ్స్ ఆర్కిటెక్ట్స్ కలిసి పనిచేస్తేనే సాధ్యమయింది. ఏమో ఎవరికి తెలుసు.. మీకు వచ్చిన ఆలోచన ఎన్నో లక్షలమంది జీవితాలను ప్రభావితం చేయవచ్చు. యాన్ ఐడియా కెన్ ఛేంజ్ మెనీ లైఫ్స్! సో షేర్ యువర్ ఐడియాస్ అండ్ ఛేంజ్ యువర్ లైఫ్!

 ..:: ఎస్.శ్రావణ్‌జయ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top