నేను సైతం

నేను సైతం


టీచర్ కావాలనుకున్న ఆయన కలను పేదరికం మొగ్గలోనే తుంచివేసింది. కానీ... సమాజ మార్పుకోసం తనకు చేతనైనంత పని చేయాలన్న ఆయన తృష్ణను మాత్రం తుంచలేకపోయింది. అందుకోసం తన పాన్ డబ్బానే వేదికగా చేసుకున్నాడు నర్సింహారెడ్డి. తాను రాసిన మహాత్ముల నీతి వాక్యాలు, పదునైన నినాదాలతో... రోజుకు వేలమంది వెళ్లే ఆ మార్గంలో ఒక్కరిలో మార్పు వచ్చినా చాలంటున్నాడు.

 

హోటల్ మారియట్ దగ్గర కవాడిగూడ చౌరస్తా. రోడ్డు పక్కన చిన్న పాన్ డబ్బాను నిర్వహిస్తున్నాడు నరసింహారెడ్డి. షామీర్‌పేట అతని స్వస్థలం. ఉపాధ్యాయుడు కావాలన్న ఆయన కలకు పేదరికం అడ్డంకిగా మారింది. అంతే చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. ఓవైపు పోలియో కారణంగా వచ్చిన వైకల్యం. అయినా ఎక్కడా కుంగిపోలేదు. వైకల్యాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. 1992లో ఓ పాన్ డబ్బా ఏర్పాటు చేశాడు. అది మొదలు...  ఉదయం ఆ డబ్బా ఓపెన్‌చేయగానే తనను ఆకర్షించిన ఏదో ఒక నినాదం రాసి ఆ బోర్డును డబ్బాకు తగిలిస్తాడు న ర్సింహారెడ్డి. 23 ఏళ్లుగా తన అక్షరాల ద్వారా చైతన్యాన్ని కలిగిస్తున్నాడు.

 

సూక్తులెన్నో...



‘ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, సమాజానికి సేవాలయాలు, దేవాలయాలు. కానీ, అవినీతికి అడ్డాగా మారాయి’ అంటూ రాసి ఉన్న ఓ సూక్తి నడుస్తున్న చరిత్రకు అద్దం పడుతోంది. ఆ పక్కనే మరో బోర్డుపై ‘భారతదేశానికి గత 65 ఏళ్లుగా ఉత్తమ నాయకుల, అధికారుల కొరత ఉంది. ప్రతి నియోజకవర్గం గుండె చప్పుడు అదే’ అన్న మరో సూక్తి కూడా ఇట్టే ఆకర్షిస్తోంది.

 ‘నీ మీద నీకు నూరు శాతం నమ్మకముంటే ఓ మహాత్ముడిగా, మహర్షిగా ఎదుగుతావు’, ‘ఉత్తమ గురువంటే ఎవరు?, నిజమైన నాయకుడు ఎలా ఉండాలి?, ఈ దేశ సంపదలో నల్లధనం ఎన్ని కోట్లుంది?’ అని ప్రతి మనిషికీ అర్థమయ్యేలా వివరిస్తుంటాడు నర్సింహారెడ్డి..

 

సామాజిక బాధ్యత...



‘ఇలా రోజూ నాలుగైదు వాక్యాలు పదిమందికి తెలిసేలా బోర్డులపై రాసి పాన్ డబ్బా వద్ద ప్రదర్శిస్తుంటా. ఒకరోజు రాసినవి మరో రోజు ఉండవు. ఈ సూక్తులు రాయడానికి పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. పుస్తక పఠనం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పదిమందికి పంచడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నా. ఓ రకంగా నేను కలగన్న ఉపాధ్యాయ వృత్తి అభిలాషను ఇలా తీర్చుకుంటున్నా’నని చెబుతున్నాడు నర్సింహారెడ్డి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top