భాగ్యనగర గంధర్వుడు.. తలత్ అజీజ్

భాగ్యనగర గంధర్వుడు.. తలత్ అజీజ్ - Sakshi


బాలీవుడ్‌లో పాశ్చాత్య సంగీత ప్రభావం పెరుగుతున్న కాలమది. సినీ సంగీతంలో మెలొడీ మనుగడ సందిగ్ధంలో పడ్డ కాలమది. శ్రోతలను ఉర్రూతలూపేసి, కిర్రెక్కించే పాటల జోరు పెరుగుతున్న కాలమది. అలాంటి కాలంలో ‘జిందగీ జబ్ భీ తేరీ బజ్మ్ మే...’ అంటూ ఒక సుతిమెత్తని గొంతు సంగీతాభిమానులకు వీనుల విందు చేసింది. ఆ పాట ‘ఉమ్రావ్ జాన్’లోనిది. పాడిన గాయకుడు తలత్ అజీజ్. మన హైదరాబాదీ కుర్రాడు. అప్పటికే సుప్రసిద్ధులైన ఘజల్ గాయకులందరూ అతడిని ఆదరించి, ప్రోత్సహించారు. సినిమాల్లో అవకాశం దొరికింది కదా అని తలత్ అజీజ్ కూడా ట్రెండ్‌లో పడి కొట్టుకుపోలేదు. తనదైన శైలికే కట్టుబడ్డాడు. సూపర్ స్టార్‌లెవరికీ పాడక పోయినా, ‘ఘజల్ కింగ్’గా గుర్తింపు పొందాడు.

 

 ఈ ప్రత్యేకతకు అతడి కుటుంబ నేపథ్యమే కారణం. తలత్ తండ్రి ప్రసిద్ధ ఉర్దూ కవి అబ్దుల్ అజీమ్‌ఖాన్, తల్లి సాజిదా అబిద్. హైదరాబాద్‌లో వారి ఇల్లు కళలకు నిలయంగా ఉండేది. నిరంతరం కళాకారులు, కవులు, గాయకుల రాకపోకలతో కళకళలాడేది. మెహఫిల్‌లు, ముషాయిరాలు తరచూ జరిగేవి. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ తండ్రి నిసార్ అక్తర్, ఘజల్ గంధర్వుడు జగ్జిత్ సింగ్ వంటి ప్రముఖులు వారి ఇంటికి వచ్చేవారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన తలత్ బాల్యంలోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ సమద్ ఖాన్, ఉస్తాద్ ఫయాజ్ అహ్మద్‌ల వద్ద కిరానా ఘరానా సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్నాడు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠీలో తొలిసారిగా బహిరంగ వేదికపై కచేరీ చేశాడు. హైదరాబాదీ కవులు రాసిన ‘కైసే సుకూన్ పావూ...’ వంటి ఘజల్స్ పాడి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాడు.

 

 మేలి మలుపు...

 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఐఎస్‌సీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కామర్స్ నుంచి బీకామ్ (ఆనర్స్) పూర్తిచేశాక, అవకాశాల కోసం తలత్ అందరు గాయకుల మాదిరిగానే బాంబే చేరుకున్నాడు. కుటుంబ స్నేహితుడైన జగ్జిత్ సింగ్ ప్రోత్సాహంతో 1978లో ఘజల్ సమ్రాట్ మెహదీ హసన్ వద్ద శిష్యరికం ప్రారంభించాడు.  తొలి ఆల్బం ‘జగ్జిత్ సింగ్ ప్రెజెంట్స్ తలత్ అజీజ్’ను జగ్జిత్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేశాడు. ‘ఉమ్రావ్‌జాన్’, ‘బాజార్’ వంటి సినిమాల్లో కొన్ని ఘజల్స్ పాడినా, తొలినాళ్లలో కష్టాలు తప్పలేదు. ఈలోగా బుల్లితెర పుంజుకోవడంతో తలత్‌కు టీవీ అవకాశాలు పెరిగాయి. సాహిల్, మంజిల్, దిల్ అప్నా ప్రీత్ పరాయా, నూర్జహాన్ వంటి సీరియల్స్‌తో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఒకవైపు టీవీ చానళ్లకు పనిచేస్తూనే, పలు ఘజల్ ఆల్బమ్స్ విడుదల చేశాడు. పలు దేశాల్లో కచేరీలు చేశాడు. సంగీత రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా 2004లో ముంబైలో జరుపుకొన్న రజతోత్సవ కార్యక్రమంలో మెహదీ హసన్, లతా మంగేష్కర్ సహా సంగీతరంగంలోని దిగ్గజాలందరూ పాల్గొన్నారు.

 

 ఆర్‌జేగా ఘజల్స్‌కు ప్రాచుర్యం...

 సినిమాలకు పాడినా, టీవీ చానళ్లకు పాడినా తలత్ అజీజ్ ఎన్నడూ మెలొడీ బాటను వీడలేదు. తాజాగా 92.7 బిగ్ ఎఫ్‌ఎం రేడియో చానల్ ద్వారా ఆర్‌జే పాత్రలో ఘజల్స్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ‘కరవానే ఘజల్’ పేరిట ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య దేశవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతివారం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ‘ఫేస్‌బుక్’, ‘ట్విట్టర్’లలో కూడా తలత్‌కు పెద్ద సంఖ్యలో

 అభిమానులు ఉన్నారు.

 - పన్యాల జగన్నాథదాసు

 - తలత్ అజీజ్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top