వైవా సక్సెస్‌తో షాకైపోయాం!

వైవా సక్సెస్‌తో షాకైపోయాం! - Sakshi


క్రియేటివిటీ ఉండాలే కానీ ఎవరైనా ఎంత పాపులర్ కావచ్చో చెప్పే ఉదాహరణలు ఒకటా రెండా! చిన్న ప్రయత్నంతో ఆకాశాన్నందుకున్న ఇలాటి ట్రెండ్ సెట్టర్స్ ఎందరో.. ఆ మధ్య అదరగొట్టేసిన ‘వైవా’ షార్ట్ ఫిల్మ్ టీమ్ కూడా ఈ లెక్కలోకే వస్తుంది. చిన్న ఐడియాతో వీళ్లు తీసిన చిత్రం యమ క్లిక్కయింది. యూట్యూబ్‌ను ఏలేసిన ఈ షార్ట్‌ఫిల్మ్ యువ డెరైక్టర్ శబరేష్ టీమ్‌కు బోలెడు గుర్తింపు తెచ్చింది. అంతకు మించి మన మధ్య తిరిగే ఓ కుర్రాడిని ఓవర్‌నైట్ స్టార్ చేసేసింది. చూస్తే నవ్వు తెప్పించే ఆ కుర్రాడిలో మాంచి యాక్టింగ్ టాలెంట్ ఉందని లోకానికి చాటిచెప్పింది. వైవా’లో మెరిసి ఇప్పుడు మూవీలతో బిజీగా ఉన్న ఆ లక్కీ గై.. హర్ష! షూటింగ్ గ్యాప్‌లో సొంతూరికి వచ్చిన హర్ష ‘సిటీప్లస్’తో ఇలా సరదాగా మాట్లాడాడు.

 

 ‘వైవా’.. నా జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్. అతి మామూలుగా మా మిత్రబృందం తీసిన ఆ ‘షార్ట్ ఫిల్మ్ అందరినీ ఎంతగానో అలరించింది. మేం ‘వైవా’ షార్ట్‌ఫిల్మ్ చాలా సింపుల్‌గా చేశాం. షూటింగ్  5 గంటల్లో చేశాం. ఇంత పెద్ద హిట్ అవుతుంది. ఇన్ని లక్షల హిట్స్ వస్తాయి అని అనుకోలేదు. అప్‌లోడ్ చేసిన తర్వాత రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి వైవాకు ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకున్నావా అన్నాడు. ఓ పదివేల వ్యూస్ వస్తాయేమో అనుకున్నాను.


కానీ యూట్యూబ్ ఓపెన్ చేసి చూడగానే   2,75,000 వ్యూస్ ఉన్నాయి... ఒక్క రోజులో! నిజమా కాదా అని నంబర్స్‌ను లెక్కబెట్టుకున్నాను. వైవా డెరైక్టర్ శబరేష్ అయితే ఆ నంబర్ చూసి పడిపోయాడు. దాంతో నాకు ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఫస్ట్ ఆఫర్ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చింది. తర్వాత కొంత మంది నుంచి ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరికొన్ని షూటింగ్ అవుతున్నాయి.

 

 నవ్వించడమే లక్ష్యం

 నాన్నగారు బ్యాంక్ మేనేజర్ కావడంతో రెగ్యులర్‌గా ట్రాన్స్‌ఫర్స్ అవుతూ ఉండేవి. దాంతో ఎడ్యుకేషన్ ఓ చోట సాగలేదు. ఫస్ట్ వైజాగ్... తర్వాత గోవా, అనకాపల్లి.. ప్రస్తుతం మళ్లీ వైజాగ్. టెన్త్ విజ్ఞాన్‌లో చేశాను. నాకు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ చేశాను. చిన్నప్పుడు నాకు ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్ ఉండేది. నన్ను చూసి అందరూ నవ్వేవారు. దాంతో బయటకు రావడానికి ఎక్కువగా ఇష్టపడేవాడిని కాదు.


కానీ తర్వాత అనిపించింది... యాక్టింగ్ చేసి ఇంకా నవ్వించాలని. నాకు చిన్నప్పుడు స్టేజ్ షోస్ వేసిన అనుభవం ఉంది. అందుకే ఫస్ట్ షార్ట్‌ఫిల్మ్‌గా ఛత్రపతి సినిమాలోని ఒక డైలాగ్‌ను కాలేజ్ లైఫ్‌కు లింక్ చేస్తూ ఒక స్పూఫ్ రాసి షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఒక రియాలిటీ షో స్పూఫ్ చేశాం. దాని తర్వాత వైవా.

 

 అందరితో బాగా...

 ‘సూర్య వర్సెస్ సూర్య’ సక్సెస్ టూర్ కోసం నేను,నిఖిల్, సత్య, హీరోయిన్ ఊళ్లు తిరుగుతున్నాం. వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశాను. మా అమ్మ చాలా రకాల స్పెషల్స్ చేసి వడ్డించారు. తర్వాత నిఖిల్ ఫోన్ చేసి ‘నువ్వు ఈ సైజ్‌లో ఎందుకు ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది.. ఇంట్లో ఆ రేంజ్‌లో పెడితే ఇంకెలా ఉంటావు?’ అని నవ్వుతూ అనేసరికి ఒకటే నవ్వొచ్చింది. 


అలాగే బ్రహ్మానందం గారితో కూడా మంచి రిలేషన్ ఉంది. ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ ఇస్తాం... నేను ఆయన ఇంటికెళ్లినప్పుడు సినిమాలో కారెక్టర్ ఇప్పించారు. ఎప్పుడూ చాలా సరదాగా,ఫన్నీగా మాట్లాడుతారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది. దోచేయ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన నా గురించి చె ప్పడం ఎప్పటికీ మరచిపోలేను.

 

 వద్దన్నారు..

 సినిమాల్లో అవకాశాలనగానే మొదట డాడీ వద్దన్నారు. కానీ అమ్మ బాగా సపోర్ట్ చేశారు. డాడీ, చిరంజీవి క్లాస్‌మేట్స్. కానీ ఆయనకు నేను యాక్టింగ్ వైపు వెళ్లడమంటే ఇష్టం లేదు. మనకంటూ సెక్యూర్డ్ జాబ్ ఉండాలి కదా? అందుకే వద్దన్నారు. కానీ నా టాలెంట్ చూసి ప్రోత్సహించారు. ‘ఏడాది టైం ఇస్తున్నాం.


సక్సెస్ అయితే ఓకే.. లేదా ఆ ఫీల్డ్ వదిలేయాలి.’ అన్నారు. కానీ లక్కీగా ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. అక్కాబావా కూడా సపోర్ట్ చేస్తున్నారు. జర్మనీ వెళ్లడానికి ఎగ్జామ్ రాశాను. మంచి స్కోర్ వచ్చింది. ఒకవేళ ఇందులో సక్సెస్ కాకపోతే ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లాలనుకుంటున్నాను.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top