స్టార్ హీరో: మే..మే..మేక!

దర్శకుడు  మిథున్‌ మ్యానుయల్‌ థామస్‌ - మేక - జయసూర్య - Sakshi


జంతువులు ప్రధాన పాత్రగా సినిమాలు తీయడం ఇటీవల చాలా తగ్గిపోయింది. గతంలో  ఏనుగు, పొట్టేలు, శునకం, ఆవు...ఇలా అనేక జంతువులు కీలక పాత్ర పోషించిన చిత్రాలు చాలా వచ్చాయి. అయితే ఇటువంటి చిత్రాలు నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. జంతువులను తమకు కావలసిన విధంగా మలచుకోవడం, నటింపజేయడం దర్శకుని నైపుణ్యంమీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడు ఎన్నో తిప్పలు పడాలి. ప్రయోగాలు చేయగల సత్తా ఉన్నవారే ఇటువంటి చిత్రాలు నిర్మిస్తారు.



ప్రయోగాలు చేయడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. సూపర్‌స్టార్స్‌ నుంచి యువ హీరోల వరకూ, సీనియర్ దర్శకుల నుంచి యువ దర్శకుల వరకు అక్కడ అందరూ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తారనేది జగమెరిగిన సత్యం.  మలయాళ సూపర్‌హిట్‌  సినిమా 'ఓమ్‌ శాంతి ఓషానా'కు స్క్రిప్ట్‌ రాసిన మిథున్‌ మ్యానుయల్‌ థామస్‌,  మలయాళ హీరో జయసూర్య ఇప్పుడు అటువంటి ప్రయోగం చేయనున్నారు. థామస్‌ దర్శకత్వం వహించే 'ఆడు ఓరు భీకర జీవి ఆను' అనే చిత్రంలో ఓ మేక ప్రధాన పాత్ర పోషిస్తోంది.  మలయాళంలో ఆడు అంటే మేక.  ఈ చిత్రాన్ని పూర్తిగా హాస్యంతో నింపేస్తున్నారు.



ఇందులో నటించే మేక స్టార్‌ హీరోలకు ధీటుగా, భీకరంగా నటిస్తుందని చెబుతున్నారు. ఆ మేక  సత్తా చూడాలంటే థియేటర్లకు వెళ్లవలసిందేనని అంటున్నారు. ఓ గ్రామంలో జరిగే ఆటల పోటీలు ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కథ మొత్తం ఆ మేక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.  మేక లీడ్‌ రోల్‌లో మలయాళంలో ఓ సినిమా రూపొందడం  ఇదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం కేరళలోని అత్యంత సుందరమైన ప్రదేశం ఇడుక్కిలో జరుపనున్నారు.  ఈ చిత్రాన్ని నవంబర్ నాటికి పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. మేక నటన, హావభావాల ప్రదర్శన, పోరాటాలు... చూడటం కోసం ఎదురుచూద్దాం.


తెలుగులో కూడా ఓ పెంపుడు కుక్క యథార్థగాథ ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య నిర్మాతగా  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో  ప్రముఖ హాస్యహీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో దీనిని రూపొందిస్తున్నారు.


 - శిసూర్య

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top