కంటే కొడుకునే కనాలి!

కంటే కొడుకునే కనాలి! - Sakshi


అప్పుడెప్పుడో.. ఉయ్యాల్లోనే బిడ్డల పెళ్లిళ్లు అవడం విన్నాం.. కొండొకచో కన్నాం కూడా! ఇప్పుడు ఉయ్యాల్లో బిడ్డల్ని విక్రయించడం సర్వసాధారణం!. ఎక్కడో నాగరికత (మనమనుకునే నాగరికత) లేని ప్రాంతాల్లో కాదు.. ఇక్కడే ఈ నగరం నడిబొడ్డునే!.

 - సరస్వతి రమ

 

కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన..

ఒక తల్లికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం నాలుగో కాన్పూ చూసింది అత్తింటి వాళ్లు వంశాంకురం కావాలన్నారని. ఆ వంశం గొప్పదనం నాలుగు కాలాలకు కాదుకదా.. కనీసం ఆ నాలుగు కాలనీలక్కూడా తెలియదు. కొడుకు లేక ఆస్తి దాయాదుల పాలవుతుందేమో అని అనుకోవడానికి ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపరులూ కారు. ఆ మాటకొస్తే ఈ తల్లి పురిటికీ పైసల్లేవ్. అయినా నాలుగో కాన్పుకీ సాహసం చేసింది. ఆడపిల్లే పుట్టింది. ఆ బిడ్డను చూసి కన్నతల్లి సహా భర్త, అత్తమామలంతా ముఖాలు ముడుచుకున్నారు.

 

పాలు పట్టనివ్వలేదు

మళ్లీ అమ్మాయే పుట్టేసరికి రెండు రోజులు బాధపడ్డా మూడోరోజు సర్దుకుంది తల్లి. పసిబిడ్డను అపురూపం చేయసాగింది. ఇది సహించలేకపోయారు అత్తింటి వాళ్లు. ఆకలితో ఏడుస్తుంటే పాలు పట్టబోతుంటే బిడ్డను లాక్కుపోయారు. ఊపిరి బిగబట్టి ఏడుస్తున్న పిల్ల సొమ్మసిల్లి పోయే వరకు చోద్యం చూశారు తప్ప తల్లికి ఇవ్వలేదు. కన్నపేగు కదులుతుంటే బిడ్డనివ్వమని అత్త కాళ్లు పట్టుకుంది, భర్తనూ బతిమాలింది. ఈడ్చి తన్నారు. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయింది ఆమె. ఆ తర్వాత తేరుకొని చూస్తే ఇంట్లో చంటిపిల్ల లేదు. చిట్టిచెల్లెలు కోసం ఇల్లంతా వెతుకుతున్న తల్లిని చూసిన ముగ్గురు బిడ్డలు ‘అమ్మా.. చెల్లెల్ని నాన్న, నానమ్మ ఎవరికో ఇచ్చి పైసలు తీసుకున్నరు’అని చెప్పారు. తల్లి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. నిలదీద్దామంటే, ఇంట్లో ఆ ఇద్దరూ లేరు. వచ్చాక అడిగితే ‘ఐదువేలకు అమ్మేసినం. నీ డెలివరీ ఖర్చెక్కడి నుంచి తెస్తం’ అని ఎదురుప్రశ్న వేశారు. ఆ మాటలు విన్న తల్లి హతాశురాలైంది.

 

 ఇప్పుడు..

 ఇది జరిగి తొమ్మిదినెలలైంది. ఇప్పటికీ ఆ బిడ్డ తలపుల్లో ఆ తల్లి పిచ్చిదైపోయింది. ‘చంటిది ఏడుస్తుంది పాలు పట్టాలే’ అంటూ తిరుగుతుంటుంది. తల్లి ఆలనాపాలనా లేక మిగిలిన ముగ్గురు ఆడపిల్లలూ బాధపడుతున్నారు. ఆ ముగ్గురులో ఆఖరు పిల్లను మాత్రమే స్కూల్‌కి పంపించి తతిమా ఇద్దర్ని ఇంట్లో పనికి నానమ్మకు సాయంగా ఉంచాడా తండ్రి. అయితే అటు బిడ్డను అమ్ముకున్నామన్న పశ్చాత్తాపం ఇటు ఆ భర్తలోకానీ, అత్తలో కానీ లేశమాత్రం లేవు. భార్య మతిస్థిమితం కోల్పోయిందని ఈమధ్యే రెండో పెళ్లికీ ప్రయత్నిస్తే కాలనీవాసులు దాన్ని తప్పించారట. రెండో పెళ్లి ద్వారా అయినా కొడుకుని కనాలని వాళ్ల ఆశ. సభ్యసమాజంలోని మనుషుల తీరు ఇది!

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top