గేటెడ్ ఫన్

గేటెడ్ ఫన్


‘అబ్బ... ఈ రోజు స్కూల్‌కి హాలిడేనే కదా కాసేపు నిద్రపోనీ’ ఓ బుడతడి మారాం. ‘ఆఫీస్ లేదు కదా లేటుగా లేస్తాలే’ ఓ అయ్యగారి గారం.. ‘ఈ రోజు హాలిడేనే కదా ఏ హోటల్లోనో తెచ్చేసుకుంటే.. వంటపని ఉండదు. ఎంచక్కా ఇంకాసేపు నిద్రపోవచ్చు’ ఓ గృహిణి ప్లానింగ్. అయితే ఈ లైఫ్‌స్టైల్ ట్రెండ్‌కు గండికొట్టి, హాలిడేను ‘ఫన్’టాస్టిక్ డేగా మార్చేశారు అపర్ణాకౌంటీ గేటెడ్ కమ్యూనిటీ.

 

మియాపూర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ అపర్ణా కౌంటీలో చిన్నాపెద్దా అందరూ తెల్లవారుజామునే నిద్రలేచారు. హుషారుగా అడుగు బయటపెట్టారు. అలా పెట్టిన అడుగు... తోటి అడుగులతో కలసి పసందైన పరుగుగా మారింది. విశేషాల వినోదమై అలరించింది. ‘ఇప్పటిదాకా ఇలాంటి రన్‌లో పాల్గొనలేదు. ఎంత బాగుందో. అసలు అలసటే తెలియలేదు’ అని ఆనందంగా చెబుతున్న అరవై ఎనిమిదేళ్ల కృష్ణవేణి దగ్గర్నుంచి.. ‘ఎంత హ్యాపీగా ఉందో.. మమ్మీ, డాడీతో కలసి రన్ చేయడం’ అంటూ సంబరంగా చెప్పిన ఆరేళ్ల చిన్నారి వరకూ అందరిలోనూ ఓ సరికొత్త ఉత్సాహం కనిపించింది.

 

ఒకే కుటుంబంలా..

అపర్ణాకౌంటీలో ‘సాక్షి’ సమర్పణలో ఆదివారం నిర్వహించిన ఫన్ రన్ వినూత్న ఉదయాన్ని పరిచయం చేసింది. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ రన్ లో 120 కుటుంబాలకు చెందినవారు పాల్గొన్నారు. అండర్ 10, 10-18.. ఇలా వయసుల వారీగా 5కె, 8కె రన్ నిర్వహించారు. ఇందులో విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. రన్ పూర్తి చేసిన అనంతరం ట్రైనర్ సంతోష్ పాల్గొన్నవారి చేత స్ట్రెచ్ ఎక్సర్‌సైజ్‌లు చేయించారు.  



‘మా కాలనీలో అంతా ఒక కుటుంబంలా ఉంటాం. అన్ని పండుగలూ ఉమ్మడిగా చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాం. వినాయక చవితి వచ్చిందంటే ఆ తొమ్మిది రోజులు మా కాలనీ అంతా సందడే సందడి’ అంటున్న రన్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి.. తొలిసారి జరిపిన ఫన్ రన్‌కు మంచి స్పందన రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.



‘అనారోగ్య సమస్యలున్న పెద్దవయసు వారికి, భవిష్యత్తుకు ఉపకరించేలా చిన్నారులకు.. ఇలా పెద్దలూ, చిన్నారులు అనే తేడా లేకుండా అందరికీ స్ఫూర్తిని అందించేందుకే ఈ రన్ నిర్వహించాం. ఇక పై దీనిని రెగ్యులర్ ఈవెంట్‌గా మారుస్తాం’ అని దివ్యారెడ్డి చెప్పారు. సిటీలో విభిన్న సంస్థలు నిర్వహించే మారథాన్‌లు, రన్‌లకు భిన్నంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ వాసుల కోసం వారి ప్రాంగణంలోనే నిర్వహించిన ఈ సరికొత్త పరుగు పండుగ.. రానున్న రోజుల్లో మరిన్ని కాలనీలకు, గేటెడ్ కమ్యూనిటీలకు విస్తరించనుంది. ఆరోగ్య ఉదయాలను మేల్కొలపనుంది.

 - ఎస్బీ


మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top