ఫేస్ ఆఫ్ పోయెట్రీ

ఫేస్ ఆఫ్ పోయెట్రీ


ఇంజనీర్‌ను చేయాలన్నది తండ్రి కోరిక. కుమారుడికి సాహిత్యంపై అమితమైన మక్కువ. నాన్న కాదన్నా... తన మనసు మెచ్చిన వైపే అడుగులు వేసి... అందులోనే ఓ వెలుగు వెలుగుతున్నారు డాక్టర్ కుమార్ విశ్వాస్. హిందీ పద్యాలు, కవిత్వాలతో సాహిత్యాభిలాషులకు చేరువైన ఆయన ఇటీవల ‘కోయీ దివానా కహతాహై...’ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నారు.

 

ఇంటర్మీడియట్ పూర్తయ్యాక నాన్న నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచీ నాకు వంటబట్టిన హిందీపై విపరీతమైన ప్రేమ. అది నన్ను ఇంజనీరింగ్ వైపు వెళ్లనీయలేదు. నాన్నతో దెబ్బలాడి మరీ హిందీ సాహిత్యంలో పీజీ చేశా. నేను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్. చదువు కూడా అక్కడే. పీజీ చేసిన తరువాత 1994లో రాజస్థాన్‌లోని లాలాలజపతిరాయ్ కళాశాలలో హిందీ ప్రొఫెసర్‌గా చేరాను.



పాఠాలు చెప్పడమే కాదు... హిందీ కవిత్వం ప్రత్యేకత, విశిష్టత అందరికీ తెలిసేలా వివిధ నగరాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించా. ఇది ఎంతో మంది యువతను ఆకర్షించింది. నా కవిత్వానికి ఆర్కూట్, ఫేస్‌బుక్ వంటి సామాజిక సైట్స్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అలాగే యూట్యూబ్‌లో నా వీడియోలు నలభై మిలియన్లకు పైగా హిట్స్ సాధించడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను రాసిన ‘కుల్‌గీత్’కు వచ్చిన ప్రశంలు, అభినందనలు ఎప్పటికీ మరిచిపోలేను. కవిత్వమే కాదు.. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

 

విదేశాల్లోనూ...

హిందీ సాహిత్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేయాలన్న సంకల్పంతో విదేశాల్లోనూ కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నా. అలాగే కార్పొరేట్ సంస్థలు, కళాశాల్లోనూ వినిపిస్తుంటా. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఐఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీ రూర్కెలాతో పాటు ప్రముఖ కళాశాలల్లో నా కవిత్వాలు వినేందుకు యువత విపరీతమైన ఆసక్తి చూపించింది. ఇప్పటివరకు చాలా అవార్డులువరించాయి. అన్నింటి కంటే 1994లో డాక్టర్ కున్వర్ బైచైన్ కావ్య సమ్మన్ అవమ్ పురస్కార్ సమితి ఇచ్చిన ‘కావ్య’ అవార్డు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ముక్తాక్, గజల్, గీత్, కవిత్ సంపుటిలకు అభిమానుల నుంచి ఎప్పుడూ మంచి స్పందన వస్తుంది.

 

ఆదరణ ఉంది...

ఇప్పటికే చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చా. ఇక్కడి ఐఐఐటీ హైదరాబాద్‌లో వినిపించిన కవితలకు యువత నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మరిచిపోలేను. సమయస్ఫూర్తిగా విసిరే ఛలోక్తులు, పద్యాలకు అందరూ ఫిదా అయ్యారు. సిటీవాసులు హిందూస్థానీ మ్యూజిక్‌తో పాటు హిందీ కవి సమ్మేళనాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ హిందీ కవిత్వానికి మంచి ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని సమ్మేళనాలు చేయాలనుకుంటున్నా. ఇక్కడి స్పైసీ ఫుడ్ తెగ నచ్చింది.

వాంకె శ్రీనివాస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top