రాజధానిపై రోజుకో ప్రకటన వెనుక కారణాలు?

రాజధానిపై రోజుకో ప్రకటన వెనుక కారణాలు? - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించే ప్రదేశం ఎక్కడన్న దానిపై ప్రభుత్వంలో ఉన్నవారే రోజుకోరకంగా మాట్లాడటం, తేపకో లీక్ ఇవ్వడంపై  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఓ పక్క రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. మరో పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సలహాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయడానికి సింగపూర్, మలేషియా వెళ్లనున్నారు.



ఈ ప్రక్రియ ఓ పక్క జరుగుతుండగా ప్రభుత్వంలో ఉన్నవారు, అధికార పార్టీ సీనియర్ నేతలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య - కృష్ణా జిల్లా నూజివీడు - ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం - అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం - అందరికి అందుబాటులో ఉండే ప్రదేశం - అన్ని వసతులు ఒకే చోట ... అని రకరకాలుగా చెబుతున్నారు. ఎక్కువగా విజిటిఎం(విజయవాడ-తెనాలి-గుంటూరు-మంగళగిరి) ప్రాంతం పేరు వినవస్తోంది. ప్రభుత్వంలో ముఖ్య నేతలు కూడా ఈ ప్రాంతం పేరునే చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తగినంత భూమి లేదు. ఎక్కవగా భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి సేకరించవలసి ఉంది. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం, రాయలసీమలలో ప్రభుత్వ భూములు తగినంత ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలలో ఇతర మౌలిక వసతులు తగిన స్థాయిలో లేవన్న అభిప్రాయం ఉంది.  మరో పక్క శ్రీభాగ్ ఒప్పందాల ప్రకారం ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలుని రాజధాని చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఉద్యమరూపం కూడా దాల్చుతోంది. ఇంకోపక్క రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములు ఉన్న ప్రదేశమైతే మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో తలా ఒక రకంగా చెప్పడంతో ఒక స్పష్టతరాలేదు. దాంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు.



అధికారంలో ఉన్న ముఖ్యులే రోజుకో ప్రదేశం పేరు చెప్పడంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రాజకీయ నేతలు, వ్యాపారులు అవకాశం ఉన్నమేరకు ఆయా ప్రాంతాలలో భూములు కొనిపెట్టుకున్నారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వచ్చే విధంగా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.  కొందరు నేతలు తమ భూములు అమ్ముకోవడానికి ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పడబోతుందని ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.



మరోవైపు పరిశీలిస్తే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రాంతాలలో భూముల అమ్మకాలు కొనుగోలులు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎకరం రెండు లక్షలు, మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరం 50 లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వ ధరల  ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు  చెల్లిస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వానికి రావలసిన రాబడులు కూడా రావడంలేదు. రాజధాని నిర్మించే ప్రదేశాన్ని అధికారికంగా ప్రకటించేవరకు మంత్రులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలను అయోమయంలో పడవేసే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుంతోంది.


 - శిసూర్య

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top