భర్తల ప్రాణాలు తీస్తున్న '498ఎ'

భర్తల ప్రాణాలు తీస్తున్న '498ఎ' - Sakshi


చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నాడు వేమన మహాకవి. సంసారం కంటే సముద్రం ఈదడం సులువని కూడా చెప్పారు అనుభవజ్ఞులు. అందుకే పెళ్లంటే నూరెళ్ల మంట అంటూ హెచ్చరిస్తూవుంటారు. ప్రాణిగ్రహణం తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయని బ్రహ్మచారులను పెళ్లైన మగాళ్లు ఆట పట్టిస్తుంటారు. హాస్యం మాటెలావున్నా నిజంగానే పరిణయం మగాళ్ల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.



మన దేశంలో పెళ్లయిన మగాళ్ల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహితుడు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు జాతీయ నేర రికార్డు బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వివాహిత మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని తెలిపింది. 2012లో వివాహిత  పురుషులు  64వేల మంది ప్రాణాలు తీసుకోగా, 32 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు.



మహిళపై జరుగుతున్న గృహహింసను నిరోధించేందుకు ప్రభుత్వం తెచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఎ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతోంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు.  



ఒక్క పశ్చిమబెంగాల్లోనే భర్తల ఆత్మహత్యలు గత రెండేళ్లలో 11 శాతం పెరిగాయి. బెంగాల్లో 498ఎ కింద 1.06 లక్షల కేసులు నమోదు కాగా, 80 వేల మంది భర్తలను అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లో ఇరుకున్నవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అయితే 498ఎ దుర్వినియోగం నిలువరించడం కష్టమైన పని అని పోలీసులు అంటున్నారు. ఆలుమగల అనోన్య దాంపత్యమే దీనికి పరిష్కారమంటున్నారు. కాపురాలు ఏ కలతలు లేకుండా సాఫీగా సాగితే వివాహితుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top