సిటిజన్స్

సిటిజన్స్


విద్యార్థులంటేనే ఆటాపాటా.. సరదాలు, షికార్లు.. కంప్యూటర్లతో కాలక్షేపం ఇవే అనుకుంటాం. ఈ లిస్ట్ తమకు వర్తించదంటున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరు దేశం కోసం ఆలోచిస్తుంటారు. దేశ రక్షణకు పాటుపడుతున్న సైన్యం కోసం పనిచేస్తుంటారు. కదనరంగంలో కన్నుమూసిన అమరవీరులను స్మరించుకుంటారు. వారి కుటుంబాలను ఓదారుస్తారు. అంతేకాదు త్రివిధ దళాల్లో చేరి దేశం కోసం పనిచేయాలని యువతను ప్రోత్సహిస్తుంటారు. దేశం కోసం సైన్యం.. సైన్యం కోసం మేము అన్న మహోన్నత ఆశయంతో ఢిల్లీలో ఆవిర్భవించిన సిటిజన్ 4 ఫోర్సెస్ సంస్థ మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో మొదలైంది. సైన్యానికి స్ఫూర్తినిస్తూ సిటీలో తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది.

 

 అమరుల కోసం...

 యువతను ఉత్తేజపరచడమే కాదు.. అమరజవాన్ల కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది సిటిజన్ 4 ఫోర్సెస్. మూడేళ్లుగా కార్గిల్ దివస్ సందర్భంగా ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ విద్యార్థులు. వారి త్యాగాలను తమ ఆటపాటలతో తెలియజేస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను పిలిపించి ఆర్మీ అధికారుల చేతుల మీదుగా సత్కరించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.

 

దేశంలో విభిన్న వర్గాల కోసం పాటుపడే ఎన్‌జీవోలున్నాయి. కానీ డిఫెన్స్ ఫోర్సెస్ కోసం పని చేస్తున్న సంస్థలు అంతగా లేవు. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన సైనికుల కోసం.. అమరులైన జవాన్ల కుటుంబాల కోసం పనిచేసే లక్ష్యంతో సిటిజన్ 4 ఫోర్సెస్ పుట్టింది. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇంజనీరింగ్ విద్యార్థులు. హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (హితమ్)లో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు 2011లో ైెహ దరాబాద్‌లో ప్రారంభించారు.

 

 

 కదలండి ముందుకు

 యూకే, యూఎస్ లాంటి దేశాల్లో మిలటరీలో చేరడానికి యువత పెద్దఎత్తున ముందుకు వస్తుంది. మన దేశంలో యువత డిఫెన్స్‌లో చేరడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దక్షిణాదిలో ఈ ధోరణి మరీ ఎక్కువ.

 

 దీన్ని అధిగమించే లక్ష్యంతో పని చేస్తున్నారు సిటిజన్ 4 ఫోర్సెస్ సభ్యులు. విద్యార్థి దశలోనే దేశభక్తి, త్రివిధ దళాలపై అవగాహన కల్పించి అందులో చేరేలా వారికి సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు, పలు పాఠశాలల విద్యార్థులకు సైనికుల గురించి తెలియజేస్తున్నారు. రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ల సహకారంతో ఆర్మీలో ఎలా ఉద్యోగం సంపాదించాలి..? ఏ పరీక్షలు రాయాలనే అంశాలపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సిటీతో పాటు ఇటీవల వరంగల్‌లోని ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మీలో పనిచేసేందుకు ఇతరులను ప్రోత్సహించడమే కాదు మేము సైతం అంటూ సైన్యంలో చేరుతామంటున్నారు. ఆర్మీలో పనిచేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు అన్నివిధాలా ప్రిపేర్ అవుతున్నారు.

 

 మేమున్నామని..

 దేశం కోసం పనిచేస్తున్న జవాన్లకు యావత్ భారతం మీ వెంటే ఉందన్న ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఈ సంస్థకు చెందిన విద్యార్థులు దేశ సరిహద్దులు చుట్టి వచ్చారు. కార్గిల్, పంజాబ్‌లోని ఆర్మీ బేస్ క్యాంపులను సందర్శించారు. ఈ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలు మెచ్చిన అధికారులు వీరికి బేస్ క్యాంప్‌లకు అనుమతిచ్చారు కూడా.  రాక్‌బ్యాండ్, సంగీత విభావరి వంటి కార్యక్రమాలు నిర్వహించి సైనికులకు ఆటవిడుపుతో పాటు సరికొత్త ఉత్సాహాన్ని అందించారు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగిన ప్రాంతం అసల్ ఉత్తర్ (సరైన సమాధానం) కూడా వీరు సందర్శించారు. అప్పటి యుద్ధ విశేషాలను అక్కడి సైనికులను అడిగి తెలుసుకున్నారు.  

 

 అనుభవజ్ఞుల దారిలో..

 ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందిన కల్నల్ వీపీ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ వీకే చెంగప్ప, మేజర్ జనరల్ అనిల్ శర్మలు ఈ విద్యార్థులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ అనుభవజ్ఞుల మార్గనిర్దేశంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్ మనీని ఇందుకు వినియోగిస్తున్నారు. హితమ్ కాలేజ్ ఆర్థిక సహకారం అందిస్తోందంటున్నారు సిటిజన్ 4 ఫోర్సెస్ అధ్యక్షుడు సంతోష్‌కుమార్. సైన్యం కోసం ముందుకొచ్చిన ఈ విద్యార్థులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 - దార్ల వెంకటేశ్వర రావు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top