పిల్లాడి నోట్లో.. 232 పళ్లు

పిల్లాడి నోట్లో.. 232 పళ్లు - Sakshi


'కొట్టానంటే 32 పళ్లూ రాలతాయి' అంటారు. కానీ, ఆ కుర్రాడికి ఆ వయసుకు ఉండాల్సిన 28 కంటే ఏకంగా 232 పళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని చూసి డాక్టర్లే నోళ్లు వెళ్లబెట్టారు. ఆనక ఆపరేషన్ చేసి, అదనంగా ఉన్న 232 పళ్లనూ తీసేశారు. ఇప్పుడా కుర్రాడు అత్యధిక పళ్లు ఉన్న మనిషిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించబోతున్నాడు. వైద్య చరిత్రలోనే ఇదో అత్యంత అరుదైన ఘటనగా చెబుతున్నారు.



ఆషిక్ గవాయ్ (17) అనే ఈ కుర్రాడికి నాలుగు నెలల క్రితం కుడివైపు బుగ్గ బాగా వాచింది. దాంతో ముంబైలోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాంప్లెక్స్ అడంటోమా అనే సమస్య వల్ల దవడ లోపల ఒక కణితి ఏర్పడుతుందని, దానివల్లే ఇలా అదనంగా పళ్లలాంటివి వస్తాయని వైద్యులు కనుగొన్నారు. ఎడమవైపుతో పోలిస్తే కుడివైపు బాగా వాపు ఉందని, ముందు అది కణితి అని భావించడంతో పిల్లాడి బంధువులు అది కేన్సర్ ఏమో అని కూడా భయపడ్డారని ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వందనా తోరవాడే చెప్పారు.



చివరకు శస్త్రచికిత్స చేయగా.. మొత్తం 232 పళ్లను బయటకు తీశామన్నారు. ఆ ఆపరేషన్కు ఆరు గంటల సమయం పట్టింది. ఇంతకుముందు ఇలాంటి సమస్యే ఉన్న ఒక వ్యక్తికి 37 పళ్లు తీశారు. దాంతో ఆషిక్ ఇప్పుడు గిన్నిస్ బుక్లోకి ఎక్కబోతున్నాడు. చిన్న పత్తి రైతు అయిన అతడి తండ్రికి మాత్రం ఇదేమీ అర్థం కావట్లేదు. ఎందుకిలా జరిగిందో తెలియక తికమకపడుతున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top