ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం!

ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం! - Sakshi


ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది. ప్రజాసమస్యలను శాసనసభలో గొంతెత్తి చాటేది ప్రతిపక్షమే. అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసేది ప్రతిపక్షమే. అటువంటి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం ఈరోజు ఏపి శాసనసభలో అధికార టిడిపి పక్షసభ్యులు చేశారు. శాంతి భద్రతల అంశంపై జరిగే  చర్చను పక్కదోవ పట్టించారు. తాము అధికారపక్షమనే విషయం కూడా మరచి తమ ఇష్టంవచ్చిన రీతిలో  మాట్లాడారు. వ్యవహరించారు. దాదాపు 18 సార్లు అన్పార్లమెంటరీ పదాలు వాడారు. దాంతో సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది.  ఈ కారణంగా సభను పలుసార్లు వాయిదా వేయవలసి వచ్చింది. వాస్తవానికి ఈరోజు బడ్జెట్‌పై మాట్లాడాల్సి ఉండగా, శాంతిభద్రతల అంశంపై చర్చను కొనసాగించి వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిష్కరించవలసిన అనేక సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి సభాసమయం వృధా చేశారు.



అధికార పార్టీ ఎన్నికల హామీల అమలు అంశం చర్చకు వస్తే ప్రభుత్వం ఇరుకున పడుతుందనే భయంతో ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తూ సభను స్తంభింపజేశారు.  సభను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారన్న భావన వ్యక్తమవుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజులలో జరిగిన 11 హత్యలపై చర్చజరపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కోరారు. ఆ హత్యలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వకుండా అధికార పక్ష సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, జగన్మోహన రెడ్డికి గాని సంబంధంలేని గతంలో ఎప్పుడో జరిగిన హత్యలు గురించి ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలకు దిగారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. హత్యలపై సభలో చర్చ కోసం ప్రతిపక్షం  పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని హత్య చేశారు. అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్య చేశారు. 3 నెలల కాలంలో మొత్తం 14 హత్యలు  జరిగినట్లు జగన్ సభకు తెలిపారు.



అసెంబ్లీ సాక్షిగా అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సభలో  వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరోపించారు. అసత్య ఆరోపణలతో తమపై  ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్ సిపి  వాకౌట్ చేసింది.  శాసన సభలో  ఎమ్మెల్యే లేక ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు వారికి మైకు ఇస్తారు. కాని దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష నేతకు మైకు కూడా ఇవ్వలేదు.



- శిసూర్య

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top