రంగుల్లో దేవరాజసం

రంగుల్లో దేవరాజసం


బాల్యం నుంచే ‘రంగుల’ కలలు కన్నారాయన. అంతటితోనే ఆగిపోలేదు. తాను కన్న కలలన్నింటినీ కేన్వాసుపైకి ఎక్కించి, కళాభిమానులకు కనువిందు చేస్తున్నారు. చిత్రకళా ప్రపంచంలో ఆయనది ఐదు దశాబ్దాలకు పైబడిన అనుభవం. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన దేవరాజ్ దకోజీ ఢిల్లీవాసి అయినా, జన్మతః మన తెలుగువాడే. బంజారాహిల్స్‌లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీలో ‘ద వీల్స్ ఆఫ్ లైఫ్’ పేరిట ఈ నెల 7 నుంచి కొలువుదీరిన ఆయన చిత్రాలు భాగ్యనగర కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ నెల 28న వరకు జరిగే ఈ ప్రదర్శన సందర్భంగా నగరానికి వచ్చిన దేవరాజ్... తన అనుభవాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...  

 

 నా చిన్నతనం అంటే 1955 కాలం నాటి పరిస్థితుల గురించి చెప్పాలి. నాకు ఊహ తెలిసీతెలియని వయసులోనే చిన్నచిన్న బొమ్మలు వేసేవాడిని. ఆ తర్వాత అదే ఒక వ్యాపకంలా తయారైంది. నాన్న ఆయుర్వేద వైద్యుడు. నాకేమో చదువుపైన శ్ర ద్ధ తక్కువ. పెన్ను కన్నా పెన్సిల్ మిన్న అనిపించేది. వీలు చిక్కినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో కలిసి ‘జూ’కి వెళ్లి అక్కడున్న జంతువుల బొమ్మలు గీసేవాడ్ని. కొన్ని సార్లు స్నేహితులతో పందెం వేసి మరీ బొమ్మలు వేసేవాడిని.

 

 ఫైనార్ట్స్‌తో కెరీర్ మలుపు..

 నాకు స్ఫూర్తి ప్రదాత అంటూ ఎవరూ లేరు. కాని నేను  హైదరబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో  చదువుతున్నప్పుడు నా ఆసక్తిని గమనించి రాధాకృష్ణ అనే ప్రొఫెసర్  నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే నా తొలి పెయింటింగ్ ప్రదర్శనను 1962లో అమెరికాలో ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు విదేశాలలో దాదాపు ముప్పయికి పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేశా. మెక్సికో యూనివర్సిటీలో ఆయిల్ పెయింటింగ్, ఎగ్ టంపెరా, వాటర్ కలర్, గ్రాఫిక్స్, ఆక్రిలిక్స్ వంటి ప్రక్రియలను నేర్చుకున్నా. ఢిల్లీలోని లలిత కళా అకాడమీలో గ్రాఫిక్ ఇన్‌చార్జ్‌గా 20 ఏళ్లు పనిచే శాను. నా భార్య ప్రతిభ కూడా మంచి ఆర్టిస్ట్. మాకు ఇద్దరు కుమార్తెలు.

 

 నా వర్క్స్ గురించి..

 నాకు ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్స్ అంటే ఇష్టం. కానీ నా చిత్రాల్లో ఎక్కువగా జంతువులు, పక్షులు కనిపిస్తూ ఉంటాయి. కారణం వాటిలో భావోద్వేగాలు ఎక్కడైనా ఒకటే. ఇందుకు చిన్న ఉదాహరణ చెబుతా. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే నెమలి స్వరం వినిపించింది. అక్కడి వాతావరణం, వేషభాషల్లో తేడాలుండవచ్చు. కాని ఎల్లలు దాటినా  మూగజీవాల భావోద్వేగాలన్నీ ఒకేలా ఉంటాయని అప్పుడే గ్రహించాను. అందుకే నా చిత్రాల్లో వాటికి అధిక స్థానాన్నిచ్చాను.

 

 వీల్స్ ఆఫ్ లైఫ్‌లో..

 ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నా పెయింటింగ్ ప్రదర్శన జరుగుతోంది. ఇప్పడు సృష్టి గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘‘వీల్స్ ఆఫ్ లైఫ్’’లోని చిత్రాలు ఎక్కువగా బుద్ధుని జీవన సూత్రాలను స్పృశించేలా ఉంటాయి. ‘గొప్ప జీవితాలకు గొప్ప ఆరంభాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆశించేవన్నీ నీ జీవితంలో జరగవు. జరిగేవన్నీ నువ్వు ఊహించినవి కావు.’ ఇది బుద్ధుడు చెప్పిన గొప్ప నీతి సూత్రం. ఇదే నా లైఫ్ ఫిలాసఫీ కూడా. ఎందుకంటే ప్రతి విషయం ఆరంభం, అంతం అనే రెండు అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.  బుద్ధుడు చెప్పింది కూడా అదే. ఇట్ జస్ట్ నథింగ్ బట్ వీల్స్ ఆఫ్ లైఫ్.

 - శ్రావణ్ జయ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top