టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమే: పురందేశ్వరి

టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమే: పురందేశ్వరి - Sakshi


రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి  చూపు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీపై పడినట్లు సమాచారం. టీడీపీలోకి వచ్చేందుకు తాము  కూడా సానుకూలంగానే ఉన్నామని,  అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పటం విశేషం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న  ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టికెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి.



రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి.  పొత్తుల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట లోక్సభ బరిలోకి దిగి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు.  ఇప్పటికే నందమూరి, నారావారి కుటుంబంలో రాజకీయ పోరు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం  అమెరికా పర్యటనలో ఉన్న చిన్నమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



పిల్లనిచ్చిన బావమరిది బాలయ్య కోసం...పెద్ద బావమరిది హరికృష్ణను ఇటీవల జరిగిన ఎన్నికల్లో  చంద్రబాబు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. హరికృష్ణ కోరుకున్న హిందుపురం అసెంబ్లీ సీటును బాలకృష్ణకు ఇవ్వటంతో...అలకబూనిన హరి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబుకు దూరంగానే మసలుతున్నాడు.



ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయేంతవరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిప్పలు పెట్టిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. బీజేపీ తరపున చిన్నమ్మ కోస్తాలో ఎక్కడ టికెట్టు దక్కించుకున్నా విజయావకాశాలు ఉంటాయనే ఉద్ధేశంతో బాబు చక్రం తిప్పారు. చివరకు రాజంపేట మినహా మరో గత్యంతరం లేని వాతావరణం కల్పించారు. దాంతో పురందేశ్వరి అయిష్టంగానే రాజంపేట నుంచి బరిలో నిలిచారు. చివరికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో బాబు పాచిక ఫలించిందనే చెప్పుకోవచ్చు.



ఎన్నికల ప్రచార సమయంలో పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు.... దగ్గుబాటి దంపతుల్ని తిరిగి టీడీపీలోకి అడుగుపెట్టినిస్తారా అనేది అనుమానమే. తండ్రి పెట్టిన పార్టీ నుంచి కొడుకునే తరిమేసిన ఆయన...కోరి కోరి ప్రత్యర్థులను పక్కకు చేర్చుకుంటారా అంటే సందేహమే. చంద్రబాబు తర్వాత పార్టీలో కీలక పాత్ర ఎవరిది అనే విషయంలో ఇప్పటికీ ఆపార్టీలో స్పష్టత అనేది లేదు.


చంద్రబాబు తన వారసుడు లోకేష్ ను  తెరమీదకు తీసుకు వస్తున్నా ..... చినబాబుకు అంత సీన్ ఉందా అనేది భవిష్యత్లోనే తేలుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు... నందమూరి ఫ్యామిలీతో పాటు, చిన్నమ్మ దంపతుల్ని దగ్గరకు చేర్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దగ్గుబాటి దంపతులు వదిలిన ఫీలర్లపై ''మీరొస్తానంటే....నే వద్దంటానా?'' అని బాబు స్వాగతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top