సినిమా రివ్యూలకు అంతసీనుందా?

సినిమా రివ్యూలకు అంతసీనుందా? - Sakshi


ప్రస్తుతం సినిమా రివ్యూలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. కొంతమంది రివ్యూలను తమ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఒకే ఒక్క రివ్యూ సినిమా కలెక్షన్ల బాక్సులకు కన్నం పెట్టగలుగుతుందా? ప్రేక్షకులను థియేటర్‌కి వెళ్లకుండా ఆపగలుగుతుందా? ఏ సినిమా చూడాలో, ఏ  సినిమా చూడకూడదో ప్రేక్షకులకు  తెలియదా? ఇక్కడ  మన రివ్యూలు గ్రేటా? లేక మన సినిమాలు  వీకా? ఇదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌. సినిమా అంటే కళాత్మక విలువలు - సామాజిక బాధ్యత - వినోదం- వ్యాపారం...ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ నిర్మాత, దర్శకుడి ఆలోచనలపై ఆధారపడి సినిమా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇది కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయినప్పటికీ, మరో కోణంలో చూస్తే కొన్ని వేల మంది కార్మికుల శ్రమ, కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చే రంగం. ఎంతోమంది కళాపోషణకు చిరునామా. ఎన్నో అద్భుత కళాఖండాలకు నెలవు.



ఇంత పెద్ద ఇండస్ట్రీలో పేమెంట్లతో పాటు కామెంట్లు కూడా ఉంటాయి. హిట్లు ఒక్కటే కాదు. దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యే ప్లాప్‌లు కూడా క్లాప్‌ కొడతాయి. నలుగురికీ నచ్చక పోయిన సినిమాలతో పాటు నలుగురికీ నచ్చి కూడా ఆడని బొమ్మలుంటాయి. ఇక్కడ కారణాలు అడిగితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతారు. ఫ్లాప్‌ సినిమాను కూడా ఎలాగోలా జనంమీద రుద్దడానికి కావాలనే కాంట్రవర్సీలు క్రియేట్‌ చేసే రోజులివి. ఇలాంటి సమయంలో కూడా ఒక విషయం మాత్రం సినిమావాళ్లను భయపెడుతోంది. ఒక డైరెక్టర్‌కు, నిర్మాతకు లేదా హీరోకి బెనిఫిట్‌ షో చూశాక లేని భయం, ఆ తర్వాత వచ్చే రివ్యూలపై ఉందంటే అతిశయోక్తి కాదు. నిజంగానే మన రివ్యూలు అంత ప్రభావం చూపిస్తున్నాయా? లేక సినిమాలు అంత పేలవంగా వస్తున్నాయా? అనే ప్రశ్నలు సగటు సినిమా అభిమానిని తికమక పెడుతున్నాయి



రాసేవాడికి తీసేవాడు లోకువా? ఇది రివ్యూలు చదివి ఒళ్లుమండిన సినిమా పెద్దల మాట. తీసేవాడికి చూసేవాడు లోకువా? ఇది సినిమా చూసి తల బొప్పికట్టిన అభిమాని మాట. రెండూ బాగానే ఉన్నాయి కానీ, సినిమా బాగుందో లేదో చూసి నిర్ణయించుకునే ఛాన్స్ కూడా ఈ రివ్యూలు ఇవ్వడంలేదనేది ఇండస్ట్రీ వాదన. జరగాల్సిన ఘోరాన్ని ముందుగానే ఆపి ప్రేక్షకుడికి టికెట్‌ డబ్బులతో పాటు కాస్త ప్రశాంతతను మిగులుస్తున్నామనేది క్రిటిక్స్ చెబుతోన్న పాయింట్‌.



నిజంగా సినిమాలో దమ్ముంటే ఆడదా? ఈ దిక్కుమాలిన రివ్యూలు చదివి మంచి సినిమా చూడ్డం మానేస్తారా? ఇది సినిమా లాభనష్టాలతో ఏమాత్రం సంబంధంలేని కొంతమంది మాట. అయితే ఒక్కటి మాత్రం నిజం. వారం తర్వాత పికప్‌ అవుతుందిలే అనుకోడానికి ఇది 'శంకరాభరణం' కాలం కాదు. నెమ్మదిగా టాక్‌ బిల్డప్‌ అవుతుంది అనుకోడానికి కనీసం 'పోకిరీ' టైమ్‌ కూడా కాదు. ఇప్పుడంతా వన్‌ వీక్‌ షో. ఎంత పెద్ద సినిమా కథైనా మొదటివారంలోనే తేలిపోతుంది. అందుకే రివ్యూలకు అంత ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు.



నిజానికి మంచి సినిమా ఏదో, ముంచే సినిమా ఏదో థియేటర్లో తల పెట్టాక తెలుసుకునేంత తీరిక ఇప్పుడు చాలామంది ప్రేక్షకులకు లేదు. వెబ్‌సైట్లు పేపర్లు చూశాక టికెట్ బుక్ చేసేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎలా తీశామన్నది కాదన్నయ్యా,  రివ్యూలో సరిగా రాశారా లేదా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్ పేరడీ డైలాగైపోయింది. అందుకే బడా బడా సినిమా బాబులు కూడా రివ్యూలను లెక్కచేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంతపెద్ద బాధ్యతను ఫిల్మ్ క్రిటిక్స్ అంతే బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారా ? అనేది చర్చించాల్సిన అంశమే. ప్రేక్షకులు, అభిమానులు, కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాను ఒక డైరెక్టర్ అంతే బాధ్యతగా తీస్తున్నాడా అనేది కూడా చర్చిస్తున్నారు.



సినిమా బాగుందో లేదో తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్లాల్సిన పనిలేదు. ఇంటర్ నెట్ ఓపెన్ చేస్తే చాలు బోలెడు రివ్యూలు కనిపిస్తాయి. లేకపోతే  ఏదైనా మాగజైన్స్ చూసినా, పేపర్ తిరగేసినా సినిమా ఎలా ఉందో అవే చెప్పేస్తాయి. ఇంతకీ రాస్తున్న రివ్యూలలో నిజముందా?  విమర్శకులకు, ఇండస్ట్రీకీ ఎందుకు పొసగటంలేదు? అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. నేడు పట్టుమని వారంరోజులు కూడా థియేటర్స్లో నిలబడుతోన్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సామాన్య ప్రేక్షకుడు తీరిక చూసుకుని సినిమా చూద్దాం అనుకునే రోజులు పోయాయి. టెక్నాలజీ డెవలెప్ అయిన తర్వాత సినిమా రివ్యూలకు ప్రాధాన్యత పెరిగింది. రివ్యూలు బాగుంటేనే సినిమా కెళ్లే ప్రేక్షకులున్నారు. ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే, కుప్పలుతెప్పలుగా సినిమా సైట్స్ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ మూవీస్ పై రివ్యూస్ రాస్తున్నారు. ప్రముఖ సైట్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లూ ఉన్నారు. ఐతే, స్వలాభంకోసం కొన్ని సైట్స్ అబద్దాలు రాస్తున్నాయని కూడా ఓ వాదన ఉంది. విమర్శ అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కళారంగాల్లో అది కామన్గా జరిగే ప్రక్రియ. కానీ కొంతమంది డైరెక్టర్లకు రివ్యూలు నచ్చడంలేదు. అంత కష్టపడి తాము సినిమా తీస్తే, ఒకే ఒక వ్యక్తి రాసే అభిప్రాయానికి ఎందుకు విలువ ఇస్తారని మండిపడుతున్నారు.  



సినిమా పరిశ్రమ పెద్దలు, విమర్శకులు ఎవరి వాదం వారిది. సినిమా బాగుంటే మౌత్ టాక్తోనే సూపర్ హిట్ అవుతాయి. ఫలానా సినిమా చూడాలని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటే  వారిని ఎవ్వరూ ఆపలేరన్నది కొందరి వాదన.   రామ్ గోపాల్ వర్మ  వివాదాలకు, పబ్లిసిటీకీ కేరాఫ్ అడ్రెస్. ఆయనేం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాడు. పైగా ఆ నిజాన్ని బాహాటంగా ఒప్పేసుకుంటాడు. ఆర్జీవీ లాంటి ప్రముఖ దర్శకుడు కూడా క్రిటిక్స్ పై కామెంట్స్ చేస్తున్నాడు. నా ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీసుకుంటా అంటూ వితండవాదం చేస్తుంటాడు.



పెద్ద సినిమాల విషయానికొస్తే వాటిలో స్టార్ హీరోస్ ఉంటారు. వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపుతుంటాయి. వారం రోజులు బొమ్మపడితే చాలు రికార్డులు బ్రేకవుతాయి. మరి స్టార్ హీరోల సినిమాలపై కూడా నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఐనా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.ఆ సినిమాలకు రివ్యూలు చూడకముందే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అందువల్ల పెద్ద హీరోల కొన్ని చిత్రాలకు ఢోకా ఉండటంలేదు. అభిమానులు తమ హీరో నటించిన ఎంత చెత్త సినిమా అయినా చూస్తుంటారన్నది ఒక వాదన. సినిమాలు చూసే సామాన్య ప్రేక్షకులలో ఎక్కువ మంది  అసలు ఈ రివ్యూలే చదవరని, వారికి రివ్యూలంటే ఏంటో కూడా తెలియదన్నది మరో వాదన.

**

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top