రంగుల హంగులు

రంగుల హంగులు - Sakshi


‘రాజు వెడలె రవి తేజములలరగ’ అంటూ నటులు తెరవెనుక నుంచి వస్తుంటే... వేదిక అదిరిపోయేది. ‘చెలియో చెల్లకో...’ అని గొంతెత్తి పాడితే పల్లె పల్లె అంతా ప్రతిధ్వనించేది. ఒకప్పుడు రంగస్థలం.. ప్రజల జీవితంలో భాగం. సాంకేతికను అందిపుచ్చుకుని ఓ వెలుగు వెలగాల్సింది... శాటిలైట్ లైట్స్ ముందు మసకబారిపోయింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ ఎవర్‌గ్రీన్ ఆర్ట్... మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది! నగరంలోనూ పునరుజ్జీవం పొందుతోంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆ వెలుగు నీడలు...                  కోన సుధాకర్‌రెడ్డి

 

తెలుగు నాట రంగస్థలం 1880లో మొదలైంది. తోలుబొమ్మలాట క్రమంగా నాటకమైంది. ఆ తరువాత తెర ఆవిష్కృతమైంది. మొదట తెల్ల డేరాల నడుమ ఆముదపు దీపాలు, కాగడా వెలుగుల మధ్య నాటకాలు ప్రదర్శితమయ్యేవి. 1885లో కడప జిల్లా చక్రాయపేట మండలం సురభి గ్రామంలో రామిరెడ్డి- చెన్నారెడ్డి ఇంట్లో పెళ్లి సందర్భంగా ‘కీచక వధ’ నాటకంతో సురభి నాటకాలు పురుడుపోసుకొన్నాయి. సురభి రంగప్రవేశం నాటకరంగంలో ఓ విప్లవం. తెలుగు రంగస్థల రూపురేఖలనే మార్చేసింది. అప్పటివరకు నేలపైనే జరిగిన ప్రదర్శనలు... సురభి తరువాత స్టేజీ దశకు రూపాంతరం చెందాయి.

 

మొదట్లో...

కథా వస్తువు, టెక్నిక్, సంభాషణలు, ఆహా ర్యం, అభినయం, వేదిక ఇవన్నీ కలిస్తేనే రంగస్థలం. కథా వస్తువులుగా రామాయణ, మహాభారతాలు, పురాణాలు, జానపదాలు, గ్రామదేవతల కథలు, కుల పురాణాలు కథావస్తువులు. పల్లెల్లో ప్రధాన వినోదం ఈ నాటకాలే. పల్లెల్లో పనులన్నీ అయిపోయి, రాత్రి పూట భోజనాలు ముగిశాక ప్రారంభమయ్యే రంగస్థల ప్రదర్శనలు తెల్లవార్లు జరిగేవి. నెల రోజులపాటు కొనసాగేవి.


క్రమక్రమంగా నిడివి ఆరు గం టలకు కుదించుకుపోయాయి. ఇప్పుడు సినిమాల తరహాలో రెండు గంటలకే పరిమితం అయ్యాయి. కాలంతోపాటు కథల్లో మార్పు వచ్చింది. సాంఘిక నాటకాలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు సమకాలీన కథలతో రంగస్థలం కొన్ని థియేటర్స్‌కే పరిమితమైంది.  

 

ఎన్నో మార్పులు...

 రంగస్థలం ప్రారంభ దశలో తెల్లటి పరదాలు కట్టి నాటకాలు ఆడేవారు. ఇప్పుడు మిషన్‌తో డేరాను ఆపరేట్ చేస్తున్నారు. ఆముదపు దీపాలకు బదులు ఎల్‌ఈడీ స్క్రీన్స్, మోనోలైట్స్ వాడకంలోకి వచ్చాయి. ప్రత్యేకించి టెక్నాలజీ సాయంతో లైటింగ్ పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవం థియేటర్ యాంబియెన్స్‌ను మార్చేసింది. ఒకప్పుడు సంస్కృతంలోనే ఉండే సంభాషణలు.. రానురాను  సరళమై వ్యవహారికంలోకి వచ్చేశాయి.



అప్పుడు డైలాగ్‌లు పద్యంలా రాగయుక్తంగా ఉండేవి. మేకప్, ఆభరణాలు, ఆహార్యంలో అనేక మార్పులు సంతరించుకొన్నాయి. మొదట స్త్రీల పాత్రలు లేకుండానే కొనసాగినా... తరువాత కాలంలో స్త్రీపాత్రలను పురుషులే పోషించేవారు.   సురభి నాటకం ‘కీచకవధ’లో తొలి నటి పాపాభాయి ద్రౌపదిగా రంగస్థల ప్రవేశం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో తెలుగు వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ, ఓయూల్లో థియేటర్ ఆర్ట్స్‌పై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు, యువత నాటకాల వైపు ఆకర్షితులవుతున్నారు.

 

వీటికి తోడు...

ఇప్పుడు కాంటెంపర రీ థియేటర్‌కి నగరంలో వేదిక లామకాన్. పల్లె కథలనే కాదు, మోడరన్ ప్లేస్‌ని ప్రదర్శిస్తోంది. సమాహార, సూత్రధార్, ఉడాన్ పెర్‌ఫామింగ్ ఆర్ట్స్, భూమిక థియేటర్ గ్రూప్, సెంట్రల్ యూనివర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్... తరచూ ఏదో ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఓల్డ్ ఆర్ట్స్‌ని న్యూ జనరేషన్స్‌కి పరిచయం చేస్తున్నాయి.ఔత్సాహికులను ఆకట్టుకునేందుకు విరివిగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాయి. వారాంతాల్లో కేవలం మల్టీప్లెక్స్, సినీమాక్స్‌లకే కాదు... ఈ థియేటర్‌కీ జనం క్యూ కడుతున్నారు.   

 

 

40 ఏళ్లుగా...  

1974 -75 నుంచి లవకుశలో రాముడు వేషం వేస్తున్నా. 1981 నుంచి వీరబ్రహ్మంగారి జీవిత చరిత్రలో బ్రహ్మం వేషం వేస్తున్నాను. ఏడాదికి 250 ప్రదర్శనలు ఇస్తున్నాను. మా టీమ్‌లో 60 మంది కళాకారులు ఉంటారు. నాకు అమ్మే స్ఫూర్తి. ఆమె నేర్పిన క్రమశిక్షణే శ్రీ వేంకటేశ్వర నాట్య మండలికి ఖండాంతరాల్లో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రభుత్వం సురభికి రెండెకరాల స్థలం ఇచ్చి, ఆర్థిక సహాయం అందిస్తే సురభి నాటకాలను దేదీప్యమానంగా వెలిగిస్తాం.

 - పద్మశ్రీ ఆర్.నాగేశ్వరరావు (సురభి బాబ్జి)

 

సమన్వయంతో...  

తెలంగాణ రాష్ట్రంలో కళలు వర్థిల్లుతున్నాయి. అందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు. హైదరాబాద్‌లోని ఉర్దూ- తెలుగు నాటకాలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. సురభి థియేటర్, ఖాదిర్ అలీ బేగ్ థియేటర్స్ నగరానికి తలమానికం. భాషా- సాంస్కృతిక అంశాలను సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్తున్నాం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశాం.



చిందుయక్షగాన కార్యక్రమాలు, పద్యనాటకోత్సవాలు నిర్వహించాం. 16 రోజులుగా సురభి నాటక మహోత్సవాలు భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోజరుపుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ కళకారులను ఇక్కడికి రప్పించడమే కాదు... మన కళాకారులను, కళలను ఇతర ప్రాంతాలకూ పంపుతున్నాం.

 - మామిడి హరికృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top