సమష్టి నాయకత్వం మిథ్య!

కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి - Sakshi


 త్రికాలమ్



 తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి నడిచిన కోదండరాంని కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? కోడెల శివప్రసాద్‌కి మంత్రిపదవి ఇవ్వకుండా స్పీకర్‌గా కూర్చోబెట్టడానికి చంద్రబాబుకి ఉన్న సమస్య ఏమిటి? పైకి ఎంత ధైర్యంగా కనిపించినప్పటికీ అభద్రతాభావం నాయకులను వెన్నాడుతుంటుంది. లోక్‌సత్తాకి సత్తా లేకపోయినప్పటికీ ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ తనతో ఏకీభవించేందుకు నిరాకరించిన చిరకాల సహచరులు వర్మ, శ్రీనివాసరావులపై బహిష్కరణ వేటు వేశారు.



 ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం మన మనస్తత్వానికి పొసగే ఆదర్శాలు కావేమో! మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా నాయకులందరూ సమానస్థాయిలో సమాలోచనలు జరిపి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. ప్రజాదరణ పొందిన అధినాయకుడిని ఇతర నాయకులు అనుసరించడమే కానీ అందరూ కలిసి ఆలోచించి ఆమోదించిన తీర్మానం అంటూ ఉండదు.



 శనివారంనాడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ మండలి సమావేశం జరిగిన తీరూ, పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్; ప్రొఫెసర్ అజిత్ ఝాలను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బర్తరఫ్ చేసిన విధానం గమనించినవారికి ఆశ్చర్యం కలిగి ఉండదు. ఆవేదన చాలామందికి కలిగి ఉంటుంది. రెండేళ్లు జయప్రదంగా మనగలగడమే కాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అపూర్వ విజయాన్ని నమోదు చేసుకొని చరిత్ర సృష్టించిన పార్టీ సంఘటితమై, విస్తరించాల్సిన తరుణంలో విభేదాలతో కొట్టుమిట్టాడటం, చీలిక దశకు చేరుకోవడం విషాదం. ఇందుకు  ప్రధాన కారణం ఆ పార్టీ నాయకులు చెప్పుకున్న సంకల్పం ఆచరణ సాధ్యమైనది కాకపోవడం. 1952 నుంచి దేశంలో జరుగుతున్న ఎన్నికలను క్రమంగా  ధనబల ం, కులబల ం,కండబల ం భ్రష్ట పట్టించిన తర్వాత స్వచ్ఛమైన, పరిశుద్ధమైన జనహితమైన రాజకీయం చేస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలపైన అనుమానాలు ఉన్నప్పటికీ అత్యధికులు ఆహ్వానించారు. గుర్రం ఎగరా వచ్చు అన్నట్టు అద్భుతం జరగావచ్చునని ఆశగా ఎదురు చూశారు.



 ఆప్ జాతీయ మండలి సమావేశంలో కొంతమంది సభ్యులను కొట్టినట్టు ప్రశాంత భూషణ్ ఆరోపించారు. అయినప్పటికీ ఆప్ కండబలంపైన ఆధారపడిన పార్టీ కాదు. కులగణాంకాలు పరిగణించి ఎన్నికలలో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇచ్చిన పార్టీ కాదు. ఎన్నికల ఖర్చుకోసం చందాలు వసూలు చేసినప్పటికీ చందాదారుల పేర్లూ, చందాల మొత్తాల వివరాలూ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పెట్టారు.  ఆ మాత్రం నిష్టగా, నియమబద్ధంగా, ఆదర్శవంతంగా ఎన్నికల సమయంలో వ్యవహరించడమే అపూర్వం. ఆప్ దేశమంతటా విస్తరించాలనీ, ప్రత్యామ్నాయ రాజకీయాలకు విశాల వేదిక కావాలనీ ఆకాంక్షించినవారు కోట్ల మంది ఉన్నారు. వారందరికీ తాజా పరిణామాలు ఆశాభంగం కలిగించి ఉంటాయి. గుండెలు బరువెక్కి ఉంటాయి.

 

 నిరాధారమైన ఆరోపణలు

 సహచరుల విమర్శలను సహృదయంతో స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకునే సహనం, సంయమనం చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుంది. యాదవ్, భూషణ్‌లు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినారనీ, పార్టీని ఓడించే ప్రయత్నం చేశారనీ అధికారవర్గం చేసిన ఆరోపణలను నిరూపించలేదు. వారిద్దరూ రాజీనామా పత్రాలు సమర్పించారన్నది కూడా సత్యదూరం. పార్టీ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని వారిద్దరూ పట్టుపట్టారంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలింది. వారికి సంజాయిషీ నోటీసులు ఇవ్వలేదు. జాతీయ మండలి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అసలు విషయం ఏమిటంటే సమాన స్థాయి కలిగిన ముగ్గురు నాయకులు కలసి పార్టీని నడిపించడం సాధ్యం కాదని తేల్చారు. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది కుట్రో, ఎవరు బలైనారో, ఎవరు బలిచేశారో ఎప్పటికీ తేలకపోవచ్చు. కానీ జరిగిన పరిణామాలలో మాత్రం వింత లేదు. ఇది చాలా సహజమైన పర్యవసానం.

 

 ఉద్యమాలు నడిపిన నాయకులకూ, ఉద్యమాల తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులకూ ఆత్మవిశ్వాసం అధికం. తమ అభిప్రాయమే సరైనదనే గాఢమైన నమ్మకం వారికి ఉంటుంది. అందుకు భిన్నంగా ఎవరైనా మాట్లాడినా, వాదించినా సహించే శక్తి ఉండదు. మహామహా నాయకులే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న సహచరులను భరించలేకపోయారు. తనతో విభేదించి పార్టీ నుంచి నిష్ర్కమించినవారిని కూడా వెనక్కి పిలిపించుకొని మంత్రి పదవులు ఇచ్చిన సంస్కారం లెనిన్ ప్రదర్శించాడు. సలహాలు స్వీకరించే సహృదయం లేని స్టాలిన్ సహచరులను శత్రువులుగా  పరిగణించి వారి ప్రాణాలు తీయించాడు. శాంతిప్రియుడుగా,  జాతిపితగా గౌరవించే  గాంధీజీ సైతం తన అభిమతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన  సుభాష్‌చంద్ర బోస్‌ను ఉపేక్షించలేకపోయారు.  ఆ పదవి నుంచి బోస్ వైదొలిగి తన అభ్యర్థి పట్టాభిసీతారామయ్య చేతికి పార్టీ పగ్గాలు వచ్చేవరకూ గాంధీ విశ్రమించలేదు. నెహ్రూ సైతం తనతో పొసగని టాండన్ చేత ఏఐసీసీ అధ్యక్ష పదవికి బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ బాధ్యతలు తానే స్వీకరించారు.  ఇందిరాగాంధీ 1966లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది మాసాలకే మొరార్జీ దేశాయ్, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, సంజీవరెడ్డి, అతుల్యఘోష్ వంటి సీనియర్లను సిండికేటుగా అభివర్ణించి వారి బెడద వదిలించుకునేందుకు  పార్టీని చీల్చారు. ప్రధానిగా ఉంటూనే పార్టీని గుప్పిటలో పెట్టుకున్నారు. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు సైతం జోడు పదవులను నిర్వహించినవారే. సోనియాగాంధీకి ఎదురు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మనగలరా? నరేంద్రమోదీ మాట కాదంటే బీజేపీలో చోటుంటుందా? ఆర్‌ఎస్‌ఎస్ వల్ల మోదీ ఎంతో కొంత రాజీపడవలసి వస్తున్నదేమో కానీ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు అటువంటి ఇబ్బంది కూడా  లేదు. తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి నడిచిన కోదండరాంని కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? కోడెల శివప్రసాద్‌కి మంత్రిపదవి ఇవ్వకుండా స్పీకర్‌గా కూర్చో బెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఉన్న సమస్య ఏమిటి? పైకి ఎంత ధైర్యంగా కనిపించినప్పటికీ అభద్రతాభావం నాయకులను వెన్నాడుతుంటుంది. లోక్‌సత్తాకి సత్తా (అధికారం) లేకపోయినప్పటికీ ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ తనతో ఏకీభవించేందుకు నిరాకరించిన చిరకాల సహచరులు వర్మ, శ్రీనివాసరావులపై బహిష్కరణ వేటు వేశారు. ప్రాంతీయ పార్టీ ముఖ్యనేతను విమర్శించేవారు ఆ పార్టీలో కొనసాగడం అసంభవం. ఇందుకు భిన్నంగా  అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎంతకాలం  ఉండగలరు?



 ఆర్‌టీఐకి లోబడి ఉండాలంటూ, రెండు కోట్ల రూపాయల తబ్శీళ్లు చెప్పాలంటూ, పారదర్శకంగా వ్యవహరించాలంటూ, నేరచరిత్ర ఉన్నవారికి టిక్కెట్లు ఎందుకిచ్చారంటూ నిలదీసేవారు వ్యవస్థాపక సభ్యులైనా, మేధావులైనా వారిని శిరసావహించే శక్తి కేజ్రీవాల్‌కు లేదు. ఎవ్వరికీ ఉండదు. ఉండాలన్నది ఆదర్శమే కానీ ఆచరణలో కనిపించదు.



 తొలగిన ముసుగు  

 ఐఐటీ పట్టభద్రుడూ, రెవెన్యూ సర్వీస్ ఉన్నతాధికారీ,  మేగ్‌సెసే పురస్కార గ్రహీతా,  అన్నా హజారే అనుంగు శిష్యుడూ, అసాధారణ సమ్మోహనశక్తి కలిగిన ప్రజానాయకుడూ అయిన కేజ్రీవాల్ అంత వరకూ తాను గౌరవించిన  సహచ రులు యాదవ్, భూషణ్ గురించి అంత నీచంగా మాట్లాడటం (వారణాసి వలం టీరు ఉమేశ్ సింగ్‌తో మొబైల్‌లో మాట్లాడుతుండగా రికార్డు అయింది) వినిన వారికి ఏమనిపించి ఉంటుంది?  కేజ్రీవాల్ ఇంతకాలం ధరించిన సంస్కారపు ముసుగు అకస్మాత్తుగా తొలగిపోయినట్టు స్పష్టమై ఉండదా? ఉమేశ్ నాయకుడిని తెగ పొగిడాడు. నరేంద్రమోడీతో పోల్చాడు. దాంతో ఉబ్బితబ్బిబ్బయిన  కేజ్రీవాల్ అజాగ్రత్తగా మాటలు తూలారు. రాజకీయం, అధికార కాంక్ష నరనరానా నిండిన వ్యక్తి మాట్లాడవలసిన భాష కేజ్రీవాల్ నోటి నుంచి వెలువడింది. నా 66 మంది ఎంఎల్‌ఏలను తీసుకొని బయటికి పోయి వేరే  పార్టీ పెట్టుకుంటా’ నంటూ బెదిరించిన కేజ్రీవాల్‌కీ, హమ్ సత్తా కేలియే నహీ, జనతా కీ సేవా కర్నే ఆయేహై (మేము అధికారంకోసం రాలేదు. ప్రజాసేవ చేసేందుకే వచ్చాం) అంటూ వినమ్రంగా పలికిన కేజ్రీవాల్‌కీ మధ్య తేడా ఏమిటి?వినమ్రంగా ఉన్నప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్రత లేదు. వారిద్దరినీ (యాదవ్, భూషణ్) బయటికి పంపించి తీరాల్సిందేననీ, వారితో కలసి పని చేసే ప్రశ్నే లేదనీ తెగేసి చెప్పిన కేజ్రీవాల్‌లో తొలిసారి నియంత కనిపిస్తున్నాడు. ఆయన అసాధారణ రాజకీయవేత్త కాదనీ సాధారణ రాజకీయ నాయకుల స్థాయిలోని వ్యక్తేననీ, ఇంతకాలం మొహంమీద అతికించుకున్న మర్యాదను తొలగించుకు న్నారనీ ఆయనే నిరూపించుకున్నారు. తనకు ఇష్టం లేనివారిని పార్టీ నుంచి సాగనంపడానికి కేజ్రీవాల్ పక్కా వ్యూహం అమలు చేసి విజయం సాధించారు. యాదవ్, భూషణ్‌లు రెండు మూడు వారాలు టీవీ చానళ్లలోనూ, మీడియా సమావేశాలలోనూ అవేశం వెలిబుచ్చవచ్చు. అన్యాయం జరిగిపోయిందంటూ ఆక్రోశం వెళ్లగక్కవచ్చు. ఆప్ ఎంఎల్‌ఏలు కేజ్రీవాల్‌ను వీడే అవకాశం లేదు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఆపదంటూ ఏమీ లేదు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనా, ప్రత్యామ్నాయ పరిపాలనా పద్ధతులను ప్రవేశపెట్టడంపైనా కేజ్రీవాల్, సిసోడియాలు దృష్టి కేంద్రీకరించాలి.

 

 మేధాపాట్కర్‌లాగానే మరి కొందరు ఆప్‌కు రాజీనామా చేయవచ్చు. అడ్మిరల్ రాందాస్ సైతం లోక్‌పాల్ పదవి నుంచి తప్పుకోవలసి రావచ్చు. అయినా పర్వాలేదు. కొత్త పార్టీలో, ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువైన వ్యవస్థలో, అధినాయకుడిని ప్రశ్నించే స్థాయి కలిగిన వ్యక్తులున్న పరిస్థితిలో ఇటువంటి పెద్ద కుదుపు అనివార్యం. యాదవ్, భూషణ్‌లు భవిష్యత్తులో ఏమి చేస్తారన్నది వేరే ప్రశ్న. వారి నిష్ర్కమణతో ఆప్‌కు అవరోధాలు తొలిగిపోయినట్టే కనుక తమకు ఓటు వేసి ఢిల్లీ ప్రజలు తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలపైన ఆశలు ఆవిరైపోయినట్టేనా? కాలమే సమాధానం చెప్పాలి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top