సత్యా సమరసఖి సుందరం

సత్యా సమరసఖి సుందరం


దీపావళికి కారణమైన ఘటన నరకాసుర వధ! ఈ సమరంలో సొమ్మసిల్లిన కృష్ణుడికి వెన్నంటి ఉన్న భాగస్వామి సత్యభామ! ఆ గాథతో భామ ఓ పౌరాణిక పాత్రగానే కాదు.. మన నాట్యకళల్లోనూ తారగా నిలిచింది. అందం, ఆత్మాభిమానం.. అలక, కినుక.. రౌద్రం, ధైర్యం.. సమరం, విజయం.. వంటి లక్షణాలతో  నేటి వనితలకూ ప్రేరణనిస్తోంది! దీపావళినిచ్చిన ఈ ధీర భూమికను, కొనియాడిన వివిధ నాట్యరీతుల్లో ఆ భూమికను పోషించిన నర్తకీమణులు సత్య గురించి చెప్పిన సత్యాలు..

 

 సమరం.. విజయం

 సత్యభామ.. భూదేవి రూపం. నరకాసురుడు ఆమె కొడుకు. ఈ కథ చెప్పే పరమార్థం ఏంటంటే.. చెడు చేసేవాడు కొడుకైనా సరే ఆ తల్లి సహించదు. అందుకే సంహరించి అంతమొందిస్తుంది. సర్వమానవాళికి విజయాన్నిస్తుంది. సత్యభామ పరిపూర్ణమైన స్త్రీకి నిజమైన నిర్వచనం. స్త్రీ, పురుషుడు అన్న భేదం లేకుండా మనుషులంతా తల్లిలాగే ఆలోచించాలి. అప్పుడే చెడు తలంపన్నది ఎవరి మనసుల్లోకి రాదు. స్త్రీల మీద ఈ దాష్టీకాలూ ఉండవ్.

 - అచ్యుత మానస

 (కూచిపూడి, కథక్, భరతనాట్య కళాకారిణి)


 

  అందం.. ఆత్మాభిమానం

 ‘కూచిపూడి’లో సత్యభామ ప్రత్యేకం. ఆమెదే  భామాకలాపం. చాలా స్ఫూర్తిదాయకమైన పాత్ర. అందం.. లాలిత్యం.. ధైర్యం.. ధీరత్వం ఆమె సొంతం. కృష్ణుడిని ఎంత ప్రేమిస్తుందో అంత సాధిస్తుంది..  చివరకు అంతే అండగా నిలబడుతుంది. ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలవి. సరైన సమయంలో తన శక్తియుక్తులతో చెడును సంహరిస్తుంది. భామా కలాపంలో సత్యభామగా వేయడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్. ఐ లవ్ టు బీ ఎ ఉమన్. ఈ జన్మలోనే కాదు ఏ జన్మకైనా!

 - అలేఖ్య పుంజల (కూచిపూడి కళాకారిణి)

 

 ప్రశాంతం.. ప్రకాశం..

 చెడు మీద మంచి విజయమే సత్యభామ రూపం.  మైథాలజీలో ఆ పాత్ర స్త్రీ శక్తికి, యుక్తికి ప్రతిరూపం. పౌరాణికాల్లో ఆ ఉనికి ఉందీ అంటే నిజజీవితంలోనూ ఆ పాత్ర అవసరం ఉన్నట్టే. ఎప్పటికైనా చీకటి తొలిగి వెలుగు రావాల్సిందే. స్త్రీ తన సమస్యల చీకటిపై పోరాడి వెలుగు పరిష్కారాల్ని పొందాలి. జీవితమంతా ప్రశాంతం.. ప్రకాశం!  ఇదే దీపావళి స్ఫూర్తి!

 -మంగళాభట్ (కథక్ నాట్య కళాకారిణి)

 

 రౌద్రం.. ధైర్యం..

 ఒకసారి సిడ్నీలోని తెలుగువాళ్లు ఆ ఏడాది దీపావళికి సత్యభామ, నరకాసురుడు కాన్సెప్ట్‌తో నా నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీపావళి వెనకున్న కథనంతా ముందుగా తెలుసుకొని.. కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకున్నాను. దానికనుగుణంగా కర్ణాటక సంగీత బాణీలనూ సమకూర్చుకున్నాం. అవన్నీ స్టేజ్ మీద నా నాట్యంగా చూసిన అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్. సత్యభామ పాత్రను అర్థం చేసుకొనే అవకాశాన్నీ నాకిచ్చిందా పెర్‌ఫార్మెన్స్. మామూలప్పుడు అంత లాలిత్యంగా కనిపించే ఆమె నరకాసురుడి వధలో ఎంతో రౌద్రం.. అంతకుమించిన ధైర్యం కనబరుస్తుంది.

 - స్మితామాధవ్

 (భరతనాట్య కళాకారిణి)

 - సరస్వతి రమ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top