ఊరగాయ మాంసం.. జ్యుజెజాన్ బిర్యానీ

ఊరగాయ మాంసం.. జ్యుజెజాన్ బిర్యానీ


దాదాపు అన్ని రకాల క్వీజిన్స్‌ను మెనూలో తప్పకుండా పొందుపరిచే సిటీ  రెస్టారెంట్స్... కాస్త ఆలస్యంగాైనె నా తెలంగాణ వంటకాలను గుర్తించడం ప్రారంభించాయి. ఒకటొకటిగా స్థానిక వెరైటీలను తమ అతిథులకు పరిచయం చేస్తూ వస్తున్నాయి. సిటీలో ఉన్న వందలాది మంది ‘ఫుడీస్’లో ఒకడిగా రెస్టారెంట్స్‌ను క్రమం తప్పకుండా సందర్శించే నేను ఫిలిమ్‌నగర్‌లో ఉన్న ‘సింప్లీ సౌత్- బై చెఫ్ చలపతిరావు’ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు ఈ విషయం తెలిసొచ్చింది.

 

 సిటీలో స్టార్ హోటల్స్‌లో చెఫ్‌లుగా పనిచేసినవారు సొంత రెస్టారెంట్స్ ఆలోచన చేయడం అరుదే. ఎందుకంటే  బోలెడంత ఫ్యూచర్ ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ఆదాయానికి గ్యారంటీ లేని వ్యాపారంలోకి ఎందుకొస్తారెవరైనా? అయితే చెఫ్ చలపతిరావు  ఈ సూత్రాన్ని తిరగరాశారు. ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లే అతిథులకు ఆయన చిరపరిచితుడు. ‘చల్లూ’గా మాలాంటి భోజనప్రియులు పిలిచే ఈ హైదరాబాదీ సెలబ్రిటీ చెఫ్ ఇప్పుడు ‘సింప్లీ సౌత్’ యజమాని.

 

 ఈ రెస్టారెంట్ మెనూను చేతిలోకి తీసుకుని తిరగేస్తుంటే... సింప్లీ సౌత్ అన్న పేరులో ఎంత సౌమ్యత ఉన్నా... వంటకాలు మాత్రం అంత సింపుల్ జాబితా ఏమీ కాదని తెలిసొస్తుంది. ముఖ్యంగా హాట్, స్పైసీ రుచులకు పేరుపడ్డ తెలంగాణ వంటలూ ఈ మెనూలో తగిన స్థానం దక్కించుకున్నాయి. వాటిలో చాలా రకాలున్నా... ‘ఊరగాయు మాంసం’ మాత్రం నోరూరించింది. బాగా స్పైసీగా, రుచిగా ఉంది.

 

 గొర్రెపోతు మాంసం తాలూకు ముక్కల్ని సరైన విధంగా మసాలా పచ్చడిలో ఉడికించినట్టుంది. అన్నం, రోటీ, పరోటా వంటివాటి కాంబినేషన్‌లో ఈ బోన్‌లెస్ మటన్ కర్రీ అదరహో అనిపిస్తుంది. మిస్సవ్వకుండా టేస్ట్ చేయాల్సిన ‘అంబాడా గోస్త్’ మరో హైదరాబాద్ వంటకం. గోంగూర రుచికే కాదు.. ఐరన్, విటమిన్స్‌కూ నిలయం. మాంసంతో కలిపి వండినప్పుడు ఇది మరింత రుచిగా, బలవర్ధకంగా మారుతుంది. హైదరాబాదీగా.. బిర్యానీ తినకపోతే అదో వెలితి కదా. మెనూలో ‘జ్యుజెజాన్ బిర్యానీ’ అనే వెరైటీ వంటకం కనిపించింది. హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్రా బిర్యానీలకు ఇది పూర్తిగా విభిన్నం. పురాతన కాలం నాటి సంప్రదాయ బిర్యానీ ఇది. తొలుత చికెన్‌ని బాస్మతీ రైస్‌తో కలిపి వండుతారు. తర్వాత దమ్‌తో ముగిస్తారు. తద్వారా ఇది మరింత లైట్‌గా, ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంటుంది. పొట్ట మరీ నిండుగా అనిపించకుండా మరింత తినాలనిపించేలా ఉంటుంది.

 

 చివరగా నా భోజనాన్ని షీర్ కుర్మాతో పూర్తి చేయడానికి సిద్ధమయ్యా. మొఘలాయి సంప్రదాయం అందించిన ఈ స్వీట్ షీర్‌కుర్మా రంజాన్ పండుగ సమయంలో బాగా పాపులర్ కదా. అయితే ఈ రెస్టారెంట్ దీన్ని ఏడాదంతా వడ్డిస్తుండడం విశేషం. సేమియా పాయసానికి దగ్గరగా ఉండే దీన్ని పాలు, డేట్స్, వెర్మిసెల్లిలో నాణ్యమైన రకం వాడి చేశారు. నోట్లో పెట్టుకోగానే రుచి అమాంతం దేహమంతా పాకినట్టనిపించింది. మరో విశేషం ఏమిటంటే... ఇది చిల్డ్‌గానూ, వేడిగానూ సర్వ్ చేస్తున్నారు.

 - విశాల్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top