ఇంట్లో ఉన్నట్టే!

ఇంట్లో ఉన్నట్టే! - Sakshi


బొమన్ ఇరానీ... పేరు చెప్పగానే ఆయన ఫేస్ కంటే సినిమా క్యారెక్టర్లే కళ్లముందు కదలాడతాయి. అంతగా లీనమైపోతారు ఆయన పాత్రలో. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్ వంటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్సే కాదు... టాలీవుడ్ సన్సేషన్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదిలోనూ నటించి మురిపించిన బొమన్ ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్.

 

హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడకు వచ్చినప్పుడల్లా మాదాపూర్‌లో ట్రైడెంట్ హోటల్‌లో బస చేస్తుంటాను. ఇక్కడి ప్రజలంటే నాకు ఇష్టం. ఎంత కోపం, విసుగు వచ్చినా, ఇక్కడి ప్రజలు సంయమనం కోల్పోకుండా చక్కగా మాట్లాడతారు. సికింద్రాబాద్‌లోని ‘ప్యారడైజ్’ బిర్యానీ ఇష్టం. ముంబై లాంటి నగరాల్లో రెస్టారెంట్లన్నీ పూర్తి కమర్షియల్‌గా ఉంటాయి. ప్యారడైజ్‌లో కూర్చుని తింటే, ఇంట్లో కూర్చుని తిన్నట్లే ఉంటుంది.

 

ఏరియాను బట్టి డ్రెస్సింగ్

అందంగా తయారవడమంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. స్వయంగా తయారు చేసుకున్న బౌ కాలర్‌కి ధరించేవాణ్ణి. అలా తయారైనప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది. అబ్బాయిలు ఎక్కడకు వెళ్లినా బ్లేజర్లు వేసుకుని వెళుతుంటారు. అయితే, వెళ్లే ప్రదేశాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం. చిన్నప్పటి నుంచి అదే నాకు అలవాటు. బిజినెస్ మీటింగ్స్‌కు వెళ్లేటప్పుడు బ్లేజర్లు వేసుకుంటే ఓకే. పిక్నిక్‌కు వెళ్లినా అదే డ్రెస్ అంటే ఎలా? వస్త్రధారణ మహిళలకే కాదు, పురుషులకూ ముఖ్యమే. వేసుకున్న దుస్తులే వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తాయి.

 

సిటీ ఆఫ్ రిలాక్స్‌డ్


షూటింగ్స్ కోసం చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను. ముంబైలో అంతా ఉరుకులు పరుగులు.. ఇక్కడ పనిచేస్తుంటే చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. లొకేషన్స్ చాలా నేచురల్‌గా, లైవ్లీగా ఉంటాయి. అతి త్వరలోనే విదేశీయులు సైతం హైదరాబాద్‌లో సినిమాల షూటింగ్‌కు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కలసి మెలసి పనిచేసుకోవడం నాకు చాలా నచ్చే అంశం. ‘హ్యాపీ న్యూ ఇయర్’ మూవీలోని దృశ్యాన్ని తలపించేలా ఇక్కడి ఫ్యాషన్ షోలో ర్యాంప్‌వాక్‌లో పాల్గొనబోతున్నాను.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top