యువతుల్లారా జాగ్రత్త!

పాండురంగ - కరుణ


పాండురంగారావుపై ఏ కేసు నమోదు చేస్తారు?

మూడేళ్ల పాటు తనను ప్రేమ పేరుతో వంచించి చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ యువతిని అన్ని విధాలా మోసం చేసిన ఆ యువకుడిపై ఏ కేసు నమోదు చేశారు? ఏ కేసు నమోదు చేస్తారు? ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన పైదా కరుణ(23) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో చర్ల మండలం వెంకటాపురం ఉప్పిడి వీరాపురంనకు చెందిన చల్లూరి పాండురంగారావు(23) కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.  పాండురంగ పెళ్లి చేసుకొంటానని కరుణను నమ్మించి లోబర్చుకున్నాడు. ఖమ్మంలో ఓ సంవత్సరం పాటు ఇద్దరూ కలిసి ఒకే గదిలో సహజీవనం చేశారు.  



 పాండురంగారావు గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల తన మామయ్య కూతురిని వివాహం చేసుకున్నాడు.   ఆదివారం ప్రాజెక్ట్ వర్క్‌పై ఖమ్మం వచ్చిన పాండురంగారావుని కరుణ  నిలదీయగా తాను వివాహం చేసుకున్నది నిజమేనని చెప్పాడు. సింపుల్గా తనను మర్చిపోమ్మన్నాడు. తన పరిస్థితి ఏమిటని అడిగిన కరుణకు,  తనకేమీ సంబంధం లేదని చెప్పాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కరుణ అతనిని నమ్మింది. మోసపోయానని తెలుసుకొని, అతని మాటలకు కడుపు మండి కోపంతో  బ్లేడుతో అతడి గొంతుపై గాయం చేసింది. స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది.



అతని మోసం వల్ల కరుణ  జీవితాన్ని నష్టపోయింది. ఇప్పడు పోలీసులు  ఆ విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమెదు చేశారు. అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పోయిన తరువాత ఆ పాండురంగ కొత్తపెళ్లాంతో హాయిగా జీవితం గడుపుతాడు. కరుణ పరిస్థితి ఏమిటి? పాండురంగపై ఏ కేసు నమోదు చేస్తారు? ఇటు వంటి విషయాలలో అన్నివిధాల యువతులే నష్టపోతున్నారు. ఈ విధంగా మోసపోయిన ఎంతో మంది యువతులు విషయం బయటకు తెలిస్తే, తమ జీవితాలకే ముప్పు అని గుట్టుగా బతుకుతున్నారు. ధైర్యం చేసి మోసగాడిని నిలదీసి, ఎదురుతిరిగిన యువతల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.  అందువల్ల యువతుల్లారా జాగ్రత్త!

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top