ఆటిజాన్ని తరిమి.. పాటల రారాణి!

ఆటిజాన్ని తరిమి.. పాటల రారాణి!


సంగీతమే ఆమె భాష. ఆమె ఆత్మ, ఆమె జీవితం. ఆదే ఆమె శక్తి. అదే ఆమె ప్రపంచం. సంగీతం లేకుండా నేడు ఆమె లేదు. మూగ, చెవుడు లాంటి (ఆటిజం) అవలక్షణాలతో పుట్టిన ఆమె 'మ్యూజిక్ థెరపీ' ద్వారా క్రమంగా ఆటిజంను జయించి నేడు ప్రముఖ గాయకురాలిగా ఎదిగింది. ఆమె 22 ఏళ్ల బెంజీ కుమార్. మూడు జాతీయ అవార్డులను అందుకోవడంతో పాటు 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సాధించింది. ప్రపంచ ఆల్బంలలో చోటు సంపాదించుకుంది. బాలీవుడ్ రీమిక్సులు పాడటంలో ఆమెకు ఆమే సాటి. నేటి వరకు 8 ఆడియో సీడీలను విడుదల చేయడం ద్వారా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.



ఆమె ఈ స్థాయికి ఎదగడానికి ఆమె తల్లి కవితా కుమార్ కారణం. రెండేళ్ల వయసులోనే బెంజీ కుమార్‌కు ఆటిజం ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. ఎన్నో ఆస్పత్రులు తిప్పారు. ఎన్నో మందులు వాడారు. జబ్బు తగ్గలేదు. చెవులు వినిపించేవి కావు. నోటి నుంచి మాట వచ్చేది కాదు. బతకడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పారు. ఆమె మూడో ఏట మ్యూజిక్ టాయ్‌కి ఆ పాప కొద్దిగా స్పందించడం తల్లి కవిత గుర్తించింది. ఆ రోజు నుంచి పాప కోసం తానే సంగీతం టీచరయింది. పాటలు పాడి వినిపించేది. అస్తమానం రేడియో వినిపించేది. ముఖ హావభావాల్లో తప్ప నాలుగైదేళ్ల వరకు ఆమెలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. సంగీతం మాస్టర్‌ను పెడితే బాగుంటుందని అనుకుని ఎంతోమంది పండితులను ఆశ్రయించింది. ఆ తర్వాత ఎంఎం రఫీ మ్యూజిక్ టీచర్‌గా వారింటికి వచ్చేందుకు ఒప్పుకున్నారు. రోజూ వచ్చి పాప ముందు గానకచేరీ చేసేవారు. పాపలో వేగంగా మార్పులు వచ్చాయి. మాస్టారితో కొద్దికొద్దిగా గొంతు కలపడం ప్రారంభించింది.



ఏ సినిమాకెళ్లినా 15 నిమిషాలపాటు కుదురుగా ఉండని బెంజీ కుమార్ ఒకరోజు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'కహోనా ప్యార్ హై' సినిమాకెళ్లి కళ్లార్పకుండా సినిమా అంతా చూసింది. తర్వాత అనేక మంది సంగీతం టీచర్ల మధ్య బెంజీ తాను స్వతహాగా పాడడం నేర్చుకుంది. హృతిక్ రోషన్‌ను చిన్నప్పటి నుంచే గుర్తుపెట్టుకున్న ఆమె తొలి ఆడియో సీడీని హృతిక్ రోషన్‌తోనే ఆవిష్కరింపచేసింది. ఆమె మొదటి సీడీ 'కోషిష్' కాగా, తాజా ఆడియో సీడీ 'రాగ' మూడు జాతీయ అవార్డులతోపాటు ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'బెస్ట్ క్రియేటివ్ అడల్ట్ ఆఫ్ ఇండియా' అవార్డును అందుకున్నారు. 'సాంగ్స్ ఆఫ్ డిసేబుల్డ్, అండర్‌గ్రౌండ్ వాల్యుమ్-3' అనే అంతర్జాతీయ ఆల్బమ్‌లో చోటు సాధించారు.



ఇలా ఆటిజం సమస్యను జయంచడం చాలా అరుదని, వైద్యులు చేయలేని పనిని ఓ తల్లిగా కవిత చేసే చూపించారని వైద్యులు ఆమెను ప్రశంసించారు. తన కూతురికి చేసిన మంచిని తన కూతురు లాంటి వాళ్లకు ఎందుకు చేయకూడదన్న ఆలోచన కవితా కుమార్‌కు వచ్చింది. అదే స్ఫూర్తితో ఆమె 'ధున్ ఫౌండేషన్'ను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సంగీతం, నృత్యం ఉచితంగా నేర్పిస్తున్నారు. బెంజీ పాటల గురించి తెలుసుకోవాలంటే 'డబ్లూడబ్లూడబ్లూ బెంజీమ్యూజిక్ డాట్ కామ్'ను చూడవచ్చు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top