బతుకు భాగ్యం

బతుకు భాగ్యం


తంగేడు పూల పరిమళం.. గునుగు పూల ఠీవి.. కట్ల పూల సొగసు.. గుమ్మడి పూల వయ్యారం.. ఒకే చోట కనిపించే పూబాల బతుకమ్మ. ప్రతి గడపను పలకరించే ప్రకృతి కాంత బతుకమ్మ. పల్లెవాకిట జానపదుల జేజేలు అందుకున్న ఈ తీరొక్క పూల కొమ్మ.. ఆ పల్లె సందడిని పట్నవాసానికి తీసుకొచ్చింది. చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మ.. ఈ వాడలోన అంటూ.. పల్లెపదాలను మోసుకొచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా మొదలయ్యాయి. కార్పొరేట్ కల్చర్‌లో బతుకుతున్న సిటీ స్త్రీలు.. పల్లెపడుచుల్లా కొంగు సవరించి మరీ బతుకమ్మ ఆటల్లో సందడి చేస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అని పాటలు అందుకున్నారు.

 

 నవ వేడుక

 బతుకమ్మ సందడి ఉండే తొమ్మిది రోజులకు తొమ్మిది చీరలు కొన్నాను. మా కుటుంబసభ్యులంతా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరూ ఒక చోట చేరడం.. పాటలు పాడటం.. బతుకమ్మ ఆడటం.. ఎంతో సంతోషంగా ఉంటుంది. రోజుకో రకం ప్రసాదం తయారు చేసి ఒకరికొకరం ఇచ్చుకుంటాం. సమష్టితత్వం బలపడేందుకు బతుకమ్మ చక్కటి వేదిక.     

     - సింధు, గృహిణి

 

 స్త్రీల రక్షణ పండుగ

 బతుకమ్మకు భూమికి, నీళ్లకు, ప్రకృతికి ఉన్న అనుబంధం విడదీయరానిది. అందుకే బతుకమ్మను సహజవనరుల సంరక్షణ ఉద్యమంగా ఆడుదాం. బతుకమ్మ ఆడవారి పండుగ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా స్త్రీల సంరక్షణ పండుగగా ఈసారి బతుకమ్మ జరుపుకుందాం. ప్రతి ఊళ్లో ఓ గుట్టకు బతుకమ్మ గుట్టగా, వాగుకు బతుకమ్మ వాగుగా, కుంటకు బతుకమ్మ కుంటగా పేరు పెట్టి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం.

 - విమలక్క, అరుణోదయ అధ్యక్షురాలు

 

 పుష్పవిలాసం

 కొమ్మకొమ్మకు పూసిన సన్నాయిలు అక్కడ కోకొల్లలు. బంతి పూల సొంపులు.. చేమంతుల గుంపులు.. గులాబీల గుట్టలు.. సంబరాల కనకాంబరాలు..! తనువెల్లా కాంక్రీట్ పరచుకున్న పట్నంలో బారులు తీరిన పూబాలల కేరింతలు అక్కడ కనిపిస్తాయి. అదే గుడి మల్కాపూర్ మార్కెట్. గౌరమ్మ ఒడి చేరి బతుకమ్మగా తీర్చిదిద్దడానికి తరలివచ్చిన బంతిపూలు మొదలు పల్లెవిరులైన గునుగు.. అడవిసిరులైన తంగేడు పూలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ పండుగ పేరుతో అయినా కొందరి బతుకులను తేలిక చేస్తుంది ఈ మార్కెట్.

  బెంగళూరు నుంచి బడాయిగా వచ్చిన లిల్లీ, గులాబీలు.. నాగ్‌పూర్ నుంచి వచ్చి నయగారాలొలికే బంతి, చేమంతులు.. బతుకమ్మ సిగలో దూరినా.. ఈ గడ్డ ముద్దుబిడ్డలైన గునుగు, తంగేడులు హత్తుకుంటేనే ఆ తల్లికి ఆనందం. అందుకే గునుగు, తంగేడు పూలమ్మే అమ్మలకు తొమ్మిది రోజులూ మంచి గిరాకీ. నగరశివార్ల నుంచి వచ్చి ఏడాదంతా కొత్తిమీర, ఆకుకూరలు అమ్మి పొట్టపోసుకునే వీళ్లకు ఈ తొమ్మిది రోజులే అసలైన పండుగ. రెక్కలు తెరిచి రెపరెపలాడుతున్న ధరలను తళతళమెరిసే నోట్లతో కట్టేసి.. పూలతో బుట్టలు నింపుకుని బతుకమ్మను అలంకరించే సంబురంలో పడిపోయారు హైదరాబాద్ ఆడవాళ్లు.

 

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ వేడుకలకు హైదరాబాదీలు ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు సాగే ఈ సామూహిక సందడి లో రోజుకో రీతిగా కనిపించడానికి తరుణులు తహతహలాడుతున్నారు. వన్నెచిన్నెలన్నీ ఉన్న చీరలు.. వాటికి సరిపోయే ఆభరణాలతో సిద్ధమవుతున్నారు. యువతుల విషయానికి వస్తే లంగావోణీలే ముద్దంటున్నారు. కాలనీల్లోని మహిళలంతా ఓ చోట చేరి రంగవల్లులు తీర్చి.. అందులో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అదరగొడుతున్నారు. చేయి చేయి కలుపుతూ నృత్యాలు చేస్తున్నారు. బామ్మలు, వయసు పైబడిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటే మిగతావారు వాటిని అనుస్వరిస్తూ పండుగ చేసుకుంటున్నారు.

 

 జంట బతుకమ్మ

 బతుకమ్మను జంటగా పేర్చడం ఆచారం. ఒకటి పెద్దగా, రెండోది చిన్నగా ఉంటాయి. పెద్ద పళ్లెంలో పేర్చిన బతుకమ్మను తల్లి బతుకమ్మ అని, చిన్న పళ్లెంలో పేర్చిన బతుకమ్మను పిల్ల బతుకమ్మ అని అంటారు. తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మను పేరుస్తాం. తల్లీపిల్లలు ఎప్పటికీ విడిపోకుండా కలసి ఉండాలనే ఇలా చేస్తాం. ఈ రెండు బతుకమ్మలపై గౌరమ్మను ఉంచుతాం. ఈ తరం పిల్లలూ బతుకమ్మ పండుగపై ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్దవాళ్ల దగ్గర బతుకమ్మ పాటలు కూడా నేర్చుకుంటున్నారు.

 - టి.సుశీల, కూకట్‌పల్లి

 

 పోటాపోటీ సిటీ యువతులకు

 ఆచారాలు, సంప్రదాయాలు తెలియవనుకుంటారు. ఏటా జరిగే బతుకమ్మ ఉత్సవం కోసం ఎదురు చూస్తుంటాం. పెద్ద బతుకమ్మలు తయారు చేసేందుకు మా స్నేహితులమంతా పోటీపడుతున్నాం. ఇప్పటికే బతుకమ్మ పాటలు నేర్చుకున్నాం. కాస్త తడబడ్డా పెద్దవారి పాటను అందుకుంటున్నాం.

 - సాహితి, లయోలా కళాశాల విద్యార్థిని

 

 రంగురంగుల కొమ్మ.. బతుకమ్మను పేర్చేందుకు పూల కోసం సిటీవాసులు చక్కర్లు కొడుతున్నారు. ఇరుగుపొరుగిళ్లకు వెళ్లి పూలు సేకరిస్తున్నారు. తంగేడు, గునుగు పూలు దొరకడం కష్టంగా ఉన్నా బంతి, చేమంతులతో బతుకమ్మను తీర్చిదిద్దుతున్నారు. గులాబీలు, మందారాలతో బతుకమ్మకు అదనపు సొబగులు అద్దుతున్నారు.

 - వాంకె శ్రీనివాస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top