మనది ఔదార్యాబాద్!

మనది ఔదార్యాబాద్!


ఔదార్యం అంటే హైదరాబాద్ వారి నుంచే నేర్చుకోవాలి. నిజానికి మన పీపుల్ సిటీ పేరును ఔదార్యాబాద్ అంటూ ఉచ్ఛరించడం కొంచెం కష్టమైపోయి హైదరాబాద్ అని పలుకుతున్నారేమో అని నా అనుమానం. మనం నలుగురం కలసి ఇరానీ హోటల్‌కు చాయ్ తాగడానికి వెళ్తాం. ‘దో చాయ్... ఔర్ దో కప్ ఎంప్టీ’ అని జబర్దస్తీతో అడుగుతాం. ఇంకేదైనా ఊళ్లో ఇలా ఎంప్టీ కప్పులు అడిగితే షాపువాడు ఏమనుకుంటాడో అని భయపడాలి. కానీ హైదరాబాద్‌లో మాత్రం చాయ్‌తో పాటూ ఖాళీ కప్పులూ ఉదారంగా ఇచ్చేస్తాడు. అలాగే నలుగురి కోసం ఏ పన్నెండో పదహారో ‘ఉస్మానియా బిస్కెట్లు’ ఆర్డర్ చేస్తాం. ఆ తర్వాత ఏ ఆరో, ఎనిమిదో తింటాం. మిగతా వాటిని గౌరవంగా తీసుకెళ్తాడు వెయిటర్. మనం తిన్నదానికే చార్జ్ చేస్తాడు తప్ప... తినని వాడివి వాటిని ఎందుకు ఆర్డర్ చేశావంటూ దబాయించడు. మళ్లీ ఇది మరో రకం ఔదార్యం.

 

మన దార్లో మనం వాహనం మీద వెళ్తుంటాం. అవతలివాడు రాంగ్ సైడ్‌లో మనకు అడ్డంగా వస్తుంటాడు. అయినా మనం గౌరవంగా అడ్డం తొలగి వాడికి దారిస్తాం. పాపం... వాడెంత అవసరం కొద్దీ ఇలా రాంగ్ సైడ్‌లో వెళ్తున్నాడో... రేపు మనం మాత్రం అలా వెళ్లమా ఏంటి అని ఔదార్యం ప్రకటిస్తాం. పైగా విశాలంగా చిర్నవ్వు నవ్వి... ‘రూల్స్ ఉందే బ్రేక్ చేయడానికి కద్సార్. విదేశాల వాళ్లు రికార్డులు బ్రేక్ చేస్తారు. మనం రూల్స్ బ్రేక్ చేస్తాం’ అంటూ అవతలివాడిలోని అపరాథ భావన ఏదైనా ఉంటే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తూ... వాడి ‘రాంగ్’ సైడు వాదననూ మనమే ఓ స్థితప్రజ్ఞుడిలా ప్రవచిస్తాం. ట్రాఫిక్‌లో అదీ మన ఔదార్యం.

 

ఇక మనం తిరిగే రూట్లలో ఎవరెవరో వాళ్ల వాళ్ల ఇళ్ల ముందు ఏదో ఫంక్షన్ చేసేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఆ రోడ్డు రోడ్డునంతా బ్లాక్ చేసేస్తారు. ఫంక్షన్ చేసే వాడి ఇల్లు ఆ ఇళ్ల వరసలో ఎక్కడో మధ్యన ఉంటుంది. కానీ అతడుండే వీధికి... కనెక్టింగ్ రోడ్డు చివరన ఒక షామియానాను అడ్డు గోడగా నిర్మాణం చేసేసి, అవతలి రోడ్డు చివరకూ అదే భాగ్యం కల్పిస్తూ మరో షామియానాను దడిలాగా కట్టేస్తాడు. అలా ఆ రోడ్డు రోడ్డునంతా ఓ అనధికారిక ఫంక్షన్ హాల్ చేసేసి, ఇరానీ హోటల్‌లోని ఎంప్టీ కప్పులా వాడుకుంటుంటాడు. మనం కూడా సదరు ఫంక్షన్ నిర్వాహకుడికి పరోక్ష మద్దతు పలుకుతాం. అతడు నిర్వహించే ఆ వేడుకకు మనవంతు సహకారం ఇస్తూ మనం ఆనందంగా ‘పక్కదార్లు’ పడుతూ ఉంటాం. అంతేగానీ... రోడ్డును ఇలా బ్లాక్ చేసి ఎందరో ప్రయాణికులకు అసౌకర్యం ఎలా కలిగిస్తావంటూ అడగని సౌజన్యం మనది.

 

ఇక గల్లీ క్రికెట్ అన్నది మన నగర సంస్కృతి. ఇవాళ ప్రముఖులైన ఎందరెందరో ఈ గల్లీ క్రికెట్ ఆడినవాళ్లే. ‘అంతా మన పిల్లలేలెద్దూ. అసలే నగరంలో ఖాళీ స్థలాలకు తీవ్రమైన కొరత ఉంటే పిల్లలెక్కడ ఆడుకుంటారు’ అనుకుంటూ సదరు బౌలర్‌గారి ఒరవడినీ, ఇటు బ్యాట్స్‌మన్ గారి ధాటినీ నేర్పుగా తప్పుకుంటూ, రోడ్డుపై గల పిల్లల మినీ ప్లేగ్రౌండును ప్రాణాలకు తెగించి దాటేస్తుంటాం. ఇదీ మరో రకం ఔదార్యమే. అందుకే ఇలాంటి సౌజన్యాలూ, ఔదార్యాల నగరంలో నివసిస్తున్నందుకు గర్వపడుతూ మన ఓపికనూ, ఔదార్యాలనూ మరింతగా అభివృద్ధి చేసుకుంటూ మన మహానగరం పేరు హైదరాబాద్.. సారీ ఔదర్యాబాద్ పేరును సార్థకం చేసుకుందాం.

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top