అప్పట్లో ఇది ‘బాగ్’నగర్

అప్పట్లో ఇది ‘బాగ్’నగర్ - Sakshi


జ్ఞాపకం

ఎం.వేదకుమార్,సామాజిక కార్యకర్త

హైదరాబాద్‌కు మా ఊరు... మెదక్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 60 కిలోమీటర్ల దూరం. బాపు (నాన్న)తో తరచూ నగరానికి వచ్చిపోతూ ఉండేవాళ్లం. మొట్టమొదటిసారి (1963-64) నేను చూసింది నాంపల్లి సరాయి (గెస్ట్ హౌస్). రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. కాదంటే బాగ్‌లింగంపల్లి ‘టికానా’లో (తాత్కాలిక మకాం)బస చేసేవాళ్లం. గౌలిగూడ, పీల్‌ఖానా, జామ్‌బాగ్, పుత్లీబౌలీ, సుల్తాన్‌బజార్, ఉస్మాన్‌గంజ్ బాగా పరిచయం. ఇక సికింద్రాబాద్‌లో జనరల్ బజార్, కింగ్స్ వే, ప్యారడైజ్ ప్రాంతాలు తిరిగేవాళ్లం. ఇప్పటి అబిడ్స్ ప్రాంతంలో అప్పట్లో ‘అబిద్ అలీ సాహెబ్’ షాప్ ఉండేది.

 

రిక్షాల రిథమ్...

అప్పట్లో రిక్షాలకు గజ్జెలు కట్టేవారు. అవి రోడ్లపై వెళుతుంటే ఆ శబ్దం ఎంతో లయబద్ధంగా ఉండేది. ఎక్కడ చూసినా టాంగాలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవి. వాటిని ముచ్చటగా చూసేవాళ్లం. నగరానికి వచ్చినప్పుడు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నది విద్యుత్ వెలుగులు. మాకు కొత్త.

 

గుడ్డి బస్సు భలే...

ఆర్టీసీ బస్సులకు ఒకవైపే ఇంజిన్. దానిపైన క్యాబిన్. చూడ్డానికి ఒంటి కన్నులా అనిపించేవి. ‘గుడ్డి బస్సుల’ని పిలిచేవాళ్లం. ఇక డబుల్ డక్కర్ బస్సులు వురో వింత. బస్సుపై మరో అంతస్తు. అందులో ఎక్కి వెళుతుంటే... ఓ కొత్త ప్రపంచంలా

 ఫీలింగ్.



సైకిల్ సిటీ...

నగరమంతా రోడ్ల వెంబడి పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనం పరచుకున్నట్లుండేది. ఆహ్లాదాన్ని పంచే పార్కులు, హుస్సేన్‌సాగర్ అందాలు.. చూస్తుంటేనే మనసు ఉప్పొంగి పోయేది. ఇక పేదవారే కాదు, ధనవంతులు కూడా సైకిల్‌పైనే సవారీ. రిక్షా ఎక్కితే మరొకరిని శ్రమ పెట్టడమనే భావన. అందుకే కార్మికులే కాదు.. లాయర్లు, ఉద్యోగస్తులకూ ప్రియ నేస్తం సైకిల్. అప్పట్లో సైకిళ్లకు లెసైన్స్‌లు తప్పనిసరి. ‘బాగ్’ లింగంపల్లి వేలాది చెట్లతో పచ్చగా ఉండేది. అన్ని రకాల పక్షులకు నిలయమది.  ‘లేక్ సిటీ’గా, ‘బైసైకిల్‌ఫ్రెండ్లీ సిటీ’గా, ‘బాగ్’నగరంగా సహజసిద్ధమైన అందాలతో విరాజిల్లేది నగరం. ఉస్మానియా హాస్పిటల్ ముందు మూసీకి ఆనుకుని ఉండే ‘అఫ్జల్ పార్కు’లో కాలక్షేపం చేసేవాళ్లం. ఇరానీ కేఫుల్లో చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కట్లు, బన్‌మస్కా, సమోసా ఇష్టంగా లాగించేవాళ్లం.



కాస్మోపాలిటిన్...

మొజాంజాహీ మార్కెట్ అప్పట్లో సూపర్ బజార్ లెక్క. మీర్ ఆలం మండీ, మోండా మార్కెట్లు బాగా ఫేమస్. అంతా ఒక ప్లాన్డ్‌గా వీటిని ఏర్పాటు చేశారు. వరల్డ్ బెస్ట్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మనది. ప్రతి వీధికీ కమ్యూనిటీ ట్యాప్ తప్పనిసరి. నగరం చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల ఎండాకాలం కూడా కూల్‌గా ఉండేది. అన్ని వసతులతో కళకళలాడుతూ భారత్‌లోనే తొలి కాస్మోపాలిటిన్ సిటీగా విలసిల్లింది. ఆమ్‌ఆద్మీ క్యాంటిన్స్, వాటిల్లో న్యూస్ పేపర్లు, ఇంటలెక్చువల్స్ డిస్కషన్స్ నడిచేవి. ప్రతి ‘మొహల్లా’ (కాలనీ), గల్లీ, ‘కోచే’ (సందులు) ప్రణాళికాబద్ధంగా ఉండేవి. దుమ్ము, ధూళి కనిపించేవి కావు. అప్పట్లో హైదరాబాద్ పోతున్నామంటే... ‘నువ్వు తెల్లగా అవుతావురా’ అనేవారు ఊళ్లో. అది గండిపేట నీళ్ల మహత్యం.



భిన్నత్వంలో ఏకత్వం...

తెలుగువారితో పాటు గుజరాతీలు, కాయుస్థులు, తమిళులు, రాజస్థానీలు.. అంతా ఎంతో సామరస్యంగా మెలిగేవారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినవారు ఇక్కడివారి కంటే స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడేవారు. మినీ భారత్‌ను తలపించే సంస్కృతి హైదరాబాద్‌లోనే కనిపించేది. ప్రభుత్వంతో పాటు ప్రతి కమ్యూనిటీ సొసైటీకి చెందిన విద్యా సంస్థల ద్వారా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండేది. వివేకవర్ధని, ధర్మవత్ కాలేజీ, కేశవ్ మెమోరియల్, మాడపాటి, న్యూ సైన్స్ కాలేజీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కవులు, కళాకారులకు మహా వేదిక నగరం. అన్నయ్య బి.నర్సింగరావు (ప్రముఖ దర్శకుడు), ఆయన మిత్ర బృందంతో కలిసి కల్చరల్, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. ఇలాంటివెన్నో మధురానుభూతులు నా మదిలో ఎప్పటికీ పదిలమే.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top