శాసనం కోసం నిర్మితమైన..

శాసనం కోసం నిర్మితమైన..


హైదరాబాద్ నగర నడిబొడ్డున గల అసెంబ్లీ భవనాలను చూడని వారుండరు. ఈ భవన సముదాయాలు నిజాం హయాంలో టౌన్ హాలుగా ఉండేవి. ఎంతో విశిష్టత ఉన్న ఈ భవనం నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది. రాజస్థానీ-పర్షియన్ ఆర్కిటెక్చర్‌తో రాచఠీవిని కళ్ల ముందుంచుతుంది. ప్రజాసమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించే సమావేశ మందిరంగా ఆనాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించారు.

 

ఆరో నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో దీన్ని నిర్మించారు. నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా 1905లో టౌన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1911లో ఆరో నిజాం కాలం చేశారు. తర్వాత రెండేళ్లకు అంటే 1913లో దీని నిర్మాణం పూర్తయింది. అనంతరం ఈ భవనాన్ని ప్రజానీకానికి అంకితమిచ్చారు. ఈ భవన నిర్మాణంలో స్థానిక ప్రజలు కూడా తమవంతు విరాళాలు అందజేశారు.

 

అసెంబ్లీగా..భారత స్వాతంత్య్రానంతరం, ఈ భవనాలలో శాసనసభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా అసెంబ్లీ భవనాలలో అనేక మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపట్టినా, ప్రధాన భవనం చారిత్రక విశిష్టత వన్నె తగ్గలేదు. శాసనసభ జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ప్రవేశం పరిమితంగా ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకుని శాసనసభా వ్యవహారాలు చూడొచ్చు. శాసనసభ నిర్వహణ లేని రోజుల్లో స్థానిక అధికారుల అనుమతితో శాసనసభా ప్రాంగణంలో కలియ తిరగవచ్చు.

 

సిల్వర్ జూబ్లీ భవన్..

పబ్లిక్ గార్డెన్స్ కేంద్ర బిందువుగా జూబ్లీహాలు ఉంది. 1936 నాటికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిర్మించిన భవనం కాబట్టి, క్లుప్తంగా జూబ్లీహాల్- జూబ్లీ భవన్‌గా ఈ నిర్మాణం ప్రసిద్ధి చెందింది.



నాటి అధికార దర్పానికి ప్రతీకగా జూబ్లీ హాలు కనిపిస్తుంది. జూబ్లీ హాలు ప్రాంగణంలోనే నేడు రాష్ట్ర శాసన మండలిని నిర్వహిస్తున్నారు. ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన జూబ్లీహాలు. చారిత్రక నిర్మాణ విశిష్టత దృష్ట్యా జంట నగరాలలోని ప్రధాన భవనాలలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు.

 

మల్లాది కృష్ణానంద్

malladisukku@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top