నెహ్రూ కుటుంబం హవా

నెహ్రూ కుటుంబం హవా


కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబం హవా కొనసాగడం అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీ ప్రధాన భాగస్వామిగా అధికారంలో ఉన్నందున కేంద్రంలో కూడా నెహ్రూ కుటుంబం హవా కొనసాగాలనేది కాంగ్రెస్ అధిష్టానవర్గం ఉద్దేశం. అందువల్ల కేంద్రంలో ఆ కుటుంబం మాట చెల్లుబాటు కావాలంటే మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండాయే ఎగరాలి. ఎక్కువ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువు తీరాలి. అయితే ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించే ముఖ్యమంత్రులు మాత్రం సొంతంగా ఆలోచించకూడదు. పరిపాలనా సమర్ధులైతే పనికిరారు. పార్టీకన్నా పెద్దయిపోకూడదు. మంచి పేరు గట్రా సంపాదించేసుకుంటే కుదరదు. ప్రజల్లో మార్కులు కొట్టేద్దామని కలలో కూడా అనుకోకూడదు. దేశ రాజధానిలోని టెన్ జన్పథ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా రాముడు మంచి బాలుడు అన్నరీతిలో ముఖ్యమంత్రులు తమ ఉద్యోగాలు చేసుకుపోవాలి. అధిష్టానం వద్దంటే జనంతో మమేకమవ్వకుండా వెనక్కి వెళ్లిపోవాలి. ఇవీ కాంగ్రెస్ పెద్దల మనసులోని చిరు కోరికలు. ఆచరణలో కూడా ఆ కుటుంబ సభ్యుల వద్దే అధికారం కేంద్రీకృతమై ఉంటోంది.



కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను తీసుకుంటే కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన స్పష్టంగా అర్ధమవుతుంది.ఇపుడు వరదలతో దేశాన్నే పట్టికుదిపేసిన ఉత్తరాఖండ్లో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. మరి అక్కడి ముఖ్యమంత్రి బహుగుణ జనాకర్షణ ఉన్న నాయకుడేమీ కాదు. కాకపోతే అధిష్టానంకు వీర విధేయుడు. సొంతంగా పేరు ప్రఖ్యాతులు పెంచేసుకునే సమర్ధతకానీ, ఆ ఆకాంక్ష కానీ ఆయనకు లేనే లేవు . అందుకే అక్కడి జనాకర్షక నేత, సమర్ధ నాయకుడు అయిన హరీష్ రావత్ రేసులో ఉన్నా కాదని అధిష్టానం ఏరి కోరి బహుగుణకు సిఎం పీఠం అప్పగించింది.



ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్లో ఇరుక్కుని ఉద్యోగం పోగొట్టుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీ రాజ్ చౌహాన్ విషయంలోనూ కాంగ్రెస్ ఇలాగే చేసింది. విలాస్ రావ్ దేశ్ ముఖ్ వంటి గ్లామరస్ ముఖ్యమంత్రిని ముంబై బాంబు పేలుళ్ల అనంతరం తప్పించాల్సి వచ్చినపుడు వెంటనే చౌహాన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. కారణం సింపుల్. చౌహాన్ కాంగ్రెస్ నాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడైన నేత. జనంలో గొప్పగా పేరు ప్రఖ్యాతులు లేవు. అటువంటి డమ్మీ నేతలు ఉంటే పార్టీని మించి వ్యక్తులు ఎదిగిపోరన్నది అధిష్టానం భావన.



మన రాష్ట్రంలో 2004లో వై.ఎస్.రాజశేఖర రెడ్డిని కాకుండా మరొకరిని ముఖ్యమంత్రిని చేయగలిగే పరిస్థితులు లేవు. రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన వైఎస్ 2004లో అంతా తానే అయి మహాపాదయాత్రతో పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. ఓ మహాప్రభంజనం సృష్టించారు. వైఎస్కు ఉన్న జనాకర్షణ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అప్పుడు తిరుగులేని విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో అయితే రాష్ట్ర కాంగ్రెస్లో మెజారిటీ సీనియర్లంతా కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వస్తుందని అనుకోలేదు. ఎలాగూ ఓడిపోయే పార్టీకి ప్రచారం ఎందుకు చేయాలని సీనియర్లంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఒక్క వైఎస్ మాత్రమే కాంగ్రెస్ వరుసగా రెండో సారి విజయ కేతనం ఎగరవేస్తుందని నమ్మారు. ఆ నమ్మకంతోనే ప్రచార బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు. ఎన్నికల్లో పార్టీ జయాపజయాలకు తానే బాధ్యత వహిస్తానన్నారు. మరో పక్క మహాకూటమి ఊపు మీద ఉన్నట్లు కనిపించడంతో అంతా కాంగ్రెస్ ఓడిపోతుందనుకున్నారు. కానీ వైఎస్ వ్యూహ రచన ఫలించింది. అంతకు ముందు అయిదేళ్లుగా ఆయన అమలు చేసిన పథకాల వల్ల వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్కే జనం పట్టం కట్టారు. దాంతో ఆయన రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు కాంగ్రెస్ నాయకత్వం పట్ల విధేయత ఎంత ఉందో ప్రజా సమస్యల పరిష్కారంపై అంతకు మించిన చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆయనను జనం నమ్మారు. ఆయనకు జనంగుండెల్లో ఎంతటి స్థానం ఉందో ఆయన మరణానంతరం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది గుండెలు పగిలి మరణించారు.



అంతటి జనాదరణ చూరగొన్న వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాల్సిందిగా మెజారిటీ ఎమ్మెల్యేలంతా జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఆయన్నే సిఎం చేయాలని సంతకాలు కూడా సేకరించారు. అయితే అధిష్టానం సూచనల మేరకు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం సూచించిన కొణిజేటి రోశయ్యనే ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు. అయితే అసలు విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డిని సిఎంని చేస్తే బలమైన నాయకుడిగా పాతుకుపోతారని అధిష్టానం కంగారు పడిందన్నది హస్తిన వర్గాల సమాచారం. అందుకే జనాదరణ లేని, పార్టీకి విధేయుడిగా ఉండే రోశయ్య వైపు పార్టీ మొగ్గు చూపింది. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానంకు నమ్మిన బంటే. అందుకే ఏ మాత్రం ప్రజాదరణలేని, మంత్రిగా పని చేసిన అనుభవం కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డిని ఏకంగా ఒకే సారి ముఖ్యమంత్రిని చేసేశారు. వారికి కావలసిందే అటువంటి నాయకులు. అధిష్టానం పట్ల విధేయతే ముఖ్యం అనుకునే ఇటువంటి నాయకులు సొంతంగా పేరు ప్రఖ్యాతులు పెంచేసుకుని ఎదిగిపోకుండా ఉంటారని అధిష్టానం ఆలోచన. ఆయన కూడా టెన్ జన్పథ్ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ పక్కా విధేయుడుగా ఉంటున్నారు.



ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామంత రాజ్యాల్లా వ్యవహరిస్తూ ఉంటే మొత్తం మహాసామ్రాజ్యాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని పరిపాలించుకోవచ్చునన్నది కాంగ్రెస్ భావన. సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమయ్యాక ఏక పార్టీ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో చిన్న పార్టీలతో జట్టు కట్టి ప్రభుత్వాల ఏర్పాటుకు ముందుకు పోవలసిన పరిస్తితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తికి తిలోదకాలిచ్చి అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్నట్లు ప్రభుత్వాలను నెట్టుకొస్తున్నాయి. అయితే ఇలాగే కొనసాగితే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి సమర్థవంతులైన నాయకులు జాతీయ స్థాయికి ఎదగాలంటే ఇటువంటి పద్దతులకు స్వస్తి చెప్పవలసిన అవసరం ఉంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top