ఒక హిజ్రా ఆత్మకథ

ఒక హిజ్రా ఆత్మకథ


"no matter gay, straight or bi.., lesbian,

transgenderd life.. I'm on the right track.

I was born to survive....
అంటూ తన జీవించే హక్కును చాటుకుంది రేవతి ‘నిజం చెప్తున్నా ఒక హిజ్రా ఆత్మకథ’ అనే పుస్తకాన్ని రచించి. ఇదివరకే తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్ల్లిష్ భాషల్లో విడుదలైంది. ఆలోచనలనూ రేకెత్తించింది. ఈ రోజు తెలుగులో విడుదల కానుంది. తెలుగు అనువాదం పి.సత్యవతి.. ప్రచురణ.. హైదరాబాద్ బుక్ ట్రస్ట్!  ఈ సందర్భంగా నగరానికి వచ్చిన రేవతి మనసులోని మాటలు...

 

 ‘ఇది ఒక్క రేవతి కథే కాదు ట్రాన్స్‌జెండర్స్ అందరి కథ. ఇదో పుస్తకం కాదు... మా హక్కుల పోరాటానికి కావల్సిన ఆయుధం. సమాజంలో మాకూ గుర్తింపు, గౌరవం కావాలి. ఇంట్లోంచే మొదలవుతుంది మా పోరాటం. మగ శరీరంలో స్త్రీ మెదడుతో పుట్టడం మా తప్పు కాదుకదా! నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలా ఉండాలనిపించేది. యుక్తవయసు వచ్చినప్పుడు అబ్బాయిలను చూస్తే సిగ్గేసింది. నా ప్రవర్తనతో ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడేవాళ్లు. నాలో జరుగుతున్న సంఘర్షణ వాళ్లకు అర్థంకాక.. నేను బయటకు చెప్పుకునే అవకాశంలేక ఎన్ని దెబ్బలు తిన్నానో.

 

 బయటవాళ్ల వెక్కిరింతలు, వేళాకోళాలు, గేలిచేయడాలు సరేసరి. అందుకే పదిహేను- పదహారేళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఢిల్లీ, ముంబైలు తిరిగి ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్త్రీగా మారిపోయాను. నా మెదడులో కలిగే భావాలకు అనువైన రూపంలో ఒదిగానన్న సంతృప్తి ఉన్నా.. హిజ్రాగా సమాజంలో మాకున్న స్థానం కలిగించిన వేదనా తక్కువేం కాదు. హిజ్రాలను ఈ వ్యవస్థ రెండేరెండు పనులకు పరిమితం చేస్తోంది.. అడుక్కోవడం.. సెక్స్‌వర్కర్‌గా పనిచేయడం. ఈ పనులు ఎవరూ ఇష్టంగా చేయరు గత్యంతరంలేకే చేస్తారు. మాకూ ఉంటుంది మంచి ఉద్యోగాలు చేయాలని. అందుకు సిద్ధంగా కూడా ఉన్నాం. కానీ చదువేది? మాకు స్కూళ్లల్లో, కాలేజీల్లోనూ అవమానాలే. పోనీ వాటన్నిటినీ ఎదుర్కొని ఉద్యోగం దాకా వచ్చినా అక్కడా వివక్షే. అయినా కన్న తల్లిదండ్రులే మమ్మల్ని ఒప్పుకునే పరిస్థితిలేనప్పుడు బయటవాళ్లు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకే ముందు ఇంట్లోంచే మార్పు మొదలవ్వాలి. వాళ్లే గనక మమ్మల్ని ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తే మేము ఇంట్లోంచి పారిపోవాల్సిన అవసరం ఎందుకుంటుంది?.

 

ఈ పుస్తకం రాయడానికి వెనక..


 నేను పడ్డ బాధలు..చేసిన పోరాటమే. హిజ్రాగా మారిన తర్వాత షాపులకు వెళ్లి అడుక్కున్నాను, సెక్స్‌వర్కర్‌గా పనిచేశాను. చివరకు బెంగళూరులోని ‘సంగమ’అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తగా పనిచేశాను. అక్కడున్నప్పుడే నాలాంటి వాళ్లను ఓ యాభైమందిని కలిసి ఇంటర్వ్యూచేశాను. ఒక్కొక్కరిది ఒక్కోగాధ. అప్పుడే అనిపించింది మా ఆత్మను వినిపించే ఓ కథ రాయాలని. అట్లా ఈ పుస్తకం రాశాను. ఇది 2009 నాటి సంగతి. ఇప్పుడనిపిస్తోంది నా ఆత్మకథ రెండో భాగాన్నీ రాయాలని.

 

 ఏం కావాలి?

 సమాజంలో అందరికుండే గుర్తింపు మాకూకావాలి. మమ్మల్ని కొన్ని చోట్ల ఆశీర్వాదాలిచ్చే వాళ్లలా చూస్తారు. మేమేం భగవంతులం కాము. అందరిలాంటి సామాన్యమైన మనుష్యులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. వాటిని గౌరవించండి చాలు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్‌కి దరఖాస్తు చేసుకునే పత్రాల్లో థర్డ్‌జెండర్ కాలమ్ ఉండాలని నాల్సాజడ్జిమెంట్ రావడం సంతోషమే. కానీ పర్సనల్‌గా థర్డ్‌జెండర్ అనేదే అక్కర్లేదంటాన్నేను. అప్లికేషన్స్‌లో కులం అనేకాలాన్ని ఎలా తొలగించాలనే డిమాండ్ ఉందో అలాగే ఈ జెండర్ అనే కాలం కూడా అనవసరం అంటాన్నేను.

 

  పేరు ఉంటే చాలుకదా.  ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కావాలి. ఎవరికిష్టమైన జెండర్‌లో వాళ్లుండే హక్కును కలిగించాలి. నిజానికి ఇది మన రాజ్యాంగంలో ఉంది కూడా. ఎస్‌ఆర్‌ఎస్ అంటారు దాన్ని.  హిజ్రాల మీద కనీసం ఈ మాత్రం చర్చ అయినా జరుగుతోంది కానీ ఫిమేల్ నుంచి మేల్‌గా మారిన ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి మరీ దారుణం. నిశ్శబ్దాన్ని ఛేదించాలి. చర్చ జరగాలి. సమాజంలో ఉన్న ఇలాంటి సెన్సిటివిటీస్‌ని అందరూ అర్థంచేసుకోవాలి.

 

 హైదరాబాద్‌లో..

 ఇక్కడ రెండు రకాల హిజ్రాలున్నారు. ఒకరు రోడ్లమీద అడుక్కుంటుంటే.. ఇంకొకరు హవేలీల్లో ఉండే బదాయి గ్రూప్‌వాళ్లు. ఈ రెండో రకం వాళ్లకు పెద్ద సమస్యలేవీ ఉండవు. చక్కటి మర్యాదా ఉంటుంది. సమస్యంతా రోడ్లమీద అడుక్కునేవాళ్లకే. సామాన్యుల నుంచి పోలీసుల దాకా అందరితో వేధింపులు, ఛీత్కారాలూ!

 - సరస్వతి రమ

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top