బడీ ఉమ్మీద్..

బడీ ఉమ్మీద్..


ఏడేళ్ల కిందటి ముచ్చట.. వయసు పైబడిన ఓ అవ్వ  పొట్టకూటి కోసం రోడ్డు పక్క పడి ఉన్న ఖాళీ మద్యం, వాటర్ బాటిల్స్, క్యాన్‌లు ఏరుకునేది. ఇంటి బాల్కనీలో నిలబడి ఈ దృశ్యాన్ని రోజూ చూస్తున్న మూడున్నరేళ్ల బుడతడి బుర్రలో ఓ ప్రశ్న మెదిలింది. ఆ ముసలమ్మ బాటిల్స్ ఎందుకు ఏరుకుంటుందని వాళ్లమ్మను అడిగాడు. ఇలా సేకరించిన బాటిల్స్ అమ్ముకుంటేనే వాళ్లకు అన్నం దొరుకుతుందని ఆ తల్లి చెప్పింది. ఆ సమాధానం ఆ పసివాడి హృదయాన్ని కదిలించింది. ఊహ తెలియని వయసులోనే దయాగుణాన్ని నింపింది. చుట్టుపక్కల ఇళ్లలో ఖాళీ బాటిల్స్ సేకరించి ఆమెకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ పనిలో తన అక్క తోడైంది. ఒక్క ముసలమ్మతో మొదలైన వారి సేవాగుణం.. తర్వాత మరింత విస్తరించింది. చాక్లెట్లు కొనుక్కోవడానికి ఇంట్లోవారిచ్చిన డబ్బులు కూడబెట్టి నిరుపేదలకు వెచ్చించారు ఈ ఇద్దరూ. కొన్నేళ్లకు మరో 20 మంది పిల్లలతో కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి సేవాపథంలో నడుస్తున్నారు.

 

మనోజ్ త్రివేది, కల్పన దంపతుల స్వస్థలం ఉత్తరప్రదేశ్. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఉద్యోగరీత్యా 19 ఏళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. వీరి పిల్లలే ఆర్యన్, మహిమ. ఇప్పుడు ఆర్యన్‌కు 11 ఏళ్లు, మహిమకు 16 ఏళ్లు. ఏడేళ్ల కిందట దుబాయ్‌లో ఓ ముసలమ్మకు సాయం అందించిన ఈ చిట్టి చేతులు.. ఇప్పుడు దుబాయ్‌తోపాటు, ఇండియాలో కూడా సేవ చేస్తున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరో 20 మంది పిల్లలను పోగు చేసి ‘ఉమ్మీద్’ అనే గ్రూప్‌గా ఏర్పడి  సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు.  ఈ గ్రూప్ చేస్తున్న  కార్యక్రమ వివరాలు తెలిపేందుకు ఫేస్‌బుక్‌లో ఉమీద్ పేరిట కమ్యూనిటీ పేజ్ తెరిచారు.

 

 లక్ష్యం దిశగా..

 సమాజంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే వీరి పోరాటం. తాగేందుకు నీరు లేని గ్రామాలు, రోజూ పట్టెడన్నం పుట్టని కుటుంబాలు, అనారోగ్యంతో సావాసం చేస్తున్న నిరుపేదలు.. ఈ సమస్యల నిర్మూలనే ఈ ఉమ్మీద్ గ్రూప్ లక్ష్యం. అందుకోసం జనాన్ని చైతన్య పరచే ప్రచారోద్యమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ఉన్నత ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తోంది.

 

 ఇవి కొన్ని...

-    ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ (ఈఈజీ)లో సభ్యులుగా చేరి రెండేళ్లుగా ఇరుపు పొరుగు దేశాల్లో రీసైక్లింగ్ ప్రోగ్రాంలపై అవగాహన కల్పిస్తున్నారు

 -    ఇండియాలోని పలు గిరిజన తండాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశారు.

 -    దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాలు నిర్వహించే ఒక క్యాంప్‌ని దత్తత తీసుకుని అక్కడి కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

 -   ఉత్తరాఖండ్‌లో వరద బాధితుల కోసం దుస్తులు సేకరించారు, అక్కడ రైతుల జీవనాధారం

 కోసం యాపిల్ మొక్కలు నాటించారు.

 -    విద్యుత్, నీటి పొదుపు ఆవశ్యకత వివరిస్తూ ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు

 

 అదృష్టంగా భావిస్తున్నా..

 నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పటి నుంచి ఈ సేవా పనులు మొదలు పెట్టాం. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఎందరో తిండి కోసం కష్టాలు పడుతున్నారు. అదే మమ్మల్ని కలచి వేసింది. సేవ చేసే ఆలోచన కలిగించింది. ఇదే స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తాం.

 - మహిమ త్రివేది

  మహి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top